అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది.