కఠోర శ్రమతోనే విజయతీరాలు
కఠోర శ్రమతోనే విజయతీరాలు
Published Sun, Oct 16 2016 5:59 PM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
చేబ్రోలు: కఠోర శ్రమతోనే విజయతీరాలు చేరువవుతాయని సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద పేర్కొన్నారు. చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు చెందిన ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆచార్య ఫౌడ్ బెన్నిస్, పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రదకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద మాట్లాడుతూ రాజకీయ రంగమైనా, సినీ రంగమైనా క్రమశిక్షణ, నిజాయతీతో కూడిన శ్రమతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
ఫ్రొఫెసర్ ఫౌడ్ బెన్నిస్ మాట్లాడుతూ యువతకు లక్ష్యముండాలన్నారు. మేడసాని మోహన్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్నానని, సొంత గడ్డపై తీసుకున్న డాక్టరేట్ గొప్పదని ఆనందం వ్యక్తం చేశారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ఉన్నతికి మాత్రమే వినియోగించాలని సంస్కృతి విచ్ఛిన్నతికి కాదని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి, కార్యక్రమ ముఖ్యఅతిథి డాక్టర్ షహీద్ మహమ్మద్ అబ్దాలి అన్నారు.
1,279 మందికి డిగ్రీలు..
వర్సిటీ కులపతి డాక్టర్ కే రామ్మూర్తినాయుడు, ఉప కులపతి డాక్టర్ సీ తంగరాజ్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1279 మందికి డిగ్రీలు అందజేసినట్లు తెలిపారు.
Advertisement