కలిసే కట్టేద్దాం! | Rs 35 lakh for flat | Sakshi
Sakshi News home page

కలిసే కట్టేద్దాం!

Published Sat, Dec 20 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

కలిసే కట్టేద్దాం!

కలిసే కట్టేద్దాం!

మినీ అపార్‌‌టమెంట్లతో మనీ ఆదా   బృందంగా ఏర్పడి ఫ్లాట్ల నిర్మాణంభాగ్యనగరంలో సొంతిల్లంటే మాములు విషయం కాదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో నిర్మాణ సంస్థ నుంచి ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా రూ.35 లక్షలకు పైచిలుకే చెల్లించాలి. అదే ఇంటిని రూ.30 లక్షల లోపే సొంతం చేసుకోవాలంటే!? కోట్లు పలికే స్థలం.. చుక్కలు చూపించే నిర్మాణ సామగ్రి ధరలున్న ఈరోజుల్లో ఇదేలా సాధ్యమంటారా!? తక్కువ ఖర్చుతో.. నచ్చిన రీతిలో ఇంటిని సొంతం చేసుకోవడమే కాదు.. అనుబంధాల పునాదులను మరింత పటిష్టం చేస్తోంది ‘మినీ అపార్ట్‌మెంట్ కల్చర్’.

 - సాక్షి, హైదరాబాద్
 
నగరంలో సొంతింటి నిర్మాణం అంటే ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడిన వ్యవహారం. అంతేకాదు స్థలం ఖరీదు, నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో సొంతింటి కలను సులువుగా నిజం చేసుకుంటున్నారు నగరవాసులు. మిత్రులు, బంధువులు, ఒకే సంస్థ ఉద్యోగులు.. ఇలా అందరూ కలిసికట్టుగా స్థలం తీసుకొని మినీ అపార్ట్‌మెంట్లను కట్టుకుంటున్నారు. దీంతో మార్కెట్ రేటు కన్నా ఫ్లాట్ ధర 40 శాతం తగ్గడమే కాకుండా ఎవరికి నచ్చినట్లు వారు తమ ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఎవరో కట్టించిన వాటిలో కాకుండా.. తమకు అన్ని విధాలా నచ్చేలా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చన్నమాట. పక్కింటి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అన్న దిగులూ అక్కర్లేదు. పరిచయమున్నవారు.. ఒకే రకమైన మనస్తత్వం గలవారితో ఎంచక్కా పక్కపక్కనే నివసించొచ్చన్నమాట.
 
కలిసి శ్రమిస్తేనే..
నగరంలో స్థలం ఎంపిక కొంత క్లిష్టమైన వ్యవహారం. ఇందుకోసం కొంత శ్రమిస్తే న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని స్థలం దొరుకుతుంది. అందరూ కలిసి సొమ్ము సమీకరించుకుని లేదా బ్యాంకు రుణసాయంతో కానీ స్థలాన్ని కొనుగోలు చేశాక.. అందులో ఎన్ని ఫ్లాట్లు కట్టాలి? ఎవరెవరికి ఎంతెంత విస్తీర్ణం ఇల్లుండాలి? వంటి విషయాలను నిపుణులతో చర్చించుకోవాలి. ఆర్కిటెక్ట్ సహాయంతో ఇంటి డిజైన్  ఖరారయ్యాక ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే సరి.
 
రిజిస్ట్రేషనూ ఉండాల్సిందే..
బృందంగా అపార్ట్‌మెంట్లను నిర్మించేటప్పుడు, భూమిని కొనుగోలు చేసేటప్పుడు కాసింత జాగ్రత్తగా వ్యవహరించాలి. సేల్ డీడ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బృందంలోని సభ్యులందరినీ వెండర్లుగా పేర్కొనాలి. సేల్ డీడ్ డాక్యుమెంట్‌లోనే ప్రపోజల్ కన్‌స్ట్రక్షన్ అని పేర్కొంటూ ఒక్కొక్కరూ ఎంత చ.అ.ల్లో నిర్మాణం చేపడతారో ముందుగానే చెబుతూ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒరిజినల్ కాపీని అందరు వెండర్ల దగ్గరా ఉంచుకుంటే చాలు. ఈ కాపీతో భవిష్యత్తులో ఒకిరితో ఒకరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి వారు విక్రయించుకోవచ్చు కూడా.
 
బడ్జెట్‌పై అవగాహన..
బృందంగా కట్టేటప్పుడు నిర్మాణంలో దేనికెంత ఖర్చవుతుందనే విషయంపై అవగాహన ఉండాలి. ఆరంభంలో ప్రతి ఒక్కరూ 20 శాతం సొమ్ము చేతిలో పట్టుకోవాలి. మిగతా ఎనభై శాతం సొమ్మును బ్యాంకు రుణంగా తీసుకోవచ్చు. కట్టడమేదైనా భవన నిర్మాణ కార్మికులకు 30 నుంచి 35 శాతం వరకు, నిర్మాణ సామగ్రి, ఇతరత్రా కోసం 65 నుంచి 70 శాతం వరకూ ఖర్చవుతుంది. పునాదులు, ప్లింత్ లెవెల్ దాకా ఖర్చులో 10-15 శాతం, ఆ తర్వాతి పనులకు 85 నుంచి 90 శాతం వ్యయమవుతుంది. ఇలా కలిసికట్టుగా ఫ్లాట్లను నిర్మించుకోవటం వల్ల బయటి ఫ్లాట్లతో పోల్చుకుంటే చ.అ.కు రూ.500 వరకు ఆదా అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలతో సొంతింటికి శ్రీకారం చుట్టేయండి.
 
ఎంతో తేడా.. లక్షల్లో ఆదా..
ఓ పది మంది బృందంగా ఏర్పడి రోడ్డు పక్కన, అభివృద్ధి చెందిన ప్రాంతంలో మినీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాలనుకుంటే ఎంత ఖర్చవుతుందో ఓ సారి చూద్దాం.
మొత్తం స్థలం విస్తీర్ణం: 600 గజాలు
గజానికి రూ.20 వేలు అనుకుంటే స్థలం ఖరీదు :1.20 కోట్లు
అంటే ఒక్కొక్కరికీ 60 గజాలకు గాను రూ.12 లక్షలు పడుతుందన్నమాట. వీటిని చ.అ.లకు మారిస్తే.. 600 గజాలకు 14,400 చ.అ.  (గజానికి 22 చ.అ. నుంచి 24 చ.అ. వస్తుంది) అంటే ఒక్కొక్కరికి 1,440 చ.అ. ఫ్లాట్ ఏరియా వస్తుంది.
 
ఇంటి నిర్మాణ వ్యయం పరిశీలిస్తే..
మధ్యస్థ తరహా నిర్మాణానికి చ.అ.కు రూ.1,300 అవుతుంది.
(ప్రభుత్వ అనుమతులు, నిర్మాణ కార్మికుల ఖర్చులతో కలిపి) అంటే  ్టఒక్కో ఫ్లాట్‌కు 18,72,000 అవుతుందన్నమాట.
అంటే 1,440 చ.అ. ఫ్లాట్ ధర రూ.30,72,000. అంతే విస్తీర్ణం గల ఫ్లాట్‌ను.. అదే ప్రాంతంలో నిర్మాణ సంస్థ నుంచి కొంటే ఎంతలేదన్నా రూ.38 లక్షలకు పైగానే ఖర్చవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement