రోడ్లలో కాంట్రాక్టర్లకు ‘అదనపు’ లబ్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా అధికారుల వ్యవహారం ఉందని కాగ్ తప్పుబట్టింది. నిర్మాణ సమయం, టోల్ వసూలు అంచనాలు, ఉపకరణాల తరలింపు వంటి అంశాల్లో రూ. కోట్లలో ప్రభుత్వంపై అదనపు భారం పడిందని వెల్లడించింది.
- మిర్యాలగూడ-కోదాడ రోడ్డులో మూసీనదిపై రెండు లేన్ల వంతెన కోసం సాధ్యాసాధ్యాల నివేదికను తయారు చేయలేదు. కేవలం అంచనాలను మాత్రమే రూపొందించి ట్రాఫిక్‌ను లెక్కించడం ద్వారా టోల్‌ను మదింపు చేశారు.
- మూసీనదిపై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు మూడుసార్లు ట్రాఫిక్ రద్దీని లెక్కించి టోల్‌ను అంచనా వేశారు. వీటిలో తక్కువ రాబడి ఉన్న కాలాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్ రాబడులను అంచనా వేశారు. ఇది ప్రభుత్వానికి టోల్ రాబడి తగ్గేందుకు కారణమైంది. వంతెన నిర్మాణం సంవత్సరంలోనే పూర్తయినా.. అధికారులు మాత్రం నిర్మాణ సమయం 18 నెలలుగా పేర్కొన్నారు. ఇలా ఎందుకు పెంచారో ఎక్కడా కారణాలు పేర్కొన లేదు. మరోవైపు ఈ వంతెన రాయితీ కాలాన్ని 15 ఏళ్లుగా చూపారు. దాన్ని తిరిగి లెక్కిస్తే 9 ఏళ్లని తేలింది. ఫలితంగా కాంట్రాక్టరు ఎక్కువకాలం టోల్ వసూలు చేసుకోవడానికి ఈ తేడా అవకాశం కల్పించింది. ఇలా అదనపు కాలానికి నుంచి వసూలు చేసే టోల్ మొత్తం రూ. 69.09 కోట్లుగా తేలింది.
- హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రోడ్డు ప్రాజెక్టు పనుల్లో విద్యుత్ లైన్లు, కేబుళ్లు, నీటి సరఫరా లైన్లకు సంబంధించిన ఉపకరణాల తరలింపున కు రూ. 24.26 కోట్లు ఖర్చవుతాయని తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత దానిని ఏకంగా రూ. 73.50 కోట్లకు పెంచి పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు.
- రాజీవ్ రహదారి నిర్మాణానికి సంబంధించి తొలి ప్రతిపాదనల్లో లేని ప్రజ్ఞాపూర్, కుకునూర్‌పల్లి, సుల్తానాబాద్ బైపాస్ రోడ్లను అదనపు విలువలతో నిర్మాణ సంస్థకు కట్టబెట్టారు.