ఎన్నికల్లో డబ్బు నియంత్రణకు యంత్రాంగం
హైదరాబాద్: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలను, అభ్యర్థులను నియంత్రించేందుకు ఒక అర్థవంతమైన యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. జాతి ప్రయోజనం కోసమే ఇది తప్పనిసరి అని, దీని వల్ల నల్లధనం కూడా బయటకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై లోతుగా విచారణ జరపాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశంపై నమోదైన కేసులో కోర్టు సహాయకులు (అమి కస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, వేదుల వెంకటరమణను నియమించింది. ఈ కేసు రికార్డులను వారికివ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఎన్నికల్లో డబ్బు నియం త్రణపై దాఖలైన పిల్‌పై చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.