Corporate training
-
TSRTC: వినూత్న ప్రయోగం.. సర్ అనండి.. సర్రున అల్లుకుపొండి
‘‘కస్టమర్.. అంటే మీకు ప్రయాణికులు.. వారే దేవుళ్లు, జీతాలిచ్చే దేవుళ్లు’’ ‘‘అప్పట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూసే వారు. ఇప్పుడు ప్రయాణికుల కోసం బస్సులు వేచి చూస్తున్నాయి. మళ్లీ పాత పద్ధతి రావాలి.. బస్సుల కోసం ప్రయాణికులు పరుగున వచ్చేలా చేయాలి’’ ‘‘టికెట్ ఇవ్వడంతో నా పని ముగిసిందన్న భావనను దరి చేరనీయొద్దు. ప్రయాణికులకు ఆర్టీసీపరంగా ఇంకా ఏదైనా సమాచారం కావాలేమో గుర్తించి తెలియచెప్పాలి’’ ..ఇవన్నీ బస్సుల్లో రాసి ఉండే సూక్తులు/ సూచనలు కాదు.. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లకు నరనరాన జీర్ణింపజేసేందుకు సిద్ధం చేసిన మాటలు. ఈ మాటలు అధికారులు చెప్తే అంతతొందరగా ఎక్కవని, నిరంతరం ఖాతాదారులతో తలమునకలై ఉండే బ్యాంకు మేనేజర్లు, పాలసీదారులను వెతికి పట్టుకుని పాలసీలు చేయించే ఎల్ఐసీ మేనేజర్లతో చెప్పించబోతున్నారు. వెరసి కండక్టర్ తీరే మారేలా శిక్షణకు సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతుండటంతో డ్రైవర్లకు ఓ కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్లపై దృష్టి సారించింది. కొంతకాలంగా క్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోతోంది. దీంతో ఇటీవలి వరకు రోజుకు రూ.14 కోట్ల ఆదాయం ఉండగా, ఇప్పుడది రూ.11 కోట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో.. బస్సులు మళ్లీ ప్రయాణికులతో కళకళలాడాలంటే వారిని ఆకట్టుకునేలా కండక్టర్ల ప్రవర్తన ఉండాలని ఆర్టీసీ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఇందుకోసం వారికి కార్పొరేట్ తరహాలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అది శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణాంశాలను రూపొందించిన ఆర్టీసీ, శిక్షణలో ప్రత్యేక తరగతులు తీసుకునేందుకు బ్యాంక్, ఎల్ఐసీ మేనేజర్లను గుర్తించింది. ఒక్కో అధికారికి ఒక్కో క్లాస్‌కు రూ.500 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. బ్యాంకు, ఎల్ఐసీ మేనేజర్లతో.. వీలైనన్ని సీట్లు నిండేలా చూడండి అంటూ ఇంతకాలం డిపో అధికారులు గేట్ మీటింగ్స్ పెట్టి కండక్టర్లకు చెప్పేవారు. ఈ క్రమంలోనే బస్టాపుల వద్ద కండక్టర్లు కిందకు దిగి ఊళ్లపేర్లు అరుస్తూ ప్రయాణికులు బస్సు ఎక్కేలా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తరహా మోటివేషన్ సరిపోదని ఆర్టీసీ ఎండీ భావిస్తున్నారు. దీంతో కండక్టర్లకు కూడా కార్పొరేట్ తరహా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో.. డ్రైవింగ్ నైపుణ్యం పెంచడంలో మేలైన శిక్షణ ఇస్తుందన్న పేరున్న చోలమండలం రిస్క్ సర్వీసెస్ అన్న సంస్థతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. సొంత శిక్షణ కాదని... ఖాతాదారులు, వినియోగదారులను ఆకట్టుకోవాలంటే బ్యాంకులు, ఎల్ఐసీ సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, తొలుత అయిష్టత చూపిన వారిని కూడా తమవైపు ఎలా తిప్పుకోవాలి, ఇందుకు ఆయా సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులేంటి.. తదితర వివరాలను అన్వయిస్తూ ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవాలనే కోణంలో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆయా డిపోల్లోనే నిత్యం 30 మంది కండక్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఓఆర్‌ను 75 శాతానికి చేర్చేందుకు చాలాకాలంగా ఆర్టీసీ యత్నించి విఫలమవుతోంది. దీంతో సొంత శిక్షణ బదులు కార్పొరేట్ స్టైల్‌ను అనుసరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏం చెబుతారంటే.. ► మనల్ని ఎదుటివారు ‘సర్/ మేడమ్’ అని అంటే క్షణకాలంపాటు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అందుకే ‘సర్/ మేడమ్’ అన్న పదంలో ప్రత్యేక మహత్తు ఉందంటారు మానసిక విశ్లేషకులు. ఇప్పుడు కండక్టర్లు కూడా ప్రయాణికులను సర్/మేడమ్ అంటూ సంబోధించాలని ఇందులో చెప్పనున్నారు. ►టికెట్ల జారీ పూర్తయ్యాక ప్రయాణికులకు ఆర్టీసీ పరిస్థితి వివరిస్తూ, బస్సులు ఎలా సురక్షితం, పెరిగిన ఇంధన ధరలతో వ్యక్తిగత వాహనాల వినియోగం జేబుకు భారం లాంటి విషయాలు చెప్పాలి. ఆరీ్టసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రయాణికులు, వారి సంబంధీకులకు అవగాహన కల్పించాలి. ►మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు.. ఇలాంటి వారి వద్ద ఎక్కువ లగేజీ ఉంటే.. ఎక్కేప్పుడు, దిగేప్పుడు సహకరించాలి. ► ప్రయాణికులు ఆర్టీసీకి సంబంధించి ఇతర వివరాలు అడిగినా, తదుపరి గమ్యానికి ఏ బస్కెక్కాలి, ఎక్కడ దిగాలి, బస్సు పాస్‌లు, ఒకరోజు పాస్ లాంటి వివరాలు చెప్పాలి. సమాచారం తెలియనప్పుడు ఎవరితో మాట్లాడితే తెలుస్తుందో వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలి. లేదా కనుక్కుని చెప్తానని ప్రయాణికుడి ఫోన్ నంబర్ తీసుకుని తర్వాత సమాచారమివ్వాలి. ► ఆ పూట డ్యూటీతో తన బాధ్యత ముగిసిందనే భావనలోంచి బయటికొచ్చి కండక్టర్ డ్యూటీ కూడా 24/7 అన్న భావనలోకి రావాలి. -
వ్యాపారులకు... అవకాశాల ‘నెట్వర్క్’
బీఎన్ఐ రిఫరెల్స్ వ్యాపారం రూ. 60,450 కోట్లు ♦ దేశంలో గతేడాది ఇది రూ.3,043 కోట్లు ♦ ప్రపంచవ్యాప్తంగా 1.9 లక్షల సభ్యులు ♦ ఇండియాలో ఈ సంఖ్య 9,800; హైదరాబాద్‌లో 10 చాప్టర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీధర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. చిన్నచిన్న అపార్ట్మెంట్లు కడుతున్నాడు. ఎప్పుడూ తన సొంత ప్రాజెక్టులకే పరిమితమవుతున్న శ్రీధర్... ఇతరుల భవనాలనూ నిర్మించాలనుకున్నాడు. కానీ ఇతరుల ప్రాజెక్టులెలా వస్తాయి? వాళ్లు శ్రీధర్‌ను నమ్మేదెలా? ఇవన్నీ ప్రశ్నలే. ఇంతలో శ్రీధర్‌కు ‘బీఎన్ఐ’ గురించి చెప్పాడు అతని స్నేహితుడు రామ్‌కుమార్. బీఎన్ఐ అంటే... బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. దాని సభ్యులంతా ఏదో ఒక రంగంలో వ్యాపారం చేస్తున్నవారే. సరే! చూద్దామనుకుని బీఎన్ఐ హైదరాబాద్ చాప్టర్లో సభ్యత్వం తీసుకున్నాడు. ఒకరోజు బీఎన్ఐ సమావేశానికి హాజరైన శ్రీధర్... తన కొత్త ప్రాజెక్టుకు సిమెంటు, స్టీల్ సరఫరా చేసే కాంట్రాక్టును తన చాప్టర్‌లోనే ఉన్న రాజీవ్‌కు అప్పగించాడు. రెండు సమావేశాలు గడిచాయో లేదో!! వేరొకచోట భవనం నిర్మించే పనిని శ్రీధర్‌కు అప్పగించాడు రాజీవ్. ఇలా ఒకరికొకరు ‘రిఫర్’ చేసుకోవటం వల్ల శ్రీధర్‌కు తేలిగ్గానే కాంట్రాక్టులు దక్కాయి. ఇదంతా చూశాక బీఎన్ఐ ఏంటి? ఎవరు చేరొచ్చు? ఎలా చేరాలి? వంటి సందేహాలన్నీ వస్తున్నాయా? మీకోసమే ఈ కథనం... వ్యాపారవేత్తలంతా ఒక బృందంగా ఏర్పడి... తరచు సమావేశమవుతూ తమలో తాము వ్యాపార అవకాశాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే ఈ బీఎన్ఐ. గతేడాది ఇలా బీఎన్ఐ సభ్యుల మధ్య రిఫరల్ ద్వారా జరిగిన వ్యాపారమెంతో తెలుసా? అక్షరాలా అరవైవేల నాలుగువందల యాభై కోట్ల రూపాయలు. ఇతరత్రా వ్యాపార సంఘాలకు భిన్నంగా 1.90 లక్షల మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తున్న ఈ గ్రూప్... ప్రధానంగా పనిచేసేది ‘ఇవ్వటం- పుచ్చుకోవటం’ అనే సూత్రంపైనే. అయితే బీఎన్ఐలో సభ్యులందరూ ఒకే చాప్టర్‌గా ఉండరు. విభిన్న వ్యాపారాల్లో ఉన్నవారంతా ఒక చాప్టర్‌గా ఏర్పడతారు. ఈ చాప్టర్లో ఒక రంగం నుంచి ఒకరు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అదే రంగానికి చెందిన వారెవరైనా కొత్త సభ్యత్వం కోసం వస్తే... వారికి వేరొక చాప్టర్లో అవకాశం ఇస్తారు. అయితే సభ్యులెవరైనా వరసగా మూడు సమావేశాలకు హాజరు కాకపోతే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. అంతేకాదు! బీఎన్ఐ తన సభ్యులకు నిరంతరం శిక్షణ కూడా ఇస్తుంది. ఇతర నగరాల్లోని చాప్టర్లతో సమావేశాల్ని ఏర్పాటు చేస్తుంది. సభ్యత్వం కావాలంటే వార్షిక, నెలవారీ రుసుము చెల్లించాలి. బీఎన్ఐ ద్వారా అంతర్జాతీయ అవకాశాలకు తోడు సభ్యుల మధ్య వ్యాపారానికి కూడా ఆస్కారం ఉందని బీఎన్ఐ మెంబర్, టోటెమ్ పీఆర్ ఈడీ శ్రీనివాసులు చెప్పారు. ఇవిగో... కొన్ని ఉదాహరణలు ♦ తెలుగు రాష్ట్రాల్లో బీఎన్ఐ ఒకింత బలంగానే ఉంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 10 చాప్టర్ల వరకూ నడుస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే... ♦ కార్పొరేట్ శిక్షణతో పాటు సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ అందించే శ్రుతి మశ్రూ... హైదరాబాద్‌లో ‘ఎల్డిన్’ సంస్థను ఆరంభించారు. బీఎన్ఐలో చేరాక ఆమె దుబాయి, నైజీరియాల్లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ♦ కార్ రెంటల్ రంగంలో ఉన్న సభ్యుడికి నగరంలోనే ఉన్న మరో సభ్యుడు రూ.3 లక్షల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. ♦ మీడియా, పబ్లిషింగ్ రంగాల్లో పెన్సార్ క్రియేషన్స్‌ను ఆరంభించిన ప్రియాంక సూర్యనేని... బెంగళూరు చాప్టర్ సమావేశంలో కొత్త అవకాశాలను అందుకున్నారు. ♦ మైండ్ స్క్రిప్ట్ ఫౌండర్ నేహ నాగ్‌పాల్... బీఎన్ఐ సాయంతో ఇతర నగరాల్లోనూ విస్తరించారు. భారత్ నుంచి రూ.3,043 కోట్లు.. బీఎన్ఐలో ప్రపంచవ్యాప్తంగా 2014లో 1.80 లక్షల మంది సభ్యుల మధ్య 66 లక్షల రెఫరల్స్ జరిగాయి. తద్వారా జరిగిన వ్యాపారం విలువ సుమారు రూ.53,320 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం 7,300 చాప్టర్లు, 1.90 లక్షల మంది సభ్యులున్నారు. 2015లో 77 లక్షల రెఫరల్స్ ద్వారా సుమారు రూ.60,450 కోట్ల వ్యాపారం నమోదైంది. ఇక భారత్‌లో 222 చాప్టర్లకుగాను 9,800కుపైగా సభ్యులున్నారు. 2015లో 5.67 లక్షల రెఫరల్స్ నమోదయ్యాయి. వీటి ద్వారా రూ.3,043 కోట్ల వ్యాపారం జరిగింది. 2014లో 159 చాప్టర్లు, 6,832 మంది మాత్రమే సభ్యులున్నారు. -
