Contract posts
-
ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు
గుంటూరు: ‘అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని జిల్లా అటవీశాఖాధికారి చెప్పాడు. చివరకు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బు ఒక్కటే అర్హత కాదు.. కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదు పొమ్మన్నాడు.’ అంటూ ఓ బాధితురాలు బుధవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. భర్తతో మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కుమార్తెతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. డీ–ఫార్మసీ చదివిన ఆమె ఉద్యోగ వేటలో పడింది. ఈ క్రమంలో గుంటూరులోని అటవీశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫారెస్ట్ ఆఫీసర్ మోహనరావును ఆమె మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఫారెస్ట్ కార్యాలయంలో కలిసింది. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇచ్చి.. ఆపై పర్మినెంట్ చేస్తానని మోహనరావు చెప్పారు. అంతడబ్బు ఇచ్చుకోలేనని ప్రాథేయపడటంతో చివరకు రూ.2 లక్షలకు అంగీకరించారు. ఫిబ్రవరి 24న గుంటూరులోని కార్యాలయంలో డబ్బు ఇచ్చి దరఖాస్తు చేసింది. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేసి ఉద్యోగం విషయమై ప్రశ్నించింది. అయితే గుంటూరు రావాలని మోహనరావు చెప్పడంతో వెళ్లి ఆయనను కలిసింది. డబ్బులిస్తే ఉద్యోగాలు రావని, కోర్కెలు కూడా తీర్చాలన్నాడు. నిరాకరిస్తే ఉద్యోగం రాదని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తన వికృత చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా ఐదు నెలలు గడిచినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయనను నిలదీయగా.. ఉద్యోగం లేదు.. డబ్బూ లేదని తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఇద్వా నాయకులకు వివరించింది. హోంమంత్రికి ఫిర్యాదు.. ఈ క్రమంలో ఇద్వా నాయకుల సూచనల మేరకు హోంమంత్రి మేకతోటి సుచరితను మంగళవారం ఆమె కార్యాలయంలో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనను సీరియస్‌గా పరిగణించిన హోం మంత్రి.. వెంటనే అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె సూచనల మేరకు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మేడికొండూరు సీఐ ఆనందరావును ఎస్పీ ఆదేశించారు. బాధితులు ఇంకా ఉన్నారు! తనలాగా మోసపోయిన బాధితులు మరెందరో ఉన్నారని, గుంటూరుకు చెందిన ఓ యువతి కూడా తనలాగే మోసపోయిందని బాధితురాలు చెబుతోంది. తన కార్యాలయంలో కూడా మోహనరావు కొందరిని ఇలానే వేధించాడని.. బాధితులంతా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని తెలిపింది. ఉద్యోగాల పేరుతో మహిళలను వేధిస్తున్న జిల్లా అటవీశాఖాధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనను విధుల నుంచి తొలగించి సీఐడీ విచారణకు ఆదేశించాలని ఇద్వా వ్యవస్థాపకుడు జి.రాజసుందరబాబు డిమాండ్ చేస్తున్నారు. -
కొలువులు.. పైరవీలు!
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో గోప్యత - దరఖాస్తులు, పోస్టుల వివరాలు వెల్లడించని ఆర్యూ వర్గాలు - కాల్ లెటర్లు పంపినా సంఖ్య తెలియదని బుకాయింపు - తమకే స్పష్టత లేదంటున్న వైస్ చాన్స్‌లర్ - అనర్హులకు పెద్దపీట వేసే ప్రయత్నం - భారీగా రాజకీయ నాయకుల సిఫారసులు రాయలసీమ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో చేపట్టిన నియామకాలు వివాదాస్పదం అయినప్పటికీ.. మళ్లీ అదే తీరు కొనసాగుతోంది. ప్రస్తుత వైస్ చాన్స్‌లర్ చేపట్టిన నియామకాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. బంధుప్రీతి, అధికార పార్టీ నేతల సిఫారసులకు ఎదురు లేకుండా పోతోంది. కర్నూలు(ఆర్యూ): వర్సిటీలో పోస్టుల భర్తీ వ్యవహారం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క రోజు ముందు కూడా అధికారులు సరైన వివరాలు వెల్లడించకపోవడం వెనుక భారీగా పైరవీలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సుమారు 75 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించగా.. 406 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నియామకంలో రోస్టర్ పాయింట్లు ఉండవని.. రిజర్వేషన్లు పాటిస్తామని ఇది వరకు వీసీ ప్రకటించారు. అయితే సబ్జెక్టు వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనే విషయంలోనూ గోప్యత పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. పోస్టుల భర్తీ విషయంలో పెద్ద ఎత్తున పైరవీలు జరగడం వల్లే వర్సిటీ అధికారులు ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సిఫారసులతో అభ్యర్థులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పోస్టులను అమ్మకానికి పెట్టినట్లు విద్యార్థులు గత సోమవారం వర్సిటీ ఎదుట ఆందోళన చేపట్టినా అధికారుల్లో చలనం లేకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఎప్పుడూ లేని వింత పద్ధతి వర్సిటీలో కొందరు అధ్యాపకులు 10 సంవత్సరాలుగా.. మరికొందరు 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతామా అనే ఆశతో వీరంతా నిరీక్షిస్తున్నారు. నియామకం పొందినప్పటి నుంచి ఈ అధ్యాపకులు ఆటోమేటిక్ రెన్యూవల్ అవుతూ వస్తున్నారు. అయితే తాజాగా కొత్త దరఖాస్తుదారులతో పాటు వీరు కూడా దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పడం వివాదాస్పదం అవుతోంది. ఇంతకాలం వర్సిటీకి సేవలు అందించగా.. తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పాత వారిని సాగనంపే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. కాల్ లెటర్లు పంపిస్తున్నారు.. క్లారిటీ లేదంటారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ కాల్ లెంటర్లు పంపించారు. బుధవారం(14న) నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. అయితే అధికారులు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? ఏ సబ్జెక్టుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనే విషయాలను బయటకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రిజిస్ట్రార్‌కు సంబంధం లేకుండా వీసీ ఎకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీడీఎఫ్ స్కాలర్స్ టీచింగ్ అసిస్టెంట్‌లా? బయో కెమిస్ట్రీ రీసెర్స్ స్కాలర్స్ అయిన హలీమ్, రజాక్‌లు, పీడీఎఫ్‌లు కమల, కిరణ్, సెంథాల్లకు యూజీసీ నుంచి రూ.50వేలకు పైగా స్కాలర్షిప్ వస్తోంది. రీసెర్చ్ స్కాలర్స్ అయిన వీరిని టీచింగ్ అసిస్టెంట్లుగా వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెంథాల్ రీసెర్చ్ స్కాలర్ అయినప్పటికీ హెచ్ఓడీగా నియమించడం గమనార్హం. అనర్హులకూ కాల్ లెటర్లు దరఖాస్తుకు ముందు రోజు థీసిస్ సమర్పించిన ఎంసీఏ రాజేశ్వరికి కాల్ లెటర్ పంపడం.. ఎంకామ్‌లో పీహెచ్డీ చేసిన రేణుక, సురేంద్రలను ఎంబీఏలో ఫ్యాకల్టీలుగా ఎలా అనుమతిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సురేంద్ర వినాయక మిషన్ అనే యూజీసీ గుర్తింపు లేని సంస్థ నుంచి చెల్లుబాటు కాని పీహెచ్డీ సమర్పిస్తే ఎలా కొనసాగిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో చిరంజీవిరెడ్డి గత రెండు సంవత్సరాలుగా అధ్యాపకులుగా పని చేసినా కాల్ లెటర్ పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు అర్హుడైనా.. ఇప్పుడు ఎందుకు అర్హుడు కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంగ్లిష్‌లో ప్రతాప్ అనే అభ్యర్థికి కూడా కాల్ లెటర్ పంపకపోవడం వెనుక మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. అంతా అయ్యాక చెప్తా అసలు మీకు ఇది వార్తే కాదు. ఎంత మంది దరఖాస్తు చేశారో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో మాకే ఇంత వరకు క్లారిటీ లేదు. నియామకాలన్నీ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తాం. - నరసింహులు, ఆర్యూ వీసీ నేటి నుంచి ఇంటర్వ్యూలు రాయలసీమ యూనివర్సిటీలో నేటి నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 14వ తేదీన ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ, మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్, 16న ఎడ్యుకేషన్, కంప్యూటర్స్ సైన్స్, 17న ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, 18న ఎకనామిక్స్, 19న కామర్స్, ఎంబీఏ, 20న బోటనీ, జువాలజీ, బయో టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, 21న తెలుగు సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ అమర్నాథ్ తెలిపారు. -
కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారు
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ నెల్లూరు(వేదాయపాళెం) : విక్రమ సింహపురి యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకంలో చోటుచేసుకున్న అవినీతిపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వరరావు విచారణ జరపారన్నారు. వర్సిటీ మూసివేతకు సిఫార్సు చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన వర్సిటీ ఆయన మరణాంతరం అవినీతిమయంగా మారిందన్నారు. మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లినా ఆయన తగిన రీతిలో స్పందించటం లేదన్నారు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.హరికృష్ణయాదవ్, బి.సత్యకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి టి.వినీల్, కార్యదర్శి సుమంత్, నాయకులు రాహుల్, తరుణ్‌లు పాల్గొన్నారు. -
బేరం మొదలైంది..
సాక్షి, ఒంగోలు : అందరూ ఊహించినట్లే టీడీపీ నేతల దందా మొదలైంది. పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయ మార్గాల కోసం తెలుగు తమ్ముళ్లు బిజీ అయ్యారు. జిల్లాస్థాయి నేతల కనుసన్నల్లో మెలిగే చోటామోటా నేతలు సైతం రేషన్ డీలర్‌షిప్‌లు, ఇతర పోస్టులకు బహిరంగంగా ‘బేరం’ పెడుతున్నారు. రూ.లక్షలాది సొమ్మును అతితక్కువ కాలంలో ఆర్జించేందుకు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు పన్నిన పన్నాగం.. జిల్లాలో పలుచోట్ల రక్తపాతానికి దారితీస్తోంది. తమ లాభార్జనకు అడ్డుగా ఉన్న వారిపై దాడులుకు తెగబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న వరుస దాడుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రగాయాలపాలవుతున్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పెదఅలవలపాడులో గురువారం జరిగిన దాడి ఒకరి మృతికి దారితీసింది. ఇదేదాడిలో మరోముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడగా ఒంగోలు రిమ్స్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ నేతల దుందుడుకు చర్యలపై అన్నివర్గాలు మండిపడు తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే ఆ పార్టీ నేతలు ధనార్జనకు వెంపర్లాడటంతోనే గ్రామాల్లో గొడవలు పెరుగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దాడులపై పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించకపోవడంపైనా విమర్శలు గుప్పుమంటున్నాయి. రూ. లక్షల్లో బేరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాలకు భారీగా ఖర్చుపెట్టిన మొత్తాన్ని అతితక్కువ కాలంలో వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌దుకాణాలు, కాంట్రాక్ట్ పోస్టులు, అంగన్వాడీలు, ఉపాధిహామీ పనులపై కన్నేసిన సంగతి బహిర్గతమైంది. పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుని మరీ ఆయా అంశాల్లో లొసుగులు గుర్తించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,202 రేషన్దుకాణాలుండగా వాటిల్లో 100 చోట్ల ఇన్‌చార్జిలే డీలర్షిప్ డీడీలు చెల్లిస్తూ నడిపిస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నాలుగు నియోజకవర్గాలను మినహాయించి వైఎస్సార్సీపీ గెలిచిన చోట్ల రేషన్‌దుకాణాలపై కన్నేశారు. గ్రామంలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్ద మోతుబరిని గుర్తించి అతని వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలు దండుకుని రేషన్డీలర్షిప్పు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంగన్వాడీ కాంట్రాక్ట్ పోస్టులకు సైతం బేరంపెడుతున్నట్లు.. గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి. తమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అనవసరంగా జోక్యం చేసుకుని రేషన్డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సాఫీగా కొనసాగే డీలర్‌షిప్పులను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కలెక్టర్, ఆర్డీవోలను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం స్పందించి పార్టీ శ్రేణులను కట్టడిచేయకుంటే ఆందోళనలకు సిద్ధపడతామని ప్రజాసంఘాల నేతలు, వ్యాపార, ఉద్యోగవర్గాలతో పాటు గ్రామీణులు హెచ్చరిస్తున్నారు.