హెలికాప్టర్ల కోసం ఇక హెలిపోర్ట్స్
♦ ప్రారంభంలో నాలుగు హెలిపోర్ట్‌ల నిర్మాణం
♦ పదేళ్లలో కొత్త హెలికాప్టర్లకు 50 వేల కోట్లు కావాలి
♦ పవన్ హన్స్ సీఎండీ బి.పి. శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విస్తరిస్తున్న హెలికాప్టర్ల పరిశ్రమ కోసం ప్రత్యేక హెలిపాడ్స్ ఉండేలా హెలిపోర్ట్స్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్ తెలియజేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ, గౌహతి, ముంబైలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక చోట ఈ హెలీపోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ హన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ బి. పి. శర్మ తెలిపారు. ఒక హెలిపోర్ట్ నిర్మాణానికి రూ. 400 కోట్లు వ్యయం అవుతుందని, జూన్ నాటికి ఢిల్లీ హెలిపోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత విమానాశ్రయాల్లో అత్యవసర సమయాల్లో హెలికాప్టర్లు ఎగరడానికి చాలాసేపు ఎదురు చూడాల్సి వస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా ప్రలి జిల్లాలో ఒక హెలీ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమని చెప్పారాయన.
హెలీ టూరిజం, అత్యవసర సేవలు, హెలీ అంబులెన్స్‌లకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 270 హెలికాప్టర్లు ఉండగా పదేళ్లలో వీటి సంఖ్య 1,000 దాటుతుందని, ఇందుకోసం రూ. 50,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రస్తుతం మా దగ్గర 43 హెలికాప్టర్లు ఉన్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య 100కి చేరుతుంది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని వివరించారాయన. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ సమస్యతోపాటు హెలీ టూరిజంకు ఉన్న అవకాశాలపై రెండు రాష్ట్రాలతో శుక్రవారం చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఎయిర్‌బస్‌తో కలిపి ముంబైలో ఎంఆర్వో యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇరు సంస్థలు ఇంచుమించు అంగీకారానికి వచ్చాయని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని శర్మ చెప్పారు.