ఆ గ్రామం... ఓ కోచింగ్ సెంటర్
ఆ గ్రామం ఒకప్పుడు కట్టుబాట్లకు, బాల్యవివాహాలకు మారుపేరు... మూఢాచారాలు, ఛాందస భావాలకు ఆలవాలం... నాగరకత తెలియని వెనుకబాటుతనం... అలాంటి గ్రామం ప్రస్తుతం జీవనోపాధికి రాచబాటలు పరిచే ప్రదేశమైంది. ఎంతో కష్టపడితేనే కాని రాని ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించడం నల్లేరు మీద బండి నడకలా చేసింది. ఊళ్ళో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అన్నంతగా అందరినీ తీర్చిదిద్దిన తూర్పుగోదావరి జిల్లాలోని నాగులాపల్లి గ్రామ విజయంపై ఫోకస్... సరిగ్గా పందొమ్మిదేళ్ల క్రితం చాలా చిత్రంగా ఈ కథ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామంలో 1995లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు అబ్బిరెడ్డి సత్తిరెడ్డి. ఆ మాస్టారి అకుంఠితదీక్ష, పట్టుదల కారణంగా ఆ గ్రామం ఉద్యోగాలకు మారు పేరుగా నిలిచింది. నాడు ఒక మనిషి నాటిన చిన్న మొక్క నేడు వృక్షమై పండ్లు, పువ్వులతో అలరారుతోంది. ఒకప్పుడు... సత్తిరెడ్డి మాస్టారు చదువుకునే రోజుల్లో పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి వారి ఇంట్లో చదువుకున్నవారు ఎవ్వరూ లేరు. అందువల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరీ చదువు పూర్తి చేశారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తే పదిమందికీ విద్య నేర్పి, నిరక్షరాస్యతను రూపుమాపేలా కృషి చేయవచ్చనుకున్నారు. అనుకున్నట్లుగానే ఉపాధ్యాయుడయ్యారు. ఆ తర్వాత వివిధ పాఠశాలల్లో పనిచేసి, 2002లో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగవిరమణ చేశారు. అయినప్పటికీ విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేసి, పలువురు విద్యార్థులు ఉద్యోగస్థులుగా ఎదగడానికి తోడ్పడ్డారు. యువతకు చేయూత... ఈ రోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాములా మారింది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తే కాని ఉద్యోగాలు చేజిక్కించుకోవడం కష్టం. అందుకే విద్యార్థులకు విద్యతో పాటు, పోటీపరీక్షలలో ఎలా విజయం సాధించాలో నేర్పించారు సత్తిరెడ్డి మాస్టారు. కార్పొరేట్ శిక్షణ తీసుకుంటే తప్ప పోటీపరీక్షలను ఎదుర్కోలేమనే పరిస్థితులను విద్యార్థుల మదిలో నుంచి తప్పించారు. కొందరు విద్యార్థులను కూడగట్టి, వారికి శిక్షణనిచ్చి, పోటీపరీక్షలకు పంపించారు. ఆశ్చర్యకరంగా ఆ విద్యార్థులంతా విజయం సాధించారు. దాంతో ఉద్యోగాలు సంపాదించిన ఆ విద్యార్థులంతా ఇంటింటికీ వెళ్లి ఉద్యోగస్థులందరినీ ఉత్తేజితుల్ని చేసి, ఆ గ్రామం నుంచి పోటీపరీక్షలకు వెళ్లే విద్యార్థులకు శిక్షకులుగా మారారు. ఎటువంటి ఫలితం