సహకార స్ఫూర్తితో ప్రతిఘటించాలి
మహాసభలో ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్
వరంగల్ : బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని సహకార స్ఫూర్తితో సంఘటిత ఉద్యమం ద్వారా ప్రతిఘటించాలని ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపు నిచ్చారు. హన్మకొండలోని నందనాగార్డెన్ (సుందరయ్య నగర్)లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పాటూరి రామయ్య అధ్యక్షతన గురువారం జాతీయ 8వ మహాసభలు జరిగాయి.
పట్నాయక్ ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోవడం వల్ల ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు. జాతీయ ఆర్థిక రంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రయత్నించాలన్నారు.
వ్యవసాయ కార్మికుల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాల, భూ పంపిణీ చేపట్టాలనే డిమాండ్ ప్రధానమైనదిగా పేర్కొన్నారు. భూస్వాముల వద్ద ఉన్న సాగు చేయని భూములను పంచి చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీలు, అప్పులు ఇచ్చేలా.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. ఆహార భద్రత, పనిహక్కు, సరైన వైద్యం, విద్య, పెన్షన్లు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతగా పేర్కొన్నారు.
ప్రాధాన్యత రంగాలను విస్మరించారు...
భూ సంస్కరణల లోపం, కొందరు వ్యక్తుల చేతుల్లో భూమి పరాధీనం కావడంతో వ్యవసాయ రంగ పురోభివృద్ధి నిలిచిపోయిందని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ముఖ్యంగా మార్కెట్లో ధరల సమస్య, సబ్సిడీల అందజేత, ఆహార ధాన్యాల నిల్వలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషించారు. బ్యాంకుల జాతీయకరణ తర్వాత పాలకులు ప్రాధాన్యత రంగాలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదు దశాబ్దాల కాలంలో వ్యవసాయ ఆర్థికాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నూతన ఆర్థిక, సరళీకరణ విధానాల ప్రభావం పెరిగిందని, వ్యవసాయరంగానికి సబ్సిడీల తగ్గింపు, విదేశీ మార్కెట్లో పెరిగిన పోటీ, పెట్టుబడి పెరగకపోవడం, మార్కెట్లో ధరల తగ్గుదల వల్ల సంక్షోభం నెలకొందన్నారు.
పెరిగిన దారిద్య్రం
పేదలు ఆకలితో అల్లాడుతుంటే దేశంలో 82 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ చేయడం సిగ్గుచేటని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ నిల్వలలను ప్రజలకు పంపిణీ చేయడం వల్ల మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వ విధానాలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి, కార్పొరేట్ శక్తుల వల్ల పేదలకు ఆహారం అందించలేకపోతున్నాయని వివరించారు. జాతీయ సర్వే ప్రకారం గ్రామీణ పేదలకు 2,400 కాలరీల ఆహారం నుంచి 2వేలకు పడిపోయిందన్నారు. దారిద్య్రరేఖకు దిగువ ఉన్న వారి సంఖ్య 1973లో 56.3శాతం ఉంటే... 1983లో 56శాతం... 1993లో 69.5 శాతం... 2009లో 75.5శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఉపాధి’ని దెబ్బతీసే కుట్ర
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు సాగుతున్నాయని ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు 100 రోజుల పనిదినాలు కల్పించాలనే హక్కును హరించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పనిదినాలు కల్పించకుంటే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ పథకానికి బదులు ప్రజాకర్షక పథకాలు చేపడితే కార్పొరేట్ల జేబులు నిండుతాయనేది పాలకుల అసలు ఉద్దేశమన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే ఈ పథకంపై జరుగుతున్న దాడి తెలుస్తుందన్నారు. బాజిల్త్రీ పేరుతో ఆసియాదేశాల్లో కొనసాగిస్తున్న నిబంధనల వెనుక ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే కుట్ర దాగుందన్నారు. సభలో కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, నాయకులు శ్రీనివాస్, ఏపీ కార్యదర్శి మధు, సంఘం నాయకులు జి.నాగయ్య, వెంకట్, మురళీకృష్ణ, చుక్కయ్య, మెట్టు శ్రీనివాస్, రంగయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.