బాధితులకు పరామర్శ
హిందూపురం అర్బన్ : అధికారం ఉందనే సాకుతో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పరిగి మండలం పైడేటి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రెండు రోజుల క్రితం టీడీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితులు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేరారు. వారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ శనివారం సాయంత్రం పరామర్శించారు.
వివరాలు.. పైడేటి గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దేవాదప్పతో టీడీపీ నాయకులు నంజుండప్ప, గోవిందు, రామాంజినేయులు గొడవపడి కొట్టారు. అనంతరం దేవాదప్ప మనుషులు సత్యప్రకాష్, ఆదినారాయణ, ఆదెమ్మ టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు నలుగురిపై మూకుమ్మడిగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో సత్యప్రకాష్, దేవాదప్ప, ఆదినారాయణకు తలలు పగిగాయి. ఈమేరకు టీడీపీ నాయకులు వెంకటేష్, దినేష్, నారప్ప, ఆదిలక్ష్మి తమపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
బాధితులపై కేసులు నమోదు చేయడమేంటి ?
ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణంలో శంకర్‌నారాయణ, నవీన్‌నిశ్చల్ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి, స్థానిక ఎంపీపీ సత్యనారాయణ ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడిలో గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న పెనుకొండ నియోజకవర్గంలో కక్షలు, దౌర్జన్యాలను ఉసి కొల్పుతున్నారని మండిపడ్డారు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.