Construction material prices
-
ప్రాజెక్టుల్లో జాప్యంతో రూ.4.52 లక్షల కోట్ల భారం
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల్లో జాప్యం వాటి నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచేస్తోంది. రూ.150 కోట్లు, అంతకుమించి వ్యయంతో కూడిన మొత్తం 1,529 ప్రాజెక్టులకు గాను 384 ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల.. రూ.4.52 లక్షల కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక వెల్లడించింది. అలాగే, మొత్తం 662 ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నట్టు పేర్కొంది. ‘‘1,529 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.21,25,851 కోట్లు. కానీ, నిర్మాణం పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.25,78,197 కోట్లకు చేరనుంది. అంటే రూ.4,52,345 కోట్ల అదనపు వ్యయం కానుంది’’అని వివరించింది. 2022 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ.13,78,142 కోట్లుగా ఉంది. 662 ప్రాజెక్టుల్లో 1–12 నెలల ఆలస్యంతో నడుస్తున్నవి 133 ఉన్నాయి. 124 ప్రాజెక్టులు 13–24 నెలలు, 276 ప్రాజెక్టులు 25–60 నెలలు, 129 ప్రాజెక్టులు వాస్తవ గడువుతో పోలిస్తే 61 నెలలకు మించి ఆలస్యంగా సాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టులకు కావాల్సిన రుణాల సమీకరణలో ఆలస్యం కారణాలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్‌లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్‌ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
కలిసే కట్టేద్దాం!
మినీ అపార్టమెంట్లతో మనీ ఆదా బృందంగా ఏర్పడి ఫ్లాట్ల నిర్మాణంభాగ్యనగరంలో సొంతిల్లంటే మాములు విషయం కాదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో నిర్మాణ సంస్థ నుంచి ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా రూ.35 లక్షలకు పైచిలుకే చెల్లించాలి. అదే ఇంటిని రూ.30 లక్షల లోపే సొంతం చేసుకోవాలంటే!? కోట్లు పలికే స్థలం.. చుక్కలు చూపించే నిర్మాణ సామగ్రి ధరలున్న ఈరోజుల్లో ఇదేలా సాధ్యమంటారా!? తక్కువ ఖర్చుతో.. నచ్చిన రీతిలో ఇంటిని సొంతం చేసుకోవడమే కాదు.. అనుబంధాల పునాదులను మరింత పటిష్టం చేస్తోంది ‘మినీ అపార్ట్మెంట్ కల్చర్’. - సాక్షి, హైదరాబాద్ నగరంలో సొంతింటి నిర్మాణం అంటే ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడిన వ్యవహారం. అంతేకాదు స్థలం ఖరీదు, నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో సొంతింటి కలను సులువుగా నిజం చేసుకుంటున్నారు నగరవాసులు. మిత్రులు, బంధువులు, ఒకే సంస్థ ఉద్యోగులు.. ఇలా అందరూ కలిసికట్టుగా స్థలం తీసుకొని మినీ అపార్ట్మెంట్లను కట్టుకుంటున్నారు. దీంతో మార్కెట్ రేటు కన్నా ఫ్లాట్ ధర 40 శాతం తగ్గడమే కాకుండా ఎవరికి నచ్చినట్లు వారు తమ ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఎవరో కట్టించిన వాటిలో కాకుండా.. తమకు అన్ని విధాలా నచ్చేలా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చన్నమాట. పక్కింటి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అన్న దిగులూ అక్కర్లేదు. పరిచయమున్నవారు.. ఒకే రకమైన మనస్తత్వం గలవారితో ఎంచక్కా పక్కపక్కనే నివసించొచ్చన్నమాట. కలిసి శ్రమిస్తేనే.. నగరంలో స్థలం ఎంపిక కొంత క్లిష్టమైన వ్యవహారం. ఇందుకోసం కొంత శ్రమిస్తే న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని స్థలం దొరుకుతుంది. అందరూ కలిసి సొమ్ము సమీకరించుకుని లేదా బ్యాంకు రుణసాయంతో కానీ స్థలాన్ని కొనుగోలు చేశాక.. అందులో ఎన్ని ఫ్లాట్లు కట్టాలి? ఎవరెవరికి ఎంతెంత విస్తీర్ణం ఇల్లుండాలి? వంటి విషయాలను నిపుణులతో చర్చించుకోవాలి. ఆర్కిటెక్ట్ సహాయంతో ఇంటి డిజైన్ ఖరారయ్యాక ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే సరి. రిజిస్ట్రేషనూ ఉండాల్సిందే.. బృందంగా అపార్ట్మెంట్లను నిర్మించేటప్పుడు, భూమిని కొనుగోలు చేసేటప్పుడు కాసింత జాగ్రత్తగా వ్యవహరించాలి. సేల్ డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బృందంలోని సభ్యులందరినీ వెండర్లుగా పేర్కొనాలి. సేల్ డీడ్ డాక్యుమెంట్‌లోనే ప్రపోజల్ కన్స్ట్రక్షన్ అని పేర్కొంటూ ఒక్కొక్కరూ ఎంత చ.అ.ల్లో నిర్మాణం చేపడతారో ముందుగానే చెబుతూ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒరిజినల్ కాపీని అందరు వెండర్ల దగ్గరా ఉంచుకుంటే చాలు. ఈ కాపీతో భవిష్యత్తులో ఒకిరితో ఒకరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి వారు విక్రయించుకోవచ్చు కూడా. బడ్జెట్‌పై అవగాహన.. బృందంగా కట్టేటప్పుడు నిర్మాణంలో దేనికెంత ఖర్చవుతుందనే విషయంపై అవగాహన ఉండాలి. ఆరంభంలో ప్రతి ఒక్కరూ 20 శాతం సొమ్ము చేతిలో పట్టుకోవాలి. మిగతా ఎనభై శాతం సొమ్మును బ్యాంకు రుణంగా తీసుకోవచ్చు. కట్టడమేదైనా భవన నిర్మాణ కార్మికులకు 30 నుంచి 35 శాతం వరకు, నిర్మాణ సామగ్రి, ఇతరత్రా కోసం 65 నుంచి 70 శాతం వరకూ ఖర్చవుతుంది. పునాదులు, ప్లింత్ లెవెల్ దాకా ఖర్చులో 10-15 శాతం, ఆ తర్వాతి పనులకు 85 నుంచి 90 శాతం వ్యయమవుతుంది. ఇలా కలిసికట్టుగా ఫ్లాట్లను నిర్మించుకోవటం వల్ల బయటి ఫ్లాట్లతో పోల్చుకుంటే చ.అ.కు రూ.500 వరకు ఆదా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో సొంతింటికి శ్రీకారం చుట్టేయండి. ఎంతో తేడా.. లక్షల్లో ఆదా.. ఓ పది మంది బృందంగా ఏర్పడి రోడ్డు పక్కన, అభివృద్ధి చెందిన ప్రాంతంలో మినీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాలనుకుంటే ఎంత ఖర్చవుతుందో ఓ సారి చూద్దాం. మొత్తం స్థలం విస్తీర్ణం: 600 గజాలు గజానికి రూ.20 వేలు అనుకుంటే స్థలం ఖరీదు :1.20 కోట్లు అంటే ఒక్కొక్కరికీ 60 గజాలకు గాను రూ.12 లక్షలు పడుతుందన్నమాట. వీటిని చ.అ.లకు మారిస్తే.. 600 గజాలకు 14,400 చ.అ. (గజానికి 22 చ.అ. నుంచి 24 చ.అ. వస్తుంది) అంటే ఒక్కొక్కరికి 1,440 చ.అ. ఫ్లాట్ ఏరియా వస్తుంది. ఇంటి నిర్మాణ వ్యయం పరిశీలిస్తే.. మధ్యస్థ తరహా నిర్మాణానికి చ.అ.కు రూ.1,300 అవుతుంది. (ప్రభుత్వ అనుమతులు, నిర్మాణ కార్మికుల ఖర్చులతో కలిపి) అంటే ్టఒక్కో ఫ్లాట్‌కు 18,72,000 అవుతుందన్నమాట. అంటే 1,440 చ.అ. ఫ్లాట్ ధర రూ.30,72,000. అంతే విస్తీర్ణం గల ఫ్లాట్‌ను.. అదే ప్రాంతంలో నిర్మాణ సంస్థ నుంచి కొంటే ఎంతలేదన్నా రూ.38 లక్షలకు పైగానే ఖర్చవుతుంది.