నినాదాలు చేయడంతో ఈడ్చికొట్టారు!
వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్ యూ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తుండగా నినాదాలు చేసిన ఓ విద్యార్థిపై కొందరు దాడికి పాల్పడ్డారు. బీహెచ్ యూ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం ఇక్కడ జరిగిన స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ స్థాపకుడు, భారత రత్న మదన్మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళులర్పించారు. విద్యార్థులకు స్నాతకోత్తర డిగ్రీలు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
ఆయన ప్రసంగం ముగించి వేదిక నుంచి వెనుదిరుగుతుండగా.. అశుతోష్ కుమార్ అనే విద్యార్థి బిగ్గరగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల అంశాన్ని ఆయన లేవనెత్తాడు. ఈ యూనివర్సిటీలో 1997 నుంచి విద్యార్థి సంఘం ఎన్నికలను రద్దు చేయడంతో ఈ అంశంలో 'మోదీజీ విద్యార్థుల మాట వినండి' అంటూ నినదించాడు. దీంతో పోలీసులు అతన్ని బలవంతంగా వేదిక నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి విద్యార్థి అశుతోష్ పై చేయిచేసుకున్నాడు. అతడిని ఈడ్చికొట్టాడు. మిగతా బీజేపీ మద్దతుదారులు కూడా అతన్ని చుట్టుముట్టడంతో కష్టంమీద అతన్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
విద్యార్థులపై లాఠీచార్జ్!
ప్రధాని మోదీ రాక సందర్భంగా బీహెచ్ యూ యూనివర్సిటీ వెలుపల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.