The construction sector
-
28న క్రెడాయ్ రియల్టీ పురస్కారాలు
హైదరాబాద్, సిటీ బ్యూరో: నిర్మాణ రంగంలో నాణ్యతతో పాటు వినియోగదారుడి భద్రతకు పెద్దపీట వేసిన డెవలపర్‌ను ప్రోత్సహించేందుకే పురస్కారాలను ఆరంభించినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ శాఖ ఛైర్మన్ గుమ్మి రామిరెడ్డి, అధ్యక్షుడు సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారమిక్కడ విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న క్రియేట్–2019 పేరిట హైదరాబాద్ ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’లో క్రెడాయ్ తెలంగాణ రియాల్టీ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని, మొత్తం 13 విభాగాల్లో 103 నామినేషన్లు వచ్చాయని వారు తెలియజేశారు. రేటింగ్ సంస్థ క్రిసిల్ ద్వారా ఆయా ప్రాజెక్టుల లొకేషన్, గ్రీనరీ, నాణ్యత, వినియోగదారుడి భద్రతను పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా అవార్డులకు ఎంపిక జరుగుతుందని తెలియజేశారు. ఏపీలో 3 రాజధానులు సరైన నిర్ణయమే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధానుల విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని క్రెడాయ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. విలేకరులడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో రాజధానులు వస్తే మరింత పురోగతి సాధ్యపడుతుందన్నారు. సమావేశంలో క్రెడాయ్ కార్యదర్శి ప్రేమ్‌సాగర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.ఇంద్రసేనా రెడ్డి, జి.అజయ్‌కుమార్, కోశాధికారి బి.పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. -
నిర్మాణరంగ కార్మికులకు సర్కారు చేయూత
వీరు అర్హులు నిర్మాణ రంగంలో మట్టిపని, గుంతలు తీయటం, చదును చేయటం, ఫిట్టర్లు, తాపీ మేస్త్రీలు, తాపీ కూలీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మార్బుల్, గ్రానైట్, టైల్స్ మొదలగు ఫ్లోరింగ్ పనిచేయువారు పాలిషింగ్, సెంట్రింగ్, సీలింగ్ వర్క్, పెయింటింగ్, రోడ్డు నిర్మాణ కార్మికులు, సూపర్ వైజర్లు, అకౌంటెంట్స్, ఇటుకల తయారీకార్మికులు, చెరువులు, బావులు పూడిక తీయుట, తవ్వుట మొద లైన పనులు చేసే వారు నమోదు ఇలా.. 90 రోజుల పాటు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఉండాలి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు జిరాక్సులను జతపరిచి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని లేబర్ కార్యాల యంలో సంబంధిత సర్కిల్ లేబర్ అసిస్టెంట్ అధికారికి అందించాలి. బ్యాంకులో రూ.62తో కార్మిక శాఖ పేరు మీద చలాన్ చెల్లించాలి. ఈ మొత్తం ఒక సంవత్సరానికి మాత్రమే. రెండో సంవత్సరం రెన్యువల్ కోసం రూ.12 బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లించాలి. సదుపాయాలు ఇవీ.. భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేయించుకున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యానికి గురైనా ప్రభుత్వం వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. {పమాదం వలన 50 శాతం అంగవైకల్యం కలిగితే రూ. లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కార్మికురాలి ప్రసూతి సహాయార్థం రూ.5000, కార్మికుడు/కార్మికురాలు సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు ప్రభుత్వం ద్వారా పొందవచ్చు. నిర్మాణ రంగంలోని వారికి జాతీయ నిర్మాణ శిక్షణ ద్వారా శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది. -
నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగం, ప్రభుత్వం మధ్య సంధానకర్తగా పనిచేస్తున్న జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరెడ్కో) తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు నరెడ్కో వైస్ ప్రెసిడెంట్ ఆర్ చలపతి రావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. స్థిరాస్తి రంగంలోని క్షేత్ర స్థాయిలోని సమస్యల్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గాను మంత్రిత్వ శాఖలను నరెడ్కోలో చీఫ్ ప్యాట్రన్స్‌గా నియమిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నరెడ్కో చీఫ్ ప్యాట్రన్‌గా గృహ మరియు పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారన్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన నరెడ్కో తెలంగాణ చీఫ్ ప్యాట్రన్‌గా కేసీఆర్ ఉండాలని ఇటీవల ఆయన్ని కోరామని చెప్పారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 12న ఢిల్లీలో నరెడ్కో 12వ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం. 2022 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 18.7 మిలియన్లు, గ్రామీణ ప్రాంతాల్లో 43.7 మిలియన్ ఇళ్ల కొరత ఏర్పడుతుంది. వీరందరికి సొంతిల్లు కల్పించాలంటే సుమారుగా రూ.1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వంటి పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో నిధుల కొరత తీరుతుంది. -
రెండు వారాలుగా సిమెంట్ కొనుగోళ్లు బంద్
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా ఉంది భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి. అమాంతం పెరిగిన సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం పడకేసింది. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నిర్మాణ రంగంపై ఆధారపడి సుమారుగా 60 వేల మంది కార్మికులున్నారు. రాడ్ బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ వంటి సుమారు 26 విభాగాలు నిర్మాణ రంగానికి అనుబంధంగా తమ కార్యకలాపాలను సాగిస్తుంటాయి. అయితే ఒక్కసారిగా సిమెంట్ బస్తా (50 కిలోలు) ధర రూ.100కు పైగా పెరగడాన్ని నిరసిస్తూ సిమెంటు కొనుగోళ్లకు బిల్డర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రెండు వారాలు బ్రేక్ వేసింది. దీంతో నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు లేక పోవడంతో.. రెక్కాడితే గారీ డొక్కాడని కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు వారాలుగా కూలీ లేక పూట గడవడమే కష్టంగా మారిందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 20 వేల ఫ్లాట్లకు బ్రేకులు.. ఏటా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రభుత్వ విభాగాల నుంచి 35 వేల ఇంటి దరఖాస్తులు అనుమతులు పొందుతుంటే.. ప్రస్తుతం వీటిలో సుమారుగా 20 వేల ఫ్లాట్లు నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే సిమెంట్ హాలిడే ప్రకటించడంతో ఈ ఫ్లాట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారులకు ఇచ్చిన సమయంలోగా ఫ్లాట్లను అందించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన సిమెంట్ ధరతో ప్రాజెక్ట్ వ్యయమూ పెరుగుతుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చ.అ.కు రూ.300కు పైగా పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శేఖర్ చెప్పుకొచ్చారు. అంటే ఈ భారం మళ్లీ సామాన్యుడి నెత్తిపైనే పడనుందన్నమాట. రెండు వారాల్లో రూ.37.80 కోట్లు నగరంలో 50-60 వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న చెప్పారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా తాపీమేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి (శ్లాబులు వేసేవాళ్లు), మట్టి లేబర్, వండ్రంగి, పెయింటర్, కార్పెంటర్ ఇలా నిర్మాణ రంగంలోని వివిధ దశల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి ఒక్క రోజుకు మేస్త్రీకి రూ.500, హెల్పర్‌కు రూ.400, మహిళలకు రూ.300 కూలీ చెల్లిస్తుంటారు. అయితే 14 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కూలీలంతా కలసి రూ.కోట్లలో నష్టపోయారు. ఎలాగంటే రోజుకు 60,000 (కూలీలు) 5 450 (సగటున దినసరి కూలీ) = 2,70,00,000. మొత్తం 14 రోజులకు చూసుకుంటే.. అక్షరాల రూ.37.80 కోట్లు నష్టపోయారన్నమాట. -
కొరతను అధిగమిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు. నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది. కొరతను తీర్చే మార్గమిదే.. విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.