Carpenter
-
రాహుల్ స్టైలే వేరు..రోజుకో అవతారం
-
కార్పెంటర్ క్రియేటివిటీకి మంత్రి కేటీఆర్ ఫిదా..
-
కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు
ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు) నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్‌లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!) Absolutely great skill Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY — KTR (@KTRBRS) August 16, 2023 -
మహిళను చంపి, ముక్కలుగా నరికి..
శ్రీనగర్: ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఇది. జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో షబీర్ అహ్మద్ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్ ఓ మహిళ(30)ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు. మార్చి 7వ తేదీన కోచింగ్ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ వనీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది!
యశవంతపుర(బెంగళూరు): ఉడుపి మల్పె వద్ద అరేబియా సముద్రంలో అపురూపమైన చేప వలలో పడింది. సా ఫిష్ (రంపపు చేప)గా దీనిని పిలుస్తారు. 250 కేజీలున్న చేపను ఆదివారం జాలర్లు బోటులో తెచ్చి లారీలో మంగళూరుకు తరలించారు. చేప నోరు 10 అడుగుల పొడవైన రంపంలా ఉంది. దీనిని చూడడానికి స్థానికులు, పర్యటకులు బారులుతీరారు.ఈ జాతి చేపలు అంతరించే దశకు చేరుకున్నాయి. -
ఫ్రెండ్ భార్యపై కన్ను, పగబట్టి దారుణ హత్య
అమీర్‌పేట: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతోనే ఫ్లంబర్ కమల్ మైతి (50)ని హత్య చేసినట్లు కార్పెంటర్ పలాష్ పాల్ పోలీసులకు తెలిపాడు. బోరబండ ఎస్పీఆర్హిల్స్ హనుమాన్ స్టోన్ కట్టర్స్ ఇందిరానగర్‌లో ఫేజ్–2లోని శ్రీ మాతా పోచమ్మ సహిత శ్రీ కనకదుర్గా భవానీ, శివదత్త, మారుతీ స్వరూప షిరిడి సాయిబాబా ఆలయం సెల్లార్‌లోని కార్పెంట్ షాపులోని పెట్టెలో అస్తి పంజరం బయట పడిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఎస్ఆర్నగర్ పోలీసులు పాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పథకం ప్రకారం కమల్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్ 2009లో నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ నిర్మాణ సంస్థలో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఫ్లంబర్‌గా పనిచేసే కమల్ మైతితో అక్కడే పరిచయం ఏర్పడింది. పాల్, కమల్‌ది ఒకే ప్రాంతం కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో కమల్ భార్య భవానీ మైతితో పలాష్‌పాల్ వివాహేతర సంబంధం ఏర్పచుకున్నాడు. ఈ విషయం కమల్‌కు తెలియడంతో ఆమెను మందలించడంతో పాటు ఆమె తల్లి దండ్రులకు విషయాన్ని తెలిపాడు. అప్పటి నుంచి భవానీ మైతి పాల్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. భర్త కారణంగానే తనకు ఆమె దూరమైందని భావించిన పలాష్.. కమల్ హత్యకు పథకం వేశాడు. ఎస్పీఆర్ హీల్స్‌లో కమల్ ఇంటిని నిర్మిస్తుండగా డోర్స్, కిటికీలు అమర్చే పనిని పాల్ తీసుకున్నాడు. 2020 జనవరి 10న కమల్‌కు ఫోన్ చేసి డోర్స్ అన్నీ తయారు అయ్యాయని వచ్చి చూసుకోవాలని చెప్పాడు. దీంతో కమల్ కార్పెంటర్ షాపులోకి వెళ్లగానే దువ్వడ పట్టే కర్రతో కమల్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో భార్య భాబానీ మైతి మరుసటి రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్యతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. చదవండి: Ghatkesar: అత్యాచార ఘటన సూత్రధారి శివ? కాకినాడలో కార్పొరేటర్ దారుణ హత్య -
కార్పెంటర్ షాప్‌లో అస్థిపంజరం
అమీర్‌పేట(హైదరాబాద్): బోరబండ ఇందిరానగర్ ఫేజ్–2లో బుధవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. కార్పెంటర్ షాపులో ఓ వ్యక్తి అస్థి పంజరం బయటపడింది. షాపు యజమానే ఎవరినో హత్య చేసి పెట్టెలో పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్ అనే వ్యక్తి గాయత్రీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇందిరానగర్‌లోని కనకదుర్గా భవానీ, షిరిడీ సాయిబాబా ఆలయం కింద ఉన్న సెల్లార్‌ను 2017లో అద్దెకు తీసుకుని కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు. సంవత్సరంపాటు ప్రతినెలా అద్దెను చెల్లిస్తూ వచ్చిన పాల్ ఆ తరువాత వాటిని సకాలంలో ఇవ్వడం లేదు. పాల్ ప్రతినెలా అద్దె ఇవ్వని కారణంగా షాపు ఖాళీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం వచ్చి ట్రస్టు సభ్యుల సమక్షంలో షాపు తాళాలు తెరిచి అందులోని సామాన్లను ఓ చోట భద్రపరిచాలని సూచించారు. అనంతరం గోవర్ధన్ అనే వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారు. బుధవారం ఉదయం షాపులో ఓ పక్కకు కనిపించిన పెట్టెను గోవర్ధన్ తెరిచి చూడగా అస్థిపంజరం బటయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పెట్టెలోని అస్థిపంజరాన్ని బయటకుతీశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కార్పెంటర్ పలాష్ పాల్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వండ్రంగి పని చేస్తూ.. హిందీ కంటెంట్ కింగ్ అయ్యాడు
డాక్టర్‌ను కాబోయి యాక్టర్నయా అంటుంటారు కొందరు నటులు. అలాగే 22 ఏళ్ల రాజు జంగిడ్ కార్పెంటర్‌గా కెరీర్ మొదలుపెట్టి వికీపీడియా కంటెంట్ సమీక్షకుడుగా ఎదిగాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా థడియా అనే కుగ్రామంలో పేదరికంలో జన్మించిన రాజు చదువుకుంటూనే వండ్రంగి (కార్పెంటర్) పనిచేసేవాడు. ఇటుపని అటు చదువుతోపాటు రాజుకు వికీపీడియాలో ఆర్టికల్స్ చదవడం ఒక అలవాటుగా ఉండేది. దీంతో తనకు దేనిగురించైనా సమాచారం కావాలంటే వెంటనే వికీమీద పడిపోయేవాడు. అయితే తన మాతృభాష హిందీ కావడంతో హిందీలోనే కంటెంట్‌ను వెతికేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి తన గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి వికీలో వెతకగా ఎక్కడా సమాచారం దొరకలేదు. రాజ్యభాష అయిన హిందీలో సమాచారం ఎక్కువగా లేకపోవడం ఏంటీ అనుకుని.. వికీలో హిందీ భాషలో మరింత సమాచారం అందుబాటులో ఉండాలని భావించి వికిపీడియా వలంటీర్‌గా చేరి హిందీలో ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. అలా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే కంటెంట్ రైటర్‌గా మారాడు. అలా రాసే క్రమంలో తన ఊరి చుట్టుపక్కల సమాచారాన్ని అక్కడి అధికారులతో మాట్లాడి వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు. రాజు పదో తరగతి పూర్తయినా తన ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో చదువు మానేసి వడ్రంగి పనిలో చేరాడు. పనిచేస్తూనే వీలు దొరికినప్పుడల్లా వికీ ఆర్టికల్స్‌ను రాస్తూ, పేజీలను ఎడిట్ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అందించారు. ఇక అప్పటినుంచి రాజు హైక్వాలిటీ కంటెంట్ ఇవ్వడంతోపాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు. ఇప్పటిదాక రాజు 57 వేల వికీపీడియా పేజీలను ఎడిట్ చేయడంతోపాటు 1,880 ఆర్టికల్స్‌ను రాశాడు. మనలో ఎన్ని నైపుణ్యాలున్నా పరిస్థితులతో పోరాడకపోతే గెలవలేమని చెబుతున్నాడు రాజు. ‘2013, 2014 సంవత్సరాలలో వికీలో ఆర్టికల్స్‌ను అప్లోడ్ చేసేవాడిని. కానీ వికీ అడ్మిన్లు నా ఆర్టికల్స్‌ను బ్లాక్ చేసేవాళ్లు. అలా ఎన్నోసార్లు జరిగిన తరువాత.. అసలు వికీవాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి మాత్రమే అప్లోడ్ చేసేవాడిని. ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా 150 నుంచి 200 పదాల ఆర్టికల్స్‌ను రాసేవాడిని. అయితే కీబోర్డు చాలా కష్టంగా అనిపించేది. ఆ తరువాత ల్యాప్‌టాప్ రావడంతో 400 పదాలకు పైగా ఆర్టికల్స్‌ను రాయగలిగాన’ని రాజు చెప్పాడు. 2017లో కార్పెంటర్ ఉద్యోగం మానేసిన రాజు మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగించి బిఏ డిగ్రీ పట్టాపుచ్చుకున్నాడు. సైబర్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వికీ స్పెషల్ ప్రాజెక్ట్ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. ఇందులో హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూనే ఇతర రంగాలకు చెందిన ఆర్టికల్స్ ను అందిస్తున్నాడు. హిందీలో వికీ క్రికెట్ ప్రాజెక్ట్ ప్రారంభించి 700 ఆర్టికల్స్‌ను కంట్రిబ్యూట్ చేశాడు. హిందీలో క్రికెట్‌కు సంబంధించిన ఆర్టికల్స్ తక్కువగా ఉండటంతో మంచి సమాచారం అందిస్తున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అయింది. కాగా ఇండియాలో హిందీ వికీలో మొత్తం 11 మంది మాత్రమే యాక్టివ్ కంట్రిబ్యూటర్లుగా ఉన్నారు. వీరిలో రాజు ఒకడు కావడం విశేషం. -
జీవిత చక్రం తిరగబడింది!
జీవితం.. కష్ట సుఖాల కలయిక సాగిపోయినంత వరకూ సాఫీనే.. ఆగిపోతే బండికాదు..మొండి కుటుంబం ఒడిదుడుకులు లేకుండా నడిచిందంటే.. జీవితం బాగుందంటే దానికో అర్థం..అవయవయాలన్నీ సక్రమంగా ఉంటే అందం.. ఆనందం అన్నీ సమ‘పాల’లా కలిసుంటే ఆరోగ్యం.. అదే మహాభాగ్యం..ఆయుష్షు బాగుంటే.. ప్రయాణం ప్రశాంతం అంటాం..లేదంటే ‘విధి’ అంటాం.. అదీ కాదంటే ‘కర్మ’ అనుకుంటాం. ఆ కుటుంబ దయనీయ గాథ ఇలాంటిదే..చిన్న కుటుంబం.. చింతలేదనుకున్నారు. అప్పుడే కష్టాల కడలి వారింటి తలుపు తట్టింది..కిడ్నీ వ్యాధి రూపంలో కీడుతలపెట్టింది.. దయలేని దారిద్య్రంపట్టి పీడిస్తోంది. మానవత్వం మనిషి రూపంలో ఉంటుందనే ఒకే ఒక్క ఆశ..రేపటి నవోదయం దిశగానిరుపేద కళ్లు నిరీక్షిస్తున్నాయి. అనంతపురం, వజ్రకరూరు: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కార్పెంటర్ దంపతులు చికిత్స, కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వజ్రకరూరు మండలం గంజికుంటకు చెందిన అంగడి షేక్ దాదాపీర్ కార్పెంటర్. ఇతనికి 2009 సంవత్సరంలో గుంతకల్లు పట్టణానికి చెందిన సహేరాబానుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు మహమ్మద్ నజీబ్ రెండో తరగతి, కుమార్తె సనాకౌసర్ ఎల్కేజీ చదువుతున్నారు. దాదాపీర్‌కు పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంది. ఈ విషయం రెండేళ్ల కిందట బయటపడింది. కిడ్నీ వద్ద నొప్పిగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స కోసం దాదాపు రూ.3లక్షల దాకా ఖర్చయ్యింది. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులో చేరాడు. వైద్య పరీక్షల్లో కిడ్నీ ఫెయిలైనట్లు తేలింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ (కిడ్నీ మార్పిడి) చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. భర్తకు కిడ్నీ దానం చేసిన భార్య దాదాపీర్‌కు అన్న, నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. వీరిలో ఎవరివీ సరిపోకపోవడంతో చివరకు భార్య తన రెండు కిడ్నీల్లో ఒకదానిని భర్తకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 2016 జూలైలో ప్రభుత్వ నిబంధనల మేరకు భార్య కిడ్నీని భర్తకు అమర్చారు. చికిత్స కోసం రూ.19 లక్షల దాకా అప్పు చేశారు. ఈ అప్పు తీర్చడానికి నాలుగు ఎకరాల భూమిని అమ్మితే రూ.15 లక్షలు వచ్చింది. ఆర్డీటీ సంస్థ రూ.రెండు లక్షల ఆర్థిక సాయం అందచేసింది. ప్రస్తుతం భార్యాభర్తలు బరువైన పనులు చేయలేని పరిస్థితి. ఇంటి పట్టునే ఉంటున్నారు. వీరిద్దరికీ ప్రతి నెలా వైద్య పరీక్షలు, దాదాపీర్‌కు మందులు కొనడానికి రూ.15 వేల దాకా ఖర్చు వస్తోంది. బతుకు భారం.. కార్పెంటర్ దంపతులకు ఆరోగ్యం సహకరించకపోవడంతో సంపాదించలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కార్పెంటర్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. తమ దీన పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకుపోయినా పింఛన్ కానీ, పక్కా గృహం కానీ మంజూరు చేయలేదు. పాత ఇంటిలోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, దయార్ద్ర హృదయులు మానవతా దృక్పథంతో ఆలోచించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కష్టం ఎవరికీ రాకూడదు ఇలాంటి కష్టం ఏ ఒక్కరికీ రాకూడదు. కిడ్నీ సమస్య కారణంగా ఉన్న భూమిని అమ్ముకుని అప్పులు చెల్లించా. మందులు కొనడానికి ప్రతినెలా రూ. 15 వేలు ఖర్చు అవుతోంది. పని చేద్దామన్నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. కనీసం పింఛన్ కూడా మంజూరు చేయలేదు.– అంగడి దాదాపీర్, సహేరాబాను ఆర్థికసాయం చేయదలిస్తే.. పేరు : షేక్ దాదాపీర్ అకౌంట్ నంబర్ : 31643093766 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వజ్రకరూరు ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్0002804 సెల్ నంబర్ : 90140 32275, 91770 45452 -
విధి వంచితుడు
సాఫీగా సాగిపోతున్న కార్పెంటర్‌ను విధి చిన్నచూపు చూసింది. వింతవ్యాధి అతడిని వికలాంగుడిని చేసింది. కుటుంబ పోషణ భారమైన అతడికి వికలత్వ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. పిల్లల చదువు, కుటుంబ పోషణ భారమై ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మడకశిర: మడకశిర పట్టణంలోని పాత ఎస్సీ కాలనీకి చెందిన మచ్చయ్య కుటుంబం దీన స్థితిలో కొట్టిమిట్టాడుతోంది. ఇతను ఒకప్పుడు మంచి కార్పెంటర్. ఎంతో గౌరవంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని వింతవ్యాధి కష్టాల్లోకి నెట్టింది. మచ్చయ్యకు భార్య సుమంగళి, కుమారుడు సూర్యప్రకాశ్, కుమార్తె అనుశ్రీ ఉన్నారు. ఈ పిల్లలిద్దరూప్రభుత్వ పాఠశాలలో 6, 4వ తరగతి చదువుకుంటున్నారు. మచ్చయ్యకు తల్లి నారాయణమ్మ కూడా ఉంది. తండ్రి జూలప్ప కొన్నేళ్ళ క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వింతవ్యాధితో కాలు తొలగింపు.. కుటుంబ పెద్ద అయిన మచ్చయ్యకు ఏడాది క్రితం వింత వ్యాధి సోకింది. ఎడమ కాలు స్పర్శ కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులు డాక్టర్లను సంప్రదించారు. గత ఏడాది మే నెలలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతని ఎడమ కాలు తొలగించారు. కుడి కాలు కూడా క్రమేణా స్పర్శ కోల్పోతోంది. ఈ కాలును కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే సందర్భం లో మచ్చయ్య తల్లి నారాయణమ్మ కడుపులో కణితి ఏర్పడి అనారోగ్యానికి గురైంది. 11.50 కిలోల కణితిని హిందూపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తొలగించా రు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో వైద్యానికి రూ.60 వేలు వెచ్చించాల్సి వచ్చింది. కుటుంబ పోషణంతా భార్యపైనే.. ప్రస్తుతం మచ్చయ్య కుటుంబ పోషణంతా భార్య సుమంగళిపై పడింది. ఈమె పరిగిలోని ఓ గార్మెంట్ పరిశ్రమకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నెలకు వచ్చే రూ.6 వేలతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేదు. వైఎస్ఆర్ హయాంలో ఇల్లు మంజూరైంది. తమ పరిస్థితిని అర్థం చేసుకుని మచ్చయ్యకు వికలత్వ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని భార్య సుమంగళి, తల్లి నారాయణమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 90శాతం వికలాంగత్వం..అయినా అందని పింఛన్ మచ్చయ్యకు 90శాతం వికలత్వం ఉంది. డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం ఇంత వరకు పింఛన్ మంజూరు చేయలేదు. పింఛన్ కోసం పలుసార్లు దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితమూ లేదు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
మద్యం వద్దన్నందుకు..
దేవరాపల్లి(మాడుగుల): స్థానిక ఎరుకుల కాలనీలో ఓ కార్పెంటర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానిక ఎస్ఐ పి.నర్సింహమూర్తి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎరుకుల కాలనీలో నివాసముంటున్న కార్పెంటర్ గానుగుల భాస్కరరావు(45)కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె రమాదేవి అలియాస్ అన్నపూర్ణకు కె.కోటపాడు మండలం కె.సంతపాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. రెండో కుమార్తె శ్రావణి బీఫార్మసీ చదువుతోంది. భాస్కరరావు కార్పెంటర్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కుడి భుజం బాగా దెబ్బతింది. అప్పటి నుంచి బాధను తట్టుకోలేక మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. పలు మార్లు పంచాయతీ పెట్టినా అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. పెళ్లి ఈడుకు వచ్చిన కుమార్తె ఇంటిలో ఉండగా మద్యం సేవిస్తే ఎలా అంటూ భార్య ప్రశ్నించడంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తలో మార్పు తెచ్చేందుకు లక్ష్మి ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భాస్కరరావు, లక్ష్మిని దేవరాపల్లి ఎస్ఐ మూర్తి బుధవారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై మద్యం సేవించడం మానేయాలని చెప్పి, ఇంటికి పంపించారు. తన పెద్ద కుమార్తె కుమారుడి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మి, అనంతరం కుమార్తె అత్తవారి గ్రామమైన కె.సంతపాలెంకు వారితో కలిసి వెళ్లింది. ఇంటిలో ఒంటిరిగా ఉన్న భాస్కరరావు హుక్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా భర్త ఉరివేసుకుని ఉండడాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. -
ప్రధాని సిఫార్సునూ పక్కనపెట్టారు
సాక్షి, కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ సిఫార్సు చేసినా యూపీలోని కాన్పూర్‌కు చెందిన కార్పెంటర్ సందీప్ సోనీకి రుణం మంజూరు చేయకుండా బ్యాంకర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. సోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణం కోసం 2016లో ప్రధాని సాయం కోరారు. భగవద్గీత శ్లోకాలను చెక్కపై సోనీ చెక్కిన తీరును మెచ్చుకున్న మోదీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద అతనికి రుణం మంజూరు చేయాలని అధికారులకు స్వయంగా సిఫార్సు చేశారు. అయితే రుణం కోసం బ్యాంకు అధికారులు తనను తిప్పుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ సోని ప్రస్తుతం ప్రధానికి లేఖ రాశారు. ఏడాది పాటు రుణం కోసం తిప్పుకున్న బ్యాంకు అధికారులు రూ 10 లక్షలతో వ్యాపారం ప్రారంభించాలని చెబుతున్నారని, తాను కోరిన రూ 25 లక్షల రుణం మంజూరు చేయడం లేదని వాపోయారు. రూ 25 లక్షలతో తన ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉండగా కేవలం రూ 10 లక్షలే రుణం ఇవ్వడంతో తన పనులు ఆగిపోయాయని, బ్యాంకులు రోజుకో నిబంధనతో తనను వేధిస్తున్నాయని సోని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుంటే తన ఇబ్బందులు తొలగిపోతాయని సోని ఆశిస్తున్నారు. -
దాగని నిజం
సాక్షి, సిటీబ్యూరో: గురువారం ఉదయం 8 గంటల ప్రాంతం... లాలాపేటలోని గడ్డిచేలో ఓ యువకుడు హఠాత్తుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు... స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు... ప్రాథమిక విచారణ నేపథ్యంలో గత నెల 30న జరిగిన ఓ హత్య వెలుగులోకి వచ్చింది... ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే పోలీసుల భయంతో ఆత్మహత్యకు యత్నించాడు... ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను చౌటుప్పల్ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు... దీంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడినీ వారికే అప్పగించనున్నారు. ప్రియుడి సహకారంతో భర్త హత్య... కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన కార్పెంటర్ నాగరాజు జ్యోతి దంపతులు. వివాహానికి ముందు నుంచి జ్యోతికి నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో పరిచయం ఉండేది. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని ఆమెను నాగరాజు అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను హతమార్చేందుకు కార్తీక్‌తో కలిసి పథకం వేసింది. ఈ నేపథ్యంలో గత నెల 30న జ్యోతి పథకం ప్రకారం తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. ఆపై కార్తీక్‌ను ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి నాగరాజును హత్య చేశారు. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కార్తీక్ తన స్నేహితులైన దీపక్, యాసీన్లను రమ్మని కోరాడు. దీనికి యాసీన్‌తో పాటు అంగీకరించిన దీపక్ మరొకరినీ తీసుకువెళ్లాలని భావించాడు నరేష్‌ను తీసుకెళ్లిన దీపక్... లాలాపేట లక్ష్మీనగర్‌కు చెందిన నరేష్‌తో (23) దీపక్‌కు పరిచయం ఉండటంతో మృతదేహం తరలింపు కోసం అతడి సహకారం తీసుకోవాలని దీపక్ భావించాడు. అదే రోజు లక్ష్మీనగర్‌కు వచ్చిన దీపక్ తనతో రావాలని, ఓ మృతదేహం తరలింపునకు సహకరించాలంటూ నరేష్‌ను కోరగా, అందుకు అతను నిరాకరించడంతో బయటకు వెళ్ళి వద్దామంటూ చెప్పిన దీపక్ నరేష్‌ను తీసుకుని కర్మన్‌ఘాట్ చేరుకున్నాడు. అనంతరం ముగ్గరూ కలిసి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి చౌటుప్పల్ జిల్లెలగూడ గుట్టల్లో పారవేసి తిరిగి వచ్చారు. 31న డెడ్‌బాడీని గుర్తించిన చౌటుప్పల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు చేపట్టిన చౌటుప్పల్ పోలీసులు మృతుడిని నాగరాజుగా గుర్తించి జ్యోతికి సమాచారం అందించారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం మిగిలిన నిందితులతో పాటు దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అతడి సోదరుడు ఆ రోజు నరేష్ కూడా దీపక్‌తో వెళ్ళినట్లు గ్రహించాడు. దీంతో లక్ష్మీనగర్‌లోని నరేష్ ఇంటికి వెళ్ళిన దీపక్ సోదరుడు అతడిని మందలించడమేగాక చేయి చేసుకున్నాడు. ఈ పరిణామంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించిన నరేష్ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. గురువారం ఉదయం ‘100’కు ఫోన్ చేసి తనకు ఓ హత్య విషయం తెలుసని, పోలీసులు చెప్పాలనుకుంటున్నానని, ఏలా చెప్పాలంటూ అడిగాడు. దీంతో స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్ళాలని, లేదంటే చిరునామా చెప్తే తామే పోలీసులను పంపిస్తామన్నారు. తొలుత తప్పుడు వివరాలు చెప్పినా... తానే పోలీసుస్టేషన్‌కు వెళ్తానన్న నరేష్.. లాలాగూడ ఠాణాకు వెళ్లాలని భావించాడు. గడ్డిచేను వరకు చేరుకున్న అతను భయంతో తన వద్ద ఉన్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న వారు నరేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంలో నరేష్ మాట్లాడుతూ... గత నెల 30న తన స్నేహితుడు దీపక్ తనను తీసుకువెళ్లాడని, అతడు మరికొందరితో కలిసి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ వ్యక్తి చంపినట్లు తెలిపారు. ఆపై తాము మృతదేహాన్ని నల్లగొండ చెరువులో పారవేశామన్నారు. మిగిలిన వాళ్ళు పోలీసులకు చిక్కడంతో తాను భయపడ్డానన్నాడు. ఈ విషయం విని కంగుతిన్న లాలాగూడ పోలీసులు మాదాపూర్ పోలీసుల్ని సంప్రదించినా ఫలితం దక్కలేదు. దీపక్ కాల్ డిటేల్స్ పరిశీలించడంతో... నరేష్ నోటి వెంట దీపక్ పేరు పదేపదే వస్తుండడంతో అతడి ఫోన్ నంబర్ సేకరించిన పోలీసులు కాల్ డిటేల్స్ ఆరా తీశారు. అందులో ఓ నంబర్‌తో ఎక్కువసార్లు సంప్రదింపులు ఉండడంతో ఆ నంబర్‌కు లాలాగూడ పోలీసులు కాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాను చౌటుప్పల్ పోలీసు అధికారినంటూ చెప్పిన అవతలి వ్యక్తి నాగరాజు హత్య నుంచి దీపక్‌ను అదుపులోకి తీసుకోవడం వరకు వివరించారు. దీంతో అప్రమత్తమైన లాలాగూడ అధికారులు నరేష్ వివరాలను చౌటుప్పల్ పోలీసులకు అందించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చౌటుప్పల్ పోలీసుల అదుపులో ఉన్న నిందితులను శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
పాములపాడు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన షేక్ జిలానీ(35), మిట్టకందాల గ్రామానికి చెందిన జరినాబీతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జిలానీ కార్పెంటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా కొన్నాళ్లుగా మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. భర్తను మద్యం మానేయమని పలుమార్లు కోరినా మానక పోవడంతో విసిగి పోయిన జరినాబీ పుట్టినింటికి చేరింది. నెల రోజుల తర్వాత జిలానీ మిట్టకందాలకు వెళ్లి భార్యతో కలసి అక్కడే కాపురం పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అతను మళ్లీ మద్యం సేవించడంతో భార్య గొడవపడింది. ఈ క్రమంలోనే మళ్లీ వెంకటాపురం వెళ్లాలని జిలానీ పట్టుబడ్టడంతో ఇందుకు భార్య ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన అతను ఈనెల 7వ తేదీన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సు«ధాకరరెడ్డి తెలిపారు. -
ప్రధాని చెప్పినా లోన్ ఇవ్వలేదు!
కాన్పూర్: సాధారణ వ్యక్తిలా బ్యాంకు చుట్టు తిరుగుతున్నా లోన్లు మంజూరు కావడం లేదని పలువురు చెప్తుండటం.. ఆ మాటలు వింటుండటం పరిపాటే. అయితే, ఏకంగా ప్రధాని మంత్రి చెప్పినా కూడా పని అవ్వడం లేదంటే ఏమనుకోవాలి. కాన్పూర్‌కు చెందిన సందీప్ సోని అనే కార్పెంటర్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. సోని చెక్కతో అద్భుతాలు చేయగలడు. అందంగా చెక్క వస్తువులు తయారుచేయడమే కాదు.. వాటిపై అక్షరాలు కూడా చెక్కగలడు. గత మార్చిలో అతడు 32 చెక్కలపై భగవత్ గీత కు చెందిన 18 భాగాలు, 706 శ్లోకాలు అక్షరాలుగా చెక్కాడు. అందుకు అతడికి మూడున్నర ఏళ్లు పట్టింది. వీటిని అతడు మోదీకి చూపించగా ఆయన ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోలను కూడా మోదీ స్వయంగా ట్విట్టర్ లో పెట్టాడు. దాంతోపాటు అతడికి ఒక చిన్న కార్పెంట్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు సహాయం కూడా చేస్తానని, అతడికి లోన్ మంజూరు కూడా చేయాలని చెప్పాడు. దీంతో అతడు ప్రధాని మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ) కార్యక్రమం కింద లోన్ కు దరఖాస్తు చేసుకొని ఇప్పటి వరకు చెప్పులు అరిగేలా తిరిగినా అతడికి మాత్రం ఏ బ్యాంకు నుంచి ఆ సహాయం అందలేదు. దీంతో ప్రధాని చెప్పిన మాటకే దిక్కులేదు.. ఇక సామన్యుడిలా వెళితే బ్యాంకులు పట్టించుకుంటాయా అని ఆగ్రహం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
'రికార్డు' కష్టాలు..!
ప్రపంచరికార్డు తెచ్చిపెట్టిన ఆ వేళ్లే ఇప్పుడు అతడికి సమస్యగా మారాయి. అదృష్టంతో పాటు.. సమస్యనూ తెస్తున్నాయి. కార్పెంటర్ వృత్తితో కాలం గడుపుదామనుకున్న అతడికి అధికంగా ఉన్న వేళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మనిషికి సహజంగా ఉండాల్సిన వాటి కన్నా 8 వేళ్లు ఎక్కువ ఉండటం ప్రత్యేక గుర్తింపు తెచ్చినా...వృత్తి జీవితానికి మాత్రం ఇబ్బందిగానే మారింది. గుజరాత్‌లోని హిమ్మత్ సాగర్ కు చెందిన దేవేంద్ర సుథార్.. ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనన్ని వేళ్లతో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. రెండు చేతులకూ కలిపి 4, రెండు కాళ్లకు కలిపి 4 అధికంగా ఉన్న వేళ్లతో మొత్తం 28 వేళ్లు ఉన్నాయి. 43 ఏళ్ల వయసున్న దేవేంద్ర కార్పెంటర్ పనిచేస్తూ జీవనాన్నిగడుపుతున్నాడు. చాలా అరుదుగా కనిపించే ఈ ప్రత్యేకత (పోలిడాక్టిలిజమ్) అతడి జీవనోపాధికి అడ్డంకిగా మారింది. కార్పెంటర్ పని చేసేటప్పుడు అధికంగా ఉన్న వేళ్లు అడ్డు వస్తుండటంతో అవి తెగిపోకుండా పని చేయడం కష్టమౌతోంది. ఇప్పుడు రికార్డు తెచ్చిపెట్టిన సంతోషం కన్నా వేళ్ళతో ఇబ్బందే అతడికి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న వేళ్లు తనను సెలబ్రిటీని చేశాయని, అందరూ తనను చూసేందుకు వస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని దేవేంద్ర చెప్తున్నాడు. కానీ అవే వేళ్లు తన జీవన గమనానికి అడ్డంకిగా మారాయని, కార్పెంటర్ పనిచేయడం ఎంతో కష్టంగా ఉందని అంటున్నాడు. ఎక్కువ వేళ్లు ఉండటంతో ఎంతో అధికంగా శ్రమపడాల్సి వస్తోందని చెబుతున్నాడు. తన సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక ఆందోళన చెందుతున్నాడు. అటు రికార్డును తెచ్చిపెట్టిన వేళ్లను ఏమీ చేయలేక, ఇటు రోజువారీ జీవనంలో కష్టాలు పడలేక సతమతమౌతున్నాడు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 52
కొత్త ఒరవడి మేలిరకం పనిముట్ల ఆధరువు దొరికిందే తడవుగా చేతివృత్తుల నైపుణ్యం గణనీయంగా పెరిగింది. అది ఏ స్థాయికి పెరిగిందో సూచించే ఉదంతమొకటి మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋభువులు అనే ముగ్గురు సోదరులు మానవులు. త్వష్ట దేవతలకు దారుశిల్పి. త్వష్ట ‘చమసము’ అనబడే పాత్రనొకదానిని తయారుచేశాడు. ఆ పాత్రను ఋభువులు నాలుగు పాత్రలుగా చేశారు. త్వష్ట సిగ్గుతో తలదించుకున్నాడు. తమ వృత్తి నైపుణ్యంతో ఋభువులు దేవతలైనారు. ‘చమసము’ అన్నది చెక్కతో నిర్మించిందో లేక లోహంతో నిర్మించిందో చెప్పలేదు గానీ, ‘దారుశిల్పి’ అంటే వడ్రంగి కావడంతో, ఆ విన్యాసానికి ముడిసరుకు కొయ్యదే అయ్యుండాలి. వడ్రంగంలో సాధించిన ప్రగతి వల్ల ఎంతోకాలంగా మానవుడు కంటున్న కలల్లో మరొకటి ఫలించింది. ఎప్పుడో ఇరవై వేల సంవత్సరాలకు ముందే నిప్పు భయం అతనికి తీరిపోయినా, నీటి బెదురు మాత్రం ఇంకా తగ్గలేదు. నాగరిక జీవితం ముడిపడింది ఎడతెగకుండా పారే నదితో. అందువల్ల, నదిని సాధించితీరాలనేది మానవుని ఆశయమేగాదు, అవసరం కూడా. తీగెలతో దట్టంగా అల్లిన పొడవాటి బుట్టలకు తారు దట్టించి తేలడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని; వెదురు బొంగులకు జంతు చర్మాన్ని సాగదీసిన దొన్నెలతో చేసిన ప్రయత్నాలు కొన్ని; తేలికైన దుంగలను చాపమోస్తరుగా పరిచికట్టిన తెప్పలతో తృప్తిపడిన రోజులు కొన్ని. ఇవన్నీ ప్రవాహానికి అనుకూలంగా పనికొచ్చే సాధనాలేగానీ ఎదురెక్కేందుకు వీలు కలిగించేవిగావు. పనిముట్లు మెరుగుపడటంతో ఇప్పుడు ప్రవాహానికి ఎదురెక్కే తెడ్లపడవ ఉనికిలోకి వచ్చింది. తెడ్లతోపాటు తెరచాపను కూడా వినియోగించుకుంటూ అది మరికొంచెం పెరిగి, కాలగమనంలో మరింత పెద్దదై, నదీముఖాల్లో తేలికపాటి అలలను తట్టుకునేంత పటిష్టమైన, ఒక దశలో సముద్రాన్ని సైతం ఈదగలిగే ‘ఓడ’గా ఎదిగింది. ఈ ఒరిపిడుల మధ్యన, ఆయా రంగాల్లో నైపుణ్యంవారీగా వృత్తుల్లో పని విభజన మొదలయింది. లోహంతో పనిచేసేవాడు కమ్మరి, బంకమట్టితో పనిచేసేవాడు కుమ్మరి, కలపతో పనిచేసేవాడు వడ్రంగి, రాయితో పనిచేసేవాడు వాస్తుశిల్పి - ఇలా, నేతతో సహా, దేనికదిగా విడిపోయి, స్వతంత్ర జీవనోపాధులుగా అవి నాగరికతకు అతుక్కుపోయాయి. మెరుగైన పనిముట్ల వల్ల వృత్తిపనుల్లో ఉత్పత్తి పెరిగింది. నాగరికత పెరగడం వల్ల, తయారైన వస్తువులకు గిరాకీ ఏర్పడింది. వాటిని గింజలతోనో, గొర్రెలతోనో, బర్రెలతోనో వస్తుమార్పిడి చేసుకునే సంతల్లో సందడి పెరిగింది. సంతలకు పేరుబోయిన ప్రదేశాలు క్రమంగా పట్టణాలుగానూ, నగరాలుగానూ విస్తరించాయి. క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి నగరాలుగా చెప్పుకోదగిన ప్రదేశాలు ఇరవైదాకా మెసొపొటేమియాలో ఉండినట్టు అంచనా. వాటిని చుట్టుకొనివున్న జనావాసాల్లో కొన్ని పట్టణాలుకాగా, తక్కినవి గ్రామాలు. ప్రపంచంలో అన్నిటికంటే ముందు నగరాలుగా ఎదిగినట్టు నిరూపించుకున్న ప్రదేశాలు ‘ఎరెచ్’, ‘నిప్పర్’లు రెండున్నూ మెసొపొటేమియాకు చెందినవే. పర్షియన్‌గల్ఫ్ తీరానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల ఎగువన, యూఫ్రటీస్ నదీతీరంలో వెలిసిన నగరం ‘ఎరెచ్’. దీనికి ఉత్తరంగా, మరో వంద కిలోమీటర్ల దూరంలో, జంట నదులకు నడిమిగా ఏర్పాటైన నగరం ‘నిప్పర్’. మెసొపొటేమియన్లు ఆరాధించిన దేవతల్లో ప్రముఖుడైన ‘ఎన్లిల్’కు (ఋగ్వేదంలోని మరుత్తులతో పోల్చదగిన శక్తికి) ఈ నగరంలో ఒక దేవాలయం నిర్మించారు. చరిత్రకు తెలిసిన ఈ మొట్టమొదటి దేవాలయానికి ఆకాశాన్ని తాకేంత ఎత్తై గోపురాన్ని ఇటుకలతో నిర్మించారని ప్రతీతి. బైబిల్లో ప్రస్తావించిన ‘టవర్ ఆఫ్ బేబెల్’ ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం. పురాతన నాగరికతల్లో అన్నిటికంటే విశాలంగా విస్తరించిన సింధూ నాగరికతలో నగరాల సంఖ్య తక్కువ, గ్రామాల సంఖ్య ఎక్కువ. నగరాలుగా ఎదిగినవి మామూలు నగరాలు కాదు, మహానగరాలు (మెట్రోపొలీస్). ఇకపోతే, ఈజిప్టు, చైనా నాగరికతల్లో వంశపారంపర్య పరిపాలన మొదలయిందాకా పట్టణాలూ, నగరాలు ఏర్పడిన దాఖలాలు కనిపించవు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
రెండు వారాలుగా సిమెంట్ కొనుగోళ్లు బంద్
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా ఉంది భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి. అమాంతం పెరిగిన సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం పడకేసింది. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నిర్మాణ రంగంపై ఆధారపడి సుమారుగా 60 వేల మంది కార్మికులున్నారు. రాడ్ బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ వంటి సుమారు 26 విభాగాలు నిర్మాణ రంగానికి అనుబంధంగా తమ కార్యకలాపాలను సాగిస్తుంటాయి. అయితే ఒక్కసారిగా సిమెంట్ బస్తా (50 కిలోలు) ధర రూ.100కు పైగా పెరగడాన్ని నిరసిస్తూ సిమెంటు కొనుగోళ్లకు బిల్డర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రెండు వారాలు బ్రేక్ వేసింది. దీంతో నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు లేక పోవడంతో.. రెక్కాడితే గారీ డొక్కాడని కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు వారాలుగా కూలీ లేక పూట గడవడమే కష్టంగా మారిందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 20 వేల ఫ్లాట్లకు బ్రేకులు.. ఏటా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రభుత్వ విభాగాల నుంచి 35 వేల ఇంటి దరఖాస్తులు అనుమతులు పొందుతుంటే.. ప్రస్తుతం వీటిలో సుమారుగా 20 వేల ఫ్లాట్లు నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే సిమెంట్ హాలిడే ప్రకటించడంతో ఈ ఫ్లాట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారులకు ఇచ్చిన సమయంలోగా ఫ్లాట్లను అందించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన సిమెంట్ ధరతో ప్రాజెక్ట్ వ్యయమూ పెరుగుతుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చ.అ.కు రూ.300కు పైగా పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శేఖర్ చెప్పుకొచ్చారు. అంటే ఈ భారం మళ్లీ సామాన్యుడి నెత్తిపైనే పడనుందన్నమాట. రెండు వారాల్లో రూ.37.80 కోట్లు నగరంలో 50-60 వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న చెప్పారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా తాపీమేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి (శ్లాబులు వేసేవాళ్లు), మట్టి లేబర్, వండ్రంగి, పెయింటర్, కార్పెంటర్ ఇలా నిర్మాణ రంగంలోని వివిధ దశల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి ఒక్క రోజుకు మేస్త్రీకి రూ.500, హెల్పర్‌కు రూ.400, మహిళలకు రూ.300 కూలీ చెల్లిస్తుంటారు. అయితే 14 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కూలీలంతా కలసి రూ.కోట్లలో నష్టపోయారు. ఎలాగంటే రోజుకు 60,000 (కూలీలు) 5 450 (సగటున దినసరి కూలీ) = 2,70,00,000. మొత్తం 14 రోజులకు చూసుకుంటే.. అక్షరాల రూ.37.80 కోట్లు నష్టపోయారన్నమాట. -
కొరతను అధిగమిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు. నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది. కొరతను తీర్చే మార్గమిదే.. విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. -
తెలంగాణ సంబరాల్లో అపశ్రుతి
టేకులపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ సంబురాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిందనే ఆనందంలో విజయోత్సవం చేసుకుంటూ కుప్పకూలిన ఓవ్యక్తి చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.... ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకట్యాతండాలో ఆరోజు రాత్రి గ్రామస్తులు ఆట పాటలతో సంబురాలు జరుపుకున్నారు. అదే గ్రామానికి చెందిన కార్పెంటర్ తుమ్మలపల్లి యాకూబ్ పాషా(36) కూడా సంబురాల్లో పాల్గొన్నాడు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన సహచరులు వెంటనే కొత్తగూడెం తరలించారు. అక్కడ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమించడంతో ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య సరిత, కుమార్తెలు శ్రావణి(8), హాసిని(4), శాలిని(2) ఉన్నారు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో టేకులపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దహనసంస్కారాల కోసం మూడు వేలు వితరణ అందించారు. ఎల్లప్పుడూ చురుకుగా అందరితో కలివిడిగా ఉండే యాకూబ్ పాషా అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్ నుంచి మృతదేహం స్వగ్రామానికి తీసుకురాగానే గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.