Google: ఇంటర్నెట్తో ముందు ముందు కష్టమే!
ఇంటర్నెట్లో ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారా? అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అది అసలు అర్థమయ్యేలా ఉంటోందా? లేదంటే అవతలి వాళ్లను రెచ్చగొట్టేదిగా ఉందా? పోనీ పోస్ట్ చేసేముందు విషయాన్ని ఒకసారి సమీక్షించుకుంటున్నారా?.. ఇలాంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్నెట్లో వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే ఎలా పడితే అలా కంటెంట్ పోస్ట్ చేస్తామంటే ఇక మీదట కుదరదు.
కొత్త ఐటీ చట్టాల్ని (మే 26) నుంచి బలవంతంగా రుద్దిన కేంద్రం.. కంటెంట్ కట్టడి విషయంలో తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో ఇంటర్నెట్ దిగ్గజాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాయి. పారదర్శకంగా, సమ్మతి ఉన్న కంటెంట్‌ను మాత్రమే అనుమతి ఇస్తూ.. ఫిర్యాదులు, అభ్యంతరకర కంటెంట్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. అంతేకాదు నెలనెలా ఆ సమీక్ష వివరాల్ని నివేదికల రూపంలో సైతం విడుదల చేస్తున్నాయి.
కంప్లయింట్ చేస్తే చాలు
భారత్ విషయానికొస్తే.. ఆగష్టు నెలకుగానూ గూగుల్ కంటెంట్ విషయంలో మొత్తం 35, 191 ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా 93, 550 పీసుల కంటెంట్‌ను తొలగించింది గూగుల్. ఇది కాకుండా యూజర్ల నుంచి వచ్చిన రిపోర్ట్స్(ఫిర్యాదులు) ఆధారంగా ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా మరో ఆరున్నర లక్షల కంటెంట్ పీసులను తీసిపడేసింది. జులై నెలలో ఫిర్యాదులు 36, 934 ఫిర్యాదులు అందగా.. 95, 680 పీసుల కంటెంట్‌ను తొలగించింది. ఇక ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా ఐదున్నర లక్షలకు పైగా కంటెంట్ పీసుల్ని తొలగించింది.
కాపీనే టాప్
వీటిలో చాలావరకు థర్డ్ పార్టీ కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉండడం విశేషం. స్థానిక చట్టాల్ని ఉల్లంఘించే కంటెంట్(పోస్టులు), వ్యక్తిగత హక్కుల్ని భంగం కలిగించడం, పరువుకు నష్టం వాటిల్లడం, మనోభావాల్ని దెబ్బతీయడం లాంటి ఫిర్యాదుల ఆధారంగా ఈ కంటెంట్‌ను తొలగించినట్లు గూగుల్ ప్రకటించుకుంది.
ఫిర్యాదులు కేటగిరీల వారీగా..
► కాపీరైట్స్ - 92, 750
► ట్రేడ్‌మార్క్- 721
► కోర్ట్ ఆర్డర్ - 12
► గ్రాఫిక్ సెక్సువల్ కంటెంట్- 12
► ఇతరత్ర లీగల్ రిక్వెస్టులు - 4
అశ్లీల, అనుచిత కంటెంట్‌ను(పోస్టులు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే) ఫిర్యాదుల ఆధారంగా తొలగించింది గూగుల్. ఒకే కంటెంట్ లేదంటే ఒకే తరహా కంటెంట్ విషయంలో పదే పదే ఫిర్యాదులు అందిన తరుణంలో వాటిని తొలగించినట్లు తెలిపింది. కంటెంట్ విషయంలో ‘యూఆర్ఎల్’ ఆధారంగానే తొలగించిన కంటెంట్‌ను లెక్కగట్టినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు పదేపదే కాపీ కంటెంట్ ఫిర్యాదులు అందితే మాత్రం కఠినచర్యలు తప్పవని, అవసరమైతే లీగల్ యాక్షన్స్..నిషేధం(తాత్కాలికం/శాశ్వతం) తప్పదని హెచ్చరిస్తోంది గూగుల్. ఆగష్టు నెలలో మిగతా ప్లాట్‌ఫామ్స్ తీసుకున్న చర్యల్ని పరిశీలిస్తే..
ఫేస్బుక్.. 31.7 మిలియన్ల కంటెంట్(పది కేటగిరీలుగా విభజించి) పీసులను తొలగించింది
ఇన్స్టాగ్రామ్.. 2.2 మిలియన్ పీసుల కంటెంట్(తొమ్మిది కేటగిరీలుగా విభజించి)ను తీసేసింది
వాట్సాప్ 2 మిలియన్ల అకౌంట్లను నిషేధించింది.
కంటెంట్‌తో పాటు ఫొటోలు, వీడియోలు, కామెంట్లు ఏదీ అతీతం కాదు
కంటెంట్ రెచ్చగొట్టేదిగా, అవతలి వాళ్లను నేరాలకు ప్రేరేపించేదిగా.. వుసిగొల్పేదిగా ఉండకూడదు
‘వార్నింగ్’ ‘గ్రాఫిక్స్ వార్నింగ్’ ఇచ్చిన కంటెంట్‌ను సైతం ఫిర్యాదు అందితే తొలగించడమే ఇక!
రిపోర్టుల ఆధారంగానూ కంటెంట్ తీసేయాల్సిందే!
కంటెంట్ గందరగోళంగా ఉన్నాసరే రిపోర్ట్/ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ఆ కంటెంట్‌ను తొలగిస్తారు.