compulsary
-
ఆక్వా లాబ్స్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కాట్రేనికోన (ముమ్మిడివరం) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ (ఎస్ఐఎఫ్టీ) ప్రిన్సిపాల్ పి.కోటేశ్వరరావు అన్నారు. ఆక్వా ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ల్యాబ్లను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ బృందం సభ్యులు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, కాట్రేనికోనలో పలు ఆక్వా ల్యాబ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆక్వా ల్యాబ్ జీఓ నెం.49 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్స్ ఎస్ఐఎఫ్టీ నోడల్ కేంద్రంగా పనిచేస్తాయన్నారు. నెట్ వర్కింగ్ ల్యాబ్ అనుసంధానంతో ల్యాబ్స్ నెల వారీ రిపోర్టింగ్, డీసీజ్ సర్వేలైన్స్ (వ్యాధులపై పర్యవేక్షణ, నిఘా), ల్యాబ్ సిబ్బంది రైతులకు అందిస్తున్న సేవలు, మొబైల్ ఆక్వా ల్యాబ్ల పనితీరుపై నిఘా ఉంటుంది. ప్రభుత్వ, ఫ్రైవేట్ ఆక్వా ల్యాబ్లు ఒక గొడుగు కిందకు తీసుకుని రావడంతో వివిధ ప్రాంతాలలో విజృంభిస్తున్న వ్యాధులపై పర్యవేక్షణ–నిఘా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తూర్పుగోవారి జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 35, కృష్ణాజిల్లా 39, గుటూరు 8, ప్రకాశం 12, నెల్లూరు 27, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయన్నారు. అనంతరం పల్లంలో బాక్స్ కల్చర్ విధానంపై మత్స్యశాఖ చేపడుతున్న పీతల కల్చరును పరిశీలించారు. ఈ బృందంలో కాకినాడ, అమలాపురం మత్స్యశాఖ డీడీలు రామ్మోహనరావు, జయరావు, ఏడి రామచంద్రరావు, శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త సందీప్, ఎస్ఐఎఫ్టీ మైక్రోబయాలజీ ల్యాబ్ ఎఫ్డీఓ షేక్ దిల్షాద్ తదితరులు ఉన్నారు. -
అన్నింటికీ ఆధారే కీలకం : డీఎస్ఓ
అంబాజీపేట : రాబోయే రోజుల్లో ప్రతి అవసరానికీ ఆధార్ కార్డే కీలకం కానుందని డీఎస్ఓ జి.ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన అంబాజీపేటలో ఓ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుతో మాట్లాడుతూ ఆధార్ చట్టబద్ధమైందని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలతో పాటు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో సభ్యులంతా వేలిముద్రలను ఆధార్ సెంటర్ వద్ద తీయించుకోవాలన్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రతి నెలా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీలో ఈ పోస్ విధానాన్ని మరింత వేగవంతం చేసేందుకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట ఏఎస్ఓ పి.నిత్యానందం, ఎంఎస్ఓలు ఉన్నారు. -
'మూడు భాషల్లో బోధన ఉండేలా చూడండి'
గువాహటి: సీబీఎస్ఈ పాఠశాలల్లో మూడు భాషల్లో విద్యను బోధించేలా చూస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇవ్వాలని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులు కోరారు. రాష్ట్ర భాషతోపాటు.. ఆంగ్లము, హిందీని తప్పనిసరిగా బోధించే నియమనిబంధనలు పకడ్బంధీగా సీబీఎస్ఈ పాఠశాలల్లో అమలు చేయాలని విన్నవించారు. ఫ్రెండ్స్ ఆఫ్ అస్సాం అండ్ సెవన్ సిస్టర్స్(ఎఫ్ఏఎస్ఎస్) అనే ఓ అంతర్జాతీయ స్థాయికి చెందిన సంస్థ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. ఇందులో సీబీఎస్ఈ పాఠశాలల్లో ఆంగ్ల భాషే ప్రధానంగా విద్యాబోధన జరుగుతుందని, అయితే, హిందీతోపాటు, ప్రాంతీయ మాతృభాషను విద్యార్థులు తప్పకుండా నేర్చుకోవాలనే నిబంధన చేర్చాలని అందులో కోరింది. ఇటీవల కాలంలో సంస్కృతం, జర్మనీ వంటి భాషలను కూడా చేర్చాలనే విషయంపై చర్చ జరిగిందని ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని మాతృభాషల్లో సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధన జరిగేలా చూడాలని తెలిపారు.