ప్రతిరూపం.. కళ్లెదుటే నిర్జీవం
► ఎన్నో నోముల ఫలితం లేక లేక కలిగిన సంతానం
► అప్పటి వరకు ఆడిపాడిన ఆ బుడిబుడి అడుగులు
► మృత్యుదరికి చేరాయి పెదాలను వీడని బోసినవ్వులు
► శాశ్వతంగా కనుమరుగుయ్యాయి కన్నవారికి కడుపుకోత మిగిల్చాయి
నార్పల : నార్పల మండలం నిలువురాయి గ్రామంలో రత్నమ్మ, ఆదినారాయణ దంపతుల ముద్దుల తనయ లిఖిత(6) బుధవారం సాయంత్రం జరిగిన విద్యుదాఘాతానికి బలైంది. తన ఈడు పిల్లలతో కలసి ఆడుకునేందుకు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అకాల మృత్యువాతపడింది.
జరిగిందేమిటంటే...
లిఖిత గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతి చదివేది. సాయంత్రం పాఠశాల వదలగానే తోటి పిల్లలతో కలసి వెంకటేశ్ అనే రైతుకు చెందిన తోటలోకి ఆడుకునేందుకు వెళ్లింది. అక్కడ బోరు మోటారుకు చెందిన స్టార్టర్ పెట్టె నేలపై ఉండడంతో కేబుల్ వైర్ నుంచి విద్యుత్ ప్రసారమయ్యే కాపర్ తీగలు బయటపడ్డాయి. వాటిని తాకితే ఏమవుతుందో తెలియని చిన్నారి పొరపాటున పాదం మోపింది. ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై సమీపంలోని నీటి తొట్టెలోకి నెట్టేయబడింది. అక్కడికక్కడ మరణించింది. తోటి పిల్లలు గట్టిగా కేకలు వేయగా, సమీప పొలాల్లోని రైతులు సహా గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. నీటి తొట్టెలో పడిపోయిన లిఖితను వెలికితీయగా అప్పటికే ఆమె ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.
అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ..
ఇక తమ బిడ్డ లేదని తెలిసి లిఖిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. నిర్జీవంగా మారిన లిఖితను ఆమె తల్లి తన చేతుల్లోకి తీసుకుని అయ్యో బిడ్డా.. ‘బంగారు. నా బంగారు లేమ్మా.. నన్ను ఒక్కసారి చూడమ్మా... నేను మీ అమ్మను కదా. నాతో మాట్లాడు.. శివరాత్రికి అమ్మమ్మ వారి ఊరికి వెళ్దామంటివే.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా కన్నా... అంటూ లిఖి త తల్లి రత్నమ్మ ఒక్కో మాట అడుగుతుంటే అక్కడున్న వారి హృదయాలు బరువెక్కాయి. మనవరాలిని చూసి నాన్నమ్మ సైతం కన్నీరుమున్నీరుగా విలపించింది.