
శ్రీనగర్: ఢిల్లీలో అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని చంపి, 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన దారుణాన్ని గుర్తుకు తెచ్చే ఘటన ఇది. జమ్మూకశ్మీర్‌లోని బుద్గా జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో షబీర్ అహ్మద్ వనీ(45) అనే వ్యక్తి కార్పెంటర్ ఓ మహిళ(30)ను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పాతిపెట్టాడు.
మార్చి 7వ తేదీన కోచింగ్ క్లాస్‌కని వెళ్లిన తన సోదరి కనిపించకుండా పోయిందంటూ షోయిబుగ్‌కు చెందిన తన్వీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ సెల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహన్‌పురా ఒంపొరాకు చెందిన వనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మహిళ శరీర భాగాలను శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానంటూ వనీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై పగబట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment