స్నాతకోత్సవంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై, డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి చేతుల మీదుగా కెమిస్ట్రీలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాను అందుకుంటున్న డా. కందుకూరి ఉషారాణి
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా చాలా మంది ప్రముఖులను ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి అందించిందని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో నేటి తరం పాత్ర కీలకమని ఉద్బోధించారు. భారత్ బలాన్ని ప్రపంచానికి చాటే దిశగా యువత పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. బుధవా రం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులు విరజిమ్ముతోందని కీర్తించారు.
వైఎస్ జగన్, కేసీఆర్‌తో విశ్వవిద్యాలయానికున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ రంగానికెదిగిన ప్రముఖులను ప్రస్తావించారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి, పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఐహెచ్ లతీఫ్, క్రీడాకారిణి సానియా మీర్జా అనేక మంది వర్సిటీ పూర్వ విద్యార్థులే అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు, వింగ్ కమాండర్ రాకేష్ శర్మ సైతం పూర్వ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు.
పరిశోధనల కేంద్రం
దేశ ఆయుధాగారంలో ప్రధాన క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఉస్మానియా యూనివర్సిటీ లేబొరేటరీలతో కలసి నిర్వహించడం గర్వించదగ్గ పరిణామమని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌లో భారత్ పురోభివృద్ధిలో ఉందన్నారు. రొబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, వేగవంతమైన సమాచార వ్యవస్థను భారత్ సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఏ దేశ బలానికైనా ఆర్థిక, సాంకేతిక అంశాలే కొలమానమని పేర్కొన్నారు.
అత్యున్నత స్థాయికి ఎదగాలి
ఉస్మానియాలో చదివిన విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జీవితానికి విజయ సూచిక అని పేర్కొన్నారు. వర్సిటీని వీడి వాస్తవ జీవితంలోకి వెళ్తున్న విద్యార్థులకు సమాజమే ప్రయోగశాల అని చెప్పారు. ఓయూ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గర్వించేలా ఉండాలని సూచించారు. పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టాలన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యం దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు.
మీ జీవితాలు తెల్లకాగితం లాంటివి అందులో ఎలా రాసుకుంటే అలా భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం కెమిస్ట్రీలో 5బంగారు పతకాలు సాధించిన ఎస్.సుశాంత్, 4 బంగారు పతకాలు సాధించిన మహేష్కర్, గోల్డ్‌మెడల్స్ సాధించిన ఇతరులను అభినందించి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment