గజ్వేల్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ ప్రయత్నం ఫలించింది. ఈ నెల 31న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను మూసేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 20న ‘సాక్షి’ ‘మక్క రైతుకు మరో షాక్’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించి.. మరికొన్ని రోజులు కొనుగోళ్లు చేపట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు. ఇదిలావుంటే మార్కెట్ యార్డుల్లోని ఐకేపీ కేంద్రాల్లో వారం రోజులుగా గోదాములు ఖాళీ లేక వేలాది క్వింటాళ్ల మక్కలు పేరుకుపోగా కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి.
ఈ సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలోనే సోమవారం యార్డుల్లో నుంచి లారీలు కదిలాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.25 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. నవంబర్ నెలలో తుపాన్ ధాటికి అపార నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితి వల్ల మక్కలు పూర్తిగా రంగు మారాయి. నష్టాన్ని మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 62 లక్షల క్వింటాళ్లకుపైగా ఉత్పత్తులు ఉండగా ప్రభుత్వం అక్టోబర్ నెలలో జిల్లాలో 14 ఐకేపీ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు కేవలం 4 లక్షల క్వింటాళ్ల మక్కలను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.1,310 చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1050కి మించి ధర చెల్లించడంలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాలకే తరలిస్తున్నారు. ఇంకా రైతుల వద్ద లక్షలాది క్వింటాళ్లలో మక్కలు పేరుకుపోయాయి. చాలాచోట్ల రైతులు ఇంకా మొక్కజొన్న జూళ్లు విప్పనేలేదు. మరోపక్క గోదాముల కొరత కారణంగా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తుల తరలింపులో తీవ్ర జాప్యం నెలకొని కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఈ నెల 31న కొనుగోలు కేంద్రాలను మూసేయాలని భావించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను వివరిస్తూ ‘సాక్షి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ 31న కొనుగోలు కేంద్రాలను మూసేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ సూచనల మేరకు కేంద్రాలను కొనసాగిస్తున్నామని మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక సోమవారం ‘న్యూస్‌లైన్’కు వెల్లడించారు.
ఇప్పటివరకు కట్‌ఆఫ్ తేదీ అధికారికంగా రాలేదని, రైతుల అవసరాల దృష్ట్యా కొనుగోళ్లు చేపడతామన్నారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి గోదాములు కొరత కారణంగా కేంద్రాల్లో మక్కలు పేరుకుపోయి ఉన్నాయని చెప్పారు. చివరకు జిల్లాలోని 14 కేంద్రాల్లో పేరుకుపోయిన నిల్వలను సిద్దిపేటలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన గోదాముల్లోకి సోమవారం నుంచి తరలిస్తున్నామని, తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొనుగోళ్లు యథాతథంగా సాగేలా చూస్తామని స్పష్టం చేశారు.
మక్కలకు మోక్షం!
Published Tue, Dec 31 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement