కొరతను అధిగమిస్తేనే.. | if cross the shortage | Sakshi
Sakshi News home page

కొరతను అధిగమిస్తేనే..

Published Sat, May 24 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

if cross the shortage

సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు.

  నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది.

 కొరతను తీర్చే మార్గమిదే..
   విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement