కంప్యూటర్ అనుకరణలకు నోబెల్
స్టాక్‌హోం: అతి క్లిష్టమైన రసాయన ప్రక్రియలను అణుస్థాయిలో వివరించేందుకు ఉపయోగపడే కంప్యూటర్ సిమ్యులేషన్స్ (అనుకరణలు)ను రూపొందించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన నోబెల్ దక్కింది. అమెరికా-ఆస్ట్రియన్ మార్టిన్ కార్ప్లస్(83), అమెరికా-బ్రిటిషర్ మైకేల్ లెవిట్(66), అమెరికా-ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఆరీ వార్షెల్(72) ఈ ఏడాది రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారని బుధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. మన నిత్యజీవితంలో కీలకమైన రసాయన ప్రక్రియలకు వీరు ముగ్గురూ కంప్యూటర్ అనుకరణలు (నమూనాలు) రూపొందించారని, వాటి సాయంతో దాదాపు అన్ని రసాయన ప్రక్రియలనూ అత్యంత సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడంతోపాటు ఆ చర్యల క్రమాన్ని ఊహించవచ్చని నోబెల్ జ్యూరీ పేర్కొంది. ‘వీరు ఆవిష్కరించిన సిమ్యులేషన్స్‌తో ఔషధ పరిశ్రమల్లో అనేక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. మనిషి శరీరంలో జరిగే రసాయన మార్పులనూ మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. సౌరవిద్యుత్ ఘటాలు, ఔషధాల సామర్థ్యం పెంచేందుకు, ఇంకా అనేక రకాలుగా వీరి అనుకరణలు ఉపయోగపడతాయి’ అని ప్రశంసించింది. విజేతలు ముగ్గురూ అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నారు. వీరికి డిసెంబర్ 10న స్టాక్‌హోంలో బహుమతి ప్రదానం జరగనుంది. అవార్డు కింద ముగ్గురికీ కలిపి 8 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.7.73 కోట్లు) అందజేస్తారు.
ఫిజిక్స్ నోబెల్ విజేతల నిర్ణయంలో తప్పు జరిగింది!
భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలను నిర్ణయించడంలో తప్పిదం జరిగిందంటూ బుధవారం నోబెల్ అవార్డు కమిటీ సభ్యుడు ఆండర్స్ బరానీ వ్యాఖ్యానించారు. దైవకణం గురించి పరిశోధనలు చేసినందుకు పీటర్ హిగ్స్, ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్‌లకు మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రయోగం ద్వారా గతేడాది దైవకణం ఉనికిని ‘సెర్న్’ లేబొరేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నందున, సెర్న్‌కు కూడా నోబెల్ ఇచ్చి ఉండాల్సిందని ఆండర్స్ అన్నారు.
సత్యేంద్రనాథ్ బోస్ కుమారుడి హర్షం...
దైవకణం (హిగ్స్ బోసాన్) గురించి మొట్టమొదటగా తన తండ్రి సత్యేంద్రనాథ్ బోస్ ప్రతిపాదించగా.. ఆ అంశంపై తదనంతర పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఫిజిక్స్‌లో నోబెల్ లభించడంపై బోస్ కుమారుడు రతీంద్రనాథ్ బోస్ బుధవారం కోల్‌కతాలో హర్షం వ్యక్తంచేశారు. సత్యేంద్రనాథ్కు నోబెల్ రాకపోవడంపై మాట్లాడుతూ తన తండ్రి కృషిని ఎలాంటి అవార్డులతోనూ కొలవలేమని, ఆయన ప్రతిపాదన వల్ల ఇతరులకైనా నోబెల్ రావడం ఆనందమేనన్నారు.