సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా పేరుతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వం విఫలమైన 10 అంశాలతో కూడిన తలలను కూర్చి రావణాసుర దిష్టిబొమ్మలను దహనం చేసింది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, గిరిజనులు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించారు.
ఆ తర్వాత స్థానిక ఆర్డీవోలు, ఎమ్మార్వోలతోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు పత్రాలను కాంగ్రెస్ నేతలు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ ముఖ్యనేత షబ్బీర్‌అలీని హౌస్‌అరెస్ట్ చేశారు. గాంధీ భవన్ నుంచి ఆందోళన చేపట్టేందుకు బయలుదేరిన టీపీసీసీ ఫిషర్‌మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులను పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
ఖమ్మంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జగిత్యాలలో ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, చొప్పదండిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర క్యాంపు వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అరెస్టులను ఖండించిన రేవంత్, కోమటిరెడ్డి
దశాబ్ది దగా కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుకొనేందుకు పోలీసులు తమ పార్టీకి చెందిన పలువురు నేతలను అరెస్టు చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. వారి అరెస్టులు అప్రజాస్వామికమని, ఇది కచ్చి తంగా దశాబ్ది దగానేనని, ప్రతిపక్ష పార్టీగా ప్రజాసమస్యలపై పోరాడే హక్కు తమ పార్టీకి ఉందని గురువారం ఒక ప్రకటనలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల హక్కులను కాలరాసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ప్రకటనలో హెచ్చరించారు. కాంగ్రెస్ దశాబ్ది దగా కార్యక్రమానికి పిలుపునిచ్చి నందునే అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కేసీఆర్ పిలిపించుకొని ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అడ్డుకోవడం ద్వారా ప్రజాసమస్యలపై ఉద్యమాలను నిలువరించలేరని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment