సుబాబుల్ ధర తగ్గించేది లేదు
కంపెనీల ముక్కు పిండి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా
గాంధీనగర్ : తమకు నష్టాలు వస్తున్నందున సుబాబుల్ కొనుగోలు ఒప్పంద ధర తగ్గించాలని పేపర్ కంపెనీలు చేసుకున్న అభ్యర్థనను అంగీకరించేది లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల సుబాబుల్ రైతులతో మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో పేపర్ కంపెనీలు టన్ను సుబాబుల్‌ను రూ.4400 ధరకు కొనుగోలు చేసేందుకు అంగీకరించాయని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. తాము నష్టాబాట పట్టినందున రూ.700 తగ్గించి ధర నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖకు లేఖ రాశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశామని చెప్పారు. సుబాబుల్ మార్కెటింగ్, తూకం, రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. పేపర్ కంపెనీలకు ఎటువంటి నష్టాలూ లేవని, నిర్ణయించిన ధరకు కొనాల్సిందేనని స్పష్టంచేశారు. జిల్లాకో రేట నిర్ణయించడాన్ని నియంత్రించాలని, అనధికార రవాణాను నిలుపుదల చేయాలని కోరారు.
ఎస్పీఎం కంపెనీ రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు జిల్లాల రైతులకు రూ.20 కోట్లు చెల్లించాలని తెలిపారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీపై కేసులు వేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవాలని, అవసరమైతే ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసుల జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించారు. ఫిబ్రవరి 18తో కంపెనీలు, రైతుల ఒప్పందం ముగుస్తున్నందును ఈ దఫా రేటు పెంచేలా ఒత్తిడి చేస్తామన్నారు. కలెక్టర్ బాబు.ఎ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ కిషోర్, సలహాదారు కృష్ణారావు, డెరైక్టర్ అహ్మద్, జేడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జేడీ శ్రీనివాసరావుపై రైతుల ఆగ్రహం
మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరెక్టర్ జి.శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సుబాబుల్ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పేపర్ కంపెనీలతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఒంగోలుకు చెందిన రైతు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీతో జేడీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.