ముంచెత్తనున్న మొక్కజొన్న
మార్కెట్ ధర కంటే సర్కారు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉండటంతో రైతులు మక్కలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ముందస్తుగా కోత కొచ్చే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అధికార యం త్రాంగం కొనుగోలు కేంద్రా లు ప్రారంభించింది. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సర్కారు కొనుగోలు కేంద్రాలకు మొక్కజొన్న ముంచెత్త నుంది. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజను కంటే ఈ సారి సుమారు రెండింతలకు మించి కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నట్లు అధికార యం త్రాంగం భావిస్తోంది. మార్కెట్ ధర కంటే సర్కా రు కొనుగోలు చేస్తున్న కనీస మద్దతు ధర ఎక్కువగా ఉం డటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి పోతున్నాయి. ముందస్తుగా కోత కొచ్చే ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాలను దృష్టిలో ఉం చుకుని అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది.
క్వింటాలుకు రూ.300 ఎక్కువ
ప్రభుత్వం మొక్కజొన్న కనీస మద్దతు ధర క్విం టాలుకు రూ.1,425 నుంచి రూ.1,700 పెంచింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.1,300 నుంచి రూ.1,400 మిం చి ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇంతకు మించి ధర ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. అలాగే ఫౌల్ట్రీ యజమానులు సైతం రూ.1,400 మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు సర్కారు కేంద్రాలకే ఎక్కువగా మొక్కజొన్నను తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న పంటనే అధికం గా సాగు చేస్తారు. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొం డ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సువాడ ప్రాంతాల్లో ఈ పంట అధికంగా సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజనులో సుమారు 1.17 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగైంది. సుమారు పది లక్షల క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు ఈ మేరకు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. మొత్తం 92 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే నాలుగు కేంద్రాల్లో సేకరణ షురూ చేశారు. ఇప్పటి వరకు 8,686 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
గత ఏడాది కొనుగోళ్లు..
గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి 3.59 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలో 1.75 లక్షల క్వింటా ళ్లు, కామారెడ్డి పరిధిలో 1.84 లక్షల క్వింటాళ్లు సేకరించారు. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు పది లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ కేంద్రాలను 92 వరకు పెంచాలని నిర్ణయించారు. ఈసారి కూడా కొనుగోళ్ల బాధ్యతలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
మొక్కజొన్న సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. రైతులకు ఇబ్బందులు రాకుండా పది లక్షల గన్నీబ్యాగులను అందుబాటులో ఉంచాము. కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ చేసేందుకు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను ఎంపిక చేశాము. ఈసారి ప్రైవేటు గోదాముల్లో కాకుండా, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములనే వినియోగిస్తున్నాము. ఈ కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.– చంద్రశేఖర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్