ఒక్క రూపాయి వివాదంతో.. నిలిచిన బస్సులు
ప్రయాణికులకు, కండక్టర్‌కు ఒక్క రూపాయి చిల్లర విషయంలో జరిగిన వివాదంతో జంట నగరాల్లో దాదాపు సగం సిటీబస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఉప్పల్ డిపో పరిధిలో పనిచేసే రత్నకుమారి అనే కండక్టర్‌కు, ఒక ప్రయాణికురాలికి గొడవ జరిగింది. సదరు ప్రయాణికురాలికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉండగా, కండక్టర్ వద్ద చిల్లర లేదని.. దానిపై ఇద్దరికీ మాట మాట పెరగడంతో ప్రయాణికురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు.
దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రత్నకుమారిని సస్పెండ్ చేశారని.. అందుకు నిరసనగా హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు డిపోలకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని కొందరు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఉదయం నుంచి బస్సులు తక్కువగా తిరగడం, షేర్ ఆటోల మీదే ఆధారపడాల్సి రావడంతో అసలు ఏంజరిగిందో కూడా సామాన్య ప్రజలకు చాలాసేపటి వరకు తెలియలేదు. ఉన్నట్టుండి బస్సులు నిలిచిపోవడంతో ఉదయం కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు.