‘‘కస్టమర్.. అంటే మీకు ప్రయాణికులు.. వారే దేవుళ్లు, జీతాలిచ్చే దేవుళ్లు’’
‘‘అప్పట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూసే వారు. ఇప్పుడు ప్రయాణికుల కోసం బస్సులు వేచి చూస్తున్నాయి.
మళ్లీ పాత పద్ధతి రావాలి.. బస్సుల కోసం ప్రయాణికులు పరుగున వచ్చేలా చేయాలి’’
‘‘టికెట్ ఇవ్వడంతో నా పని ముగిసిందన్న భావనను దరి చేరనీయొద్దు.
ప్రయాణికులకు ఆర్టీసీపరంగా ఇంకా ఏదైనా సమాచారం కావాలేమో గుర్తించి తెలియచెప్పాలి’’
..ఇవన్నీ బస్సుల్లో రాసి ఉండే సూక్తులు/ సూచనలు కాదు.. ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లకు నరనరాన జీర్ణింపజేసేందుకు సిద్ధం చేసిన మాటలు. ఈ మాటలు అధికారులు చెప్తే అంతతొందరగా ఎక్కవని, నిరంతరం ఖాతాదారులతో తలమునకలై ఉండే బ్యాంకు మేనేజర్లు, పాలసీదారులను వెతికి పట్టుకుని పాలసీలు చేయించే ఎల్‌ఐసీ మేనేజర్లతో చెప్పించబోతున్నారు. వెరసి కండక్టర్ తీరే మారేలా శిక్షణకు సిద్ధం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతుండటంతో డ్రైవర్లకు ఓ కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్లపై దృష్టి సారించింది. కొంతకాలంగా క్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోతోంది. దీంతో ఇటీవలి వరకు రోజుకు రూ.14 కోట్ల ఆదాయం ఉండగా, ఇప్పుడది రూ.11 కోట్లకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో.. బస్సులు మళ్లీ ప్రయాణికులతో కళకళలాడాలంటే వారిని ఆకట్టుకునేలా కండక్టర్ల ప్రవర్తన ఉండాలని ఆర్టీసీ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ఇందుకోసం వారికి కార్పొరేట్ తరహాలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. అది శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణాంశాలను రూపొందించిన ఆర్టీసీ, శిక్షణలో ప్రత్యేక తరగతులు తీసుకునేందుకు బ్యాంక్, ఎల్‌ఐసీ మేనేజర్లను గుర్తించింది. ఒక్కో అధికారికి ఒక్కో క్లాస్‌కు రూ.500 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది.
బ్యాంకు, ఎల్‌ఐసీ మేనేజర్లతో..
వీలైనన్ని సీట్లు నిండేలా చూడండి అంటూ ఇంతకాలం డిపో అధికారులు గేట్ మీటింగ్స్ పెట్టి కండక్టర్లకు చెప్పేవారు. ఈ క్రమంలోనే బస్టాపుల వద్ద కండక్టర్లు కిందకు దిగి ఊళ్లపేర్లు అరుస్తూ ప్రయాణికులు బస్సు ఎక్కేలా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ తరహా మోటివేషన్ సరిపోదని ఆర్టీసీ ఎండీ భావిస్తున్నారు. దీంతో కండక్టర్లకు కూడా కార్పొరేట్ తరహా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో.. డ్రైవింగ్ నైపుణ్యం పెంచడంలో మేలైన శిక్షణ ఇస్తుందన్న పేరున్న చోలమండలం రిస్క్ సర్వీసెస్ అన్న సంస్థతో డ్రైవర్లకు శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే.
సొంత శిక్షణ కాదని...
ఖాతాదారులు, వినియోగదారులను ఆకట్టుకోవాలంటే బ్యాంకులు, ఎల్‌ఐసీ సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, తొలుత అయిష్టత చూపిన వారిని కూడా తమవైపు ఎలా తిప్పుకోవాలి, ఇందుకు ఆయా సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులేంటి.. తదితర వివరాలను అన్వయిస్తూ ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవాలనే కోణంలో ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆయా డిపోల్లోనే నిత్యం 30 మంది కండక్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఓఆర్‌ను 75 శాతానికి చేర్చేందుకు చాలాకాలంగా ఆర్టీసీ యత్నించి విఫలమవుతోంది. దీంతో సొంత శిక్షణ బదులు కార్పొరేట్ స్టైల్‌ను అనుసరించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఏం చెబుతారంటే..
► మనల్ని ఎదుటివారు ‘సర్/ మేడమ్’ అని అంటే క్షణకాలంపాటు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. అందుకే ‘సర్/ మేడమ్’ అన్న పదంలో ప్రత్యేక మహత్తు ఉందంటారు మానసిక విశ్లేషకులు. ఇప్పుడు కండక్టర్లు కూడా ప్రయాణికులను సర్/మేడమ్ అంటూ సంబోధించాలని ఇందులో చెప్పనున్నారు.
►టికెట్ల జారీ పూర్తయ్యాక ప్రయాణికులకు ఆర్టీసీ పరిస్థితి వివరిస్తూ, బస్సులు ఎలా సురక్షితం, పెరిగిన ఇంధన ధరలతో వ్యక్తిగత వాహనాల వినియోగం జేబుకు భారం లాంటి విషయాలు చెప్పాలి. ఆరీ్టసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రయాణికులు, వారి సంబంధీకులకు అవగాహన కల్పించాలి.
►మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు.. ఇలాంటి వారి వద్ద ఎక్కువ లగేజీ ఉంటే.. ఎక్కేప్పుడు, దిగేప్పుడు సహకరించాలి.
► ప్రయాణికులు ఆర్టీసీకి సంబంధించి ఇతర వివరాలు అడిగినా, తదుపరి గమ్యానికి ఏ బస్కెక్కాలి, ఎక్కడ దిగాలి, బస్సు పాస్‌లు, ఒకరోజు పాస్ లాంటి వివరాలు చెప్పాలి. సమాచారం తెలియనప్పుడు ఎవరితో మాట్లాడితే తెలుస్తుందో వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలి. లేదా కనుక్కుని చెప్తానని ప్రయాణికుడి ఫోన్ నంబర్ తీసుకుని తర్వాత సమాచారమివ్వాలి.
► ఆ పూట డ్యూటీతో తన బాధ్యత ముగిసిందనే భావనలోంచి బయటికొచ్చి కండక్టర్ డ్యూటీ కూడా 24/7 అన్న భావనలోకి రావాలి.
Comments
Please login to add a commentAdd a comment