వండ్రంగి పని చేస్తూ.. హిందీ కంటెంట్‌ కింగ్‌ అయ్యాడు | Carpenter Become A Hindi Wikipedia Reviewer | Sakshi
Sakshi News home page

హిందీ కంటెంట్‌ కింగ్‌..కార్పెంటర్‌ రాజు

Published Tue, Jan 19 2021 8:26 AM | Last Updated on Tue, Jan 19 2021 8:26 AM

Carpenter Become A Hindi Wikipedia Reviewer - Sakshi

డాక్టర్‌ను కాబోయి యాక్టర్‌నయా అంటుంటారు కొందరు నటులు. అలాగే 22 ఏళ్ల రాజు జంగిడ్‌ కార్పెంటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి  వికీపీడియా కంటెంట్‌ సమీక్షకుడుగా ఎదిగాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లా థడియా అనే కుగ్రామంలో పేదరికంలో జన్మించిన రాజు చదువుకుంటూనే వండ్రంగి (కార్పెంటర్‌) పనిచేసేవాడు. ఇటుపని అటు చదువుతోపాటు రాజుకు వికీపీడియాలో ఆర్టికల్స్‌ చదవడం ఒక అలవాటుగా ఉండేది. దీంతో తనకు దేనిగురించైనా సమాచారం కావాలంటే వెంటనే వికీమీద పడిపోయేవాడు. అయితే తన మాతృభాష హిందీ కావడంతో హిందీలోనే కంటెంట్‌ను వెతికేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి తన గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి వికీలో వెతకగా ఎక్కడా సమాచారం దొరకలేదు. రాజ్యభాష అయిన హిందీలో సమాచారం ఎక్కువగా లేకపోవడం ఏంటీ అనుకుని.. వికీలో హిందీ భాషలో మరింత సమాచారం అందుబాటులో ఉండాలని భావించి వికిపీడియా వలంటీర్‌గా చేరి హిందీలో ఆర్టికల్స్‌ రాయడం మొదలుపెట్టాడు.

అలా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే కంటెంట్‌ రైటర్‌గా మారాడు. అలా రాసే క్రమంలో తన ఊరి చుట్టుపక్కల సమాచారాన్ని అక్కడి అధికారులతో మాట్లాడి వికీపీడియాలో పోస్ట్‌ చేసేవాడు. రాజు పదో తరగతి పూర్తయినా తన ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో చదువు మానేసి వడ్రంగి పనిలో చేరాడు. పనిచేస్తూనే వీలు దొరికినప్పుడల్లా వికీ ఆర్టికల్స్‌ను రాస్తూ, పేజీలను ఎడిట్‌ చేసేవాడు. రాజు పనితనం నచ్చడంతో తన పరిస్థితి తెలుసుకున్న వికీపీడియా నిర్వాహకులు అతడికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఫ్రీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌  కూడా అందించారు. ఇక అప్పటినుంచి రాజు హైక్వాలిటీ కంటెంట్‌ ఇవ్వడంతోపాటు వికీపీడియా ఎడిటర్‌గా ఎన్నో సైబర్‌ కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు. ఇప్పటిదాక రాజు 57 వేల వికీపీడియా పేజీలను ఎడిట్‌ చేయడంతోపాటు 1,880 ఆర్టికల్స్‌ను రాశాడు.

మనలో ఎన్ని నైపుణ్యాలున్నా పరిస్థితులతో పోరాడకపోతే గెలవలేమని చెబుతున్నాడు రాజు. ‘2013, 2014 సంవత్సరాలలో వికీలో ఆర్టికల్స్‌ను అప్‌లోడ్‌ చేసేవాడిని. కానీ వికీ అడ్మిన్‌లు నా ఆర్టికల్స్‌ను బ్లాక్‌ చేసేవాళ్లు. అలా ఎన్నోసార్లు జరిగిన తరువాత.. అసలు వికీవాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అవి మాత్రమే అప్‌లోడ్‌ చేసేవాడిని. ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్‌  ద్వారా 150 నుంచి 200 పదాల ఆర్టికల్స్‌ను రాసేవాడిని. అయితే కీబోర్డు చాలా కష్టంగా అనిపించేది. ఆ తరువాత ల్యాప్‌టాప్‌ రావడంతో 400 పదాలకు పైగా ఆర్టికల్స్‌ను రాయగలిగాన’ని రాజు చెప్పాడు.

2017లో కార్పెంటర్‌ ఉద్యోగం మానేసిన రాజు మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగించి బిఏ డిగ్రీ పట్టాపుచ్చుకున్నాడు. సైబర్‌ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వికీ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ ‘వికీ స్వస్థ’కు పనిచేస్తున్నాడు. ఇందులో హెల్త్‌ రిలేటెడ్‌ ఆర్టికల్స్‌ రాస్తూనే ఇతర రంగాలకు చెందిన ఆర్టికల్స్‌ ను అందిస్తున్నాడు. హిందీలో వికీ క్రికెట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించి 700 ఆర్టికల్స్‌ను కంట్రిబ్యూట్‌ చేశాడు. హిందీలో క్రికెట్‌కు సంబంధించిన ఆర్టికల్స్‌ తక్కువగా ఉండటంతో మంచి సమాచారం అందిస్తున్న ఈ ప్రాజెక్టు సక్సెస్‌ అయింది. కాగా ఇండియాలో హిందీ వికీలో మొత్తం 11 మంది మాత్రమే యాక్టివ్‌ కంట్రిబ్యూటర్‌లుగా ఉన్నారు. వీరిలో రాజు ఒకడు కావడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement