టేకులపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ సంబురాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిందనే ఆనందంలో విజయోత్సవం చేసుకుంటూ కుప్పకూలిన ఓవ్యక్తి చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.... ఈ నెల 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకట్యాతండాలో ఆరోజు రాత్రి గ్రామస్తులు ఆట పాటలతో సంబురాలు జరుపుకున్నారు.
అదే గ్రామానికి చెందిన కార్పెంటర్ తుమ్మలపల్లి యాకూబ్ పాషా(36) కూడా సంబురాల్లో పాల్గొన్నాడు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన సహచరులు వెంటనే కొత్తగూడెం తరలించారు. అక్కడ కోమాలోకి వెళ్లి పరిస్థితి విషమించడంతో ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
మృతుడికి భార్య సరిత, కుమార్తెలు శ్రావణి(8), హాసిని(4), శాలిని(2) ఉన్నారు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో టేకులపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దహనసంస్కారాల కోసం మూడు వేలు వితరణ అందించారు. ఎల్లప్పుడూ చురుకుగా అందరితో కలివిడిగా ఉండే యాకూబ్ పాషా అకస్మాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్ నుంచి మృతదేహం స్వగ్రామానికి తీసుకురాగానే గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.
తెలంగాణ సంబరాల్లో అపశ్రుతి
Published Sat, Feb 22 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement