హీరో మహేశ్, కొరటాలకు ఊరట
సమన్ల అమలును నిలిపివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివలకు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. శ్రీమంతుడు సినిమా విషయంలో కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ వీరికి నాంపల్లి కోర్టు జనవరి 24న జారీచేసిన సమన్ల అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణ గురువారం ఉత్తర్వులిచ్చారు. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా రూపొందించి, కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రచయిత ఆర్‌డీ విల్సన్ అలియాస్ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు, హీరో మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ తదితరులకు సమన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కొరటాల శివ వేర్వేరుగా పిటిషన్లు వేసిన నేపథ్యంలో న్యాయమూర్తి తాజా ఉత్తర్వులిచ్చారు.