ఆశించకుండా చేసిన కృషి సత్ఫలితాలనివ్వడంతో ఆ గ్రామానికి చెందిన 15 మంది పూర్వ విద్యార్థులతో 2002లో నాగులాపల్లి ఎంపాయీస్ వెల్ఫేర్ సొసైటీ (ఎన్ఈడబ్లూఎస్ - న్యూస్) ప్రారంభమైంది. అది దినదిన ప్రవర్థమానమవుతూ, ప్రస్తుతం ఆ సంఖ్య 125కి పెరిగింది. వీరిలో అధికశాతం మంది ఉపాధ్యాయులే. ప్రతిఫలాపేక్ష లేకుండా పోటీపరీక్షలకు తర్ఫీదునిస్తూ... కృషితో నాస్తి దుర్భిక్షమని నిరూపించారు. సంఘం విధివిధానాలు... ఆ సంఘంలో సభ్యులంతా ప్రతినెలా సమావేశం ఏర్పాటుచేసుకుని, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకుంటారు. ఫీజు తీసుకోకుండా అన్ని పోటీపరీక్షలకు తర్ఫీదునివ్వడంతో పాటు అవసరమైతే పేదవిద్యార్థులకు పోటీపరీక్షల ఫీజులు కూడా తామే చెల్లిస్తారు. ఏ విధమైన రిజర్వేషన్ లేకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించడం నాగులాపల్లి యువతీయువకులకు ఆనవాయితీగా మారేలా చేసింది ఆ సంఘం. పేద, వికలాంగ విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనివ్వడం, గ్రామంలో పాఠశాలలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చడం, అక్షరాస్యతా కార్యక్రమాలు నిర్వహించడం, వేసవి సెలవుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి విద్యావంతులుగా తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆశయాలు... ప్రస్తుతం ఈ సంఘం 125 మందికి పైగా సభ్యులతో కొనసాగుతోంది. ‘‘నేను ఉద్యోగం సాధిస్తే, ఇక జీవితంలో స్థిరపడిపోయినట్లేననే స్వార్థ భావన లేకుండా, తోటివారికి సహాయం చేయకపోతే అది నన్ను అవమానించినట్లే’’ అని పలికిన ఆ మాస్టారి మాటలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు ఈ సంఘ సభ్యులు. విజ్ఞానాన్ని పదిమందికి పంచినపుడే మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందగలరని ఆయన చేసిన సూచనలు ఆ విద్యార్థులను మరింత స్ఫూర్తిదాయకంగా నిలబెడుతున్నాయి. సత్తిరెడ్డి మాస్టారు 2010 సంవత్సరంలో కాలం చేసినప్పటికీ ఆయన స్ఫూర్తితో ఆ సంఘ అభివృద్ధికి ఆయన శిష్యులు నేటికీ కృషి చేస్తూనే ఉన్నారు. - విఎస్విఎస్ వరప్రసాద్, న్యూస్‌లైన్, పిఠాపురం. విద్యార్థుల విజయం... నాగులాపల్లి ఎంపాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) కృషి ఫలితంగా ఆ గ్రామంలో 600 మందికి పైగా ప్రభుత్వోద్యోగులున్నారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఆర్. అమ్మిరెడ్డి, శ్రీకాకుళం ఉపాధి కల్పనాధికారి చింతపల్లి సుబ్బిరెడ్డి, అస్సాంలో మిలటరీలో కమాండర్‌గా ఉన్న విజయకుమార్లాంటి పలువురు నాగులాపల్లికి చెందినవారే. - వైవీవీ రామారెడ్డి, అధ్యక్షులు,నాగులాపల్లి ప్రోత్సాహమే ఉద్యోగస్థులుగా చేసింది... ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనుకున్న తరుణంలో పైసా ఖర్చు పెట్టనవసరం లేకుండా ‘న్యూస్’ సభ్యులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. 2008 డీఎస్సీలో ఉద్యోగం సాధించాను. నాగులాపల్లి పక్కనే ఉన్న తోటూరులో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. - కోటా హైమావతి, టీచర్, నాగులాపల్లి