మలి దశకు సన్నాహాలు
సాక్షి, ముంబై: మెట్రో రెండో దశ పనులను చేపట్టేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తొలివిడత పనులు పూర్తయిన నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. చార్కోప్-బాంద్రా-మాన్‌ఖుర్ద్ వరకు 32 కి.మీ. మేర భూగర్భ కారిడార్‌గా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.25,000 కోట్ల మేర వ్యయం కావొచ్చని అంచనా వేశారు. కాగా వివిధ కారణాల వల్ల గత నాలుగు సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమై ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టుకు రూ.8,250 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేశారు. మొదట ఈ మెట్రో-2ను ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించాలని అనుకున్నారు.
అయితే అనివార్య కారణాల వల్ల దీనిని భూగర్భ కారిడార్‌గా నిర్మించనున్నారు. తాను నియమించిన కమిటీ ఇచ్చిన సలహా మేరకు ఈ ప్రతిపాదనను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) సవరించింది. అంతేకాకుండా దీనిని దహిసర్ వరకు పొడిగించాలని కూడా ఈ కమిటీ సూచించింది. అయితే ఈ ప్రాజెక్టు పనులకు అవసరమైన భూసేకరణ విషయంలో వివాదాలు తలెత్తడంతో భూగర్భ కారిడార్ నిర్మాణం సాధ్యమా కాదా అనే అంశంపై అధ్యయనం కోసం ఈ కమిటీని నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సలహా కమిటీ సూచనలు, సలహాలపై అధ్యయనం చేస్తున్నామని, మరో నెల రోజుల్లో ఈ మెట్రో ప్రాజెక్టు-2కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
పశ్చిమ శివారు ప్రాంతాల్లో మెట్రో డిపో నిర్మాణానికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే నియమించిన కమిటీ ఓషివారా, దహిసర్, బోరివలిలలో స్థలాలను గుర్తించింది. వీటిలో రెండింటిని మాత్రమే ఎంపిక చేస్తారు. చార్కోప్తోపాటు మాన్ఖుర్ద్లలో డిపోల నిర్మాణానికి స్థలాలు అందుబాటులోనే ఉన్నప్పటికీ చెట్ల నరికివేతకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతించలేదు. దీంతో స్థల సేకరణ ఓ సవాలుగా మారింది. మెట్రో రెండో దశను భూగర్భంలోనా లేక ఎలివేటెడ్‌గా నిర్మిం చాలా అనే అంశంపై ఎమ్మెమ్మార్డీయే అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలివేటెడ్ కారిడార్‌కే సీఎం మొగ్గుచూపారు.