'కూర్గ్ ల్యాండ్' రాష్ట్ర ఏర్పాటుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా
ఆంధ్రప్రదేశ్ విభజించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గోర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, విదర్భ, కార్బిల్ ల్యాండ్ రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రత్యేక కూర్గ్ ల్యాండ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కర్నాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన వందలాది మంది జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూర్గి బ్యానర్లు, తలకు రిబ్బన్లు ధరించిన ఆందోళనకారులు తొలుత రాంలీలా మైదానంలో సమావేశమయ్యారు. ఆతర్వాత జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దక్షిణ కర్నాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని వారు నినాదాలు చేశారు.
కూర్గ్ నేషనల్ కౌన్సిల్ బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలను కలిసి కూర్గ్ ల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం విజ్ఞాపన పత్రాలను సమర్పించారు.