Convacation Day
-
తమ్ముడు నేను సీనియర్నే.. సీఎం చమత్కారం!
సాక్షి, చెన్నై: రాజధాని కళాశాలలో తాను సీనియర్ అని, ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి సీఎం అన్నారు. చెన్నైలోని రాజధాని కళాశాలలో డిగ్రీల ప్రదానోత్సవం మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు సీఎం స్టాలిన్, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ గత స్మృతులను నెమర వేసుకున్నారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నట్లు నాటి రోజులను విద్యార్థుల దృష్టికి తెచ్చారు. పొలిటికల్ సైన్స్ తాను ఇక్కడే చదువుకున్నట్లు వివరించారు. అప్పటి మిత్రులను గుర్తు చేసుకుంటూ, ఆ కాలంలో విధించిన ఎమర్జనీ కారణంగా తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాను ఈ కళాశాలలో సీనియర్ అని, అందుకే ఇక్కడున్న విద్యార్థులను సీనియర్‌గా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇక, ఈ కళాశాలల్లో రెండు వేల మంది విద్యార్థులు కూర్చునేందుక వీలుగా,అ న్ని సౌకర్యాలతో కలైంజర్ కరుణానిధి పేరిట ఆడిటోరియం నిర్మించనున్నామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Tamil Nadu Crime: ఓటీపీ చెప్పలేదని భార్య, పిల్లల ఎదుటే.. -
భారత్ బలాన్ని చాటేలా.. పరిశోధనలుండాలి!
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి సహా చాలా మంది ప్రముఖులను ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి అందించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో నేటి తరం పాత్ర కీలకమని ఉద్బోధించారు. భారత్ బలాన్ని ప్రపంచానికి చాటే దిశగా యువత పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. బుధవా రం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులు విరజిమ్ముతోందని కీర్తించారు. వైఎస్ జగన్, కేసీఆర్‌తో విశ్వవిద్యాలయానికున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగానికెదిగిన ప్రముఖులను ప్రస్తావించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి, పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీఫ్, క్రీడాకారిణి సానియా మీర్జా అనేక మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ సైతం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. పరిశోధనల కేంద్రం దేశ ఆయుధాగారంలో ప్రధాన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఉస్మానియా యూనివర్సిటీ లేబొరేటరీలతో కలసి నిర్వహించడం గర్వించదగ్గ పరిణామమని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌లో భారత్ పురోభివృద్ధిలో ఉందన్నారు. రొబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, వేగవంతమైన సమాచార వ్యవస్థను భారత్ సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఏ దేశ బలానికైనా ఆర్థిక, సాంకేతిక అంశాలే కొలమానమని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయికి ఎదగాలి ఉస్మానియాలో చదివిన విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జీవితానికి విజయ సూచిక అని పేర్కొన్నారు. వర్సిటీని వీడి వాస్తవ జీవితంలోకి వెళ్తున్న విద్యార్థులకు సమాజమే ప్రయోగశాల అని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వించేలా ఉండాలని సూచించారు. పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. మీ జీవితాలు తెల్లకాగితం లాంటివి అందులో ఎలా రాసుకుంటే అలా భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కెమిస్ట్రీలో 5బంగారు పతకాలు సాధించిన ఎస్.సుశాంత్, 4 బంగారు పతకాలు సాధించిన మహేష్కర్, గోల్డ్‌మెడల్స్ సాధించిన ఇతరులను అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవం.. వర్చువల్‌గా
వాషింగ్టన్: ఈఏడాదికి అమెరికాలో తమ చదువులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు వర్చువల్ స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భారత విద్యార్థులు, కుటుంబీకులు, మిత్రులు పాల్గొన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది జరిగే అన్ని స్నాతకోత్సవాలు రద్దవడం తెల్సిందే. దీంతో ఎంబసీ ఆఫ్ ఇండియా స్టూడెంట్ హబ్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహించింది. అనుకోని ఘటనలే అంతులేని అవకాశాలను కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ విద్యార్థుల్లోనే భవిష్యత్ ఆవిష్కరణ కర్తలు, ఎంటర్ ప్రెన్యూర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్, ఎంటర్ప్రెన్యూర్ లాలిత్య మున్షా, నటి గౌతమి తడిమెల్ల, తబలా మాస్టర్ దివ్యాంగ్ వాకిల్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ వేణు గోపాల్, ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. -
కఠోర శ్రమతోనే విజయతీరాలు
చేబ్రోలు: కఠోర శ్రమతోనే విజయతీరాలు చేరువవుతాయని సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద పేర్కొన్నారు. చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు చెందిన ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆచార్య ఫౌడ్ బెన్నిస్, పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రదకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద మాట్లాడుతూ రాజకీయ రంగమైనా, సినీ రంగమైనా క్రమశిక్షణ, నిజాయతీతో కూడిన శ్రమతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఫ్రొఫెసర్ ఫౌడ్ బెన్నిస్ మాట్లాడుతూ యువతకు లక్ష్యముండాలన్నారు. మేడసాని మోహన్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్నానని, సొంత గడ్డపై తీసుకున్న డాక్టరేట్ గొప్పదని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ఉన్నతికి మాత్రమే వినియోగించాలని సంస్కృతి విచ్ఛిన్నతికి కాదని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి, కార్యక్రమ ముఖ్యఅతిథి డాక్టర్ షహీద్ మహమ్మద్ అబ్దాలి అన్నారు. 1,279 మందికి డిగ్రీలు.. వర్సిటీ కులపతి డాక్టర్ కే రామ్మూర్తినాయుడు, ఉప కులపతి డాక్టర్ సీ తంగరాజ్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1279 మందికి డిగ్రీలు అందజేసినట్లు తెలిపారు.