దొరికినోళ్లకు దొరికినంత!
కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల ఇష్టారాజ్యం
డ్యూటీల కోసం నేతల ఒత్తిడి
సాక్షి, కడప : ఆర్టీసీ కార్మికుల సమ్మె కొంత మందికి బాగా కలిసొచ్చింది. ప్రైవేట్ వాహనాల వారు చార్జీలు రెట్టింపు చేసి దండుకుంటుండగా, ఆర్టీసీ తాత్కాలికంగా సిబ్బందికి మాత్రం పండగలా మారింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో ప్రజలకు ఇక్కట్లు కలగకూడదని భావించి ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్, కండెక్టర్లను నియమించుకున్నారు.
రోజుకు డ్రైవర్‌కు రూ.వెయ్యి, కండక్టర్‌కు రూ.800 చొప్పున చెల్లిస్తున్నారు. ఇది చాలదనుకున్నారో.. లేక సమ్మె ముగిశాక తమ ఉద్యోగాలు ఉండవనుకున్నారో కానీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సులను తనిఖీ చేసే వారు లేకపోవడంతో సగం నొక్కేస్తున్నారు. బస్సులో ఎంత మంది ఎక్కినా సగం మందికే లెక్క చూపుతూ మిగతా సొమ్మును పలువురు తాత్కాలిక డ్రైవర్, కండెక్టర్లు చెరి సగం జేబులో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో ప్రస్తుతం 300 నుంచి 400 బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బస్సులు రద్దీతో వెళ్తున్నా తక్కువ మంది ఎక్కినట్లు తాత్కాలిక కండక్టర్లు డిపోలో డబ్బులు అందజేస్తున్నారు. ఇందుకు తాత్కాలిక డ్రైవర్లు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.
కాగా, ప్రస్తుత సమ్మె నేపథ్యంలో ఎంపికైన కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లు డ్యూటీల కోసం పైరవీలు చేస్తున్నారు. టీడీపీ నేతల ద్వారా కొందరు, ఇతర నాయకుల ద్వారా మరి కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో డిపో మేనేజర్లు తల పట్టుకున్నారు.