వ్యాపారులకు... అవకాశాల ‘నెట్వర్క్’
బీఎన్‌ఐ రిఫరెల్స్ వ్యాపారం రూ. 60,450 కోట్లు
♦ దేశంలో గతేడాది ఇది రూ.3,043 కోట్లు
♦ ప్రపంచవ్యాప్తంగా 1.9 లక్షల సభ్యులు
♦ ఇండియాలో ఈ సంఖ్య 9,800; హైదరాబాద్‌లో 10 చాప్టర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీధర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. చిన్నచిన్న అపార్ట్‌మెంట్లు కడుతున్నాడు. ఎప్పుడూ తన సొంత ప్రాజెక్టులకే పరిమితమవుతున్న శ్రీధర్... ఇతరుల భవనాలనూ నిర్మించాలనుకున్నాడు. కానీ ఇతరుల ప్రాజెక్టులెలా వస్తాయి? వాళ్లు శ్రీధర్‌ను నమ్మేదెలా? ఇవన్నీ ప్రశ్నలే. ఇంతలో శ్రీధర్‌కు ‘బీఎన్‌ఐ’ గురించి చెప్పాడు అతని స్నేహితుడు రామ్‌కుమార్. బీఎన్‌ఐ అంటే... బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్. దాని సభ్యులంతా ఏదో ఒక రంగంలో వ్యాపారం చేస్తున్నవారే. సరే! చూద్దామనుకుని బీఎన్‌ఐ హైదరాబాద్ చాప్టర్లో సభ్యత్వం తీసుకున్నాడు.
ఒకరోజు బీఎన్‌ఐ సమావేశానికి హాజరైన శ్రీధర్... తన కొత్త ప్రాజెక్టుకు సిమెంటు, స్టీల్ సరఫరా చేసే కాంట్రాక్టును తన చాప్టర్లోనే ఉన్న రాజీవ్‌కు అప్పగించాడు. రెండు సమావేశాలు గడిచాయో లేదో!! వేరొకచోట భవనం నిర్మించే పనిని శ్రీధర్‌కు అప్పగించాడు రాజీవ్. ఇలా ఒకరికొకరు ‘రిఫర్’ చేసుకోవటం వల్ల శ్రీధర్‌కు తేలిగ్గానే కాంట్రాక్టులు దక్కాయి. ఇదంతా చూశాక బీఎన్‌ఐ ఏంటి? ఎవరు చేరొచ్చు? ఎలా చేరాలి? వంటి సందేహాలన్నీ వస్తున్నాయా? మీకోసమే ఈ కథనం...
వ్యాపారవేత్తలంతా ఒక బృందంగా ఏర్పడి... తరచు సమావేశమవుతూ తమలో తాము వ్యాపార అవకాశాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే ఈ బీఎన్‌ఐ. గతేడాది ఇలా బీఎన్‌ఐ సభ్యుల మధ్య రిఫరల్ ద్వారా జరిగిన వ్యాపారమెంతో తెలుసా? అక్షరాలా అరవైవేల నాలుగువందల యాభై కోట్ల రూపాయలు. ఇతరత్రా వ్యాపార సంఘాలకు భిన్నంగా 1.90 లక్షల మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తున్న ఈ గ్రూప్... ప్రధానంగా పనిచేసేది ‘ఇవ్వటం- పుచ్చుకోవటం’ అనే సూత్రంపైనే. అయితే బీఎన్‌ఐలో సభ్యులందరూ ఒకే చాప్టర్‌గా ఉండరు.
విభిన్న వ్యాపారాల్లో ఉన్నవారంతా ఒక చాప్టర్‌గా ఏర్పడతారు. ఈ చాప్టర్లో ఒక రంగం నుంచి ఒకరు మాత్రమే సభ్యులుగా ఉంటారు. అదే రంగానికి చెందిన వారెవరైనా కొత్త సభ్యత్వం కోసం వస్తే... వారికి వేరొక చాప్టర్‌లో అవకాశం ఇస్తారు. అయితే సభ్యులెవరైనా వరసగా మూడు సమావేశాలకు హాజరు కాకపోతే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. అంతేకాదు! బీఎన్‌ఐ తన సభ్యులకు నిరంతరం శిక్షణ కూడా ఇస్తుంది. ఇతర నగరాల్లోని చాప్టర్లతో సమావేశాల్ని ఏర్పాటు చేస్తుంది. సభ్యత్వం కావాలంటే వార్షిక, నెలవారీ రుసుము చెల్లించాలి. బీఎన్‌ఐ ద్వారా అంతర్జాతీయ అవకాశాలకు తోడు సభ్యుల మధ్య వ్యాపారానికి కూడా ఆస్కారం ఉందని బీఎన్‌ఐ మెంబర్, టోటెమ్ పీఆర్ ఈడీ శ్రీనివాసులు చెప్పారు.
ఇవిగో... కొన్ని ఉదాహరణలు
♦ తెలుగు రాష్ట్రాల్లో బీఎన్‌ఐ ఒకింత బలంగానే ఉంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 10 చాప్టర్ల వరకూ నడుస్తున్నాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే...
♦ కార్పొరేట్ శిక్షణతో పాటు సాఫ్ట్‌స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ శిక్షణ అందించే శ్రుతి మశ్రూ... హైదరాబాద్‌లో ‘ఎల్డిన్’ సంస్థను ఆరంభించారు. బీఎన్‌ఐలో చేరాక ఆమె దుబాయి, నైజీరియాల్లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకున్నారు.
♦ కార్ రెంటల్ రంగంలో ఉన్న సభ్యుడికి నగరంలోనే ఉన్న మరో సభ్యుడు రూ.3 లక్షల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు.
♦ మీడియా, పబ్లిషింగ్ రంగాల్లో పెన్సార్ క్రియేషన్స్‌ను ఆరంభించిన ప్రియాంక సూర్యనేని... బెంగళూరు చాప్టర్ సమావేశంలో కొత్త అవకాశాలను అందుకున్నారు.
♦ మైండ్ స్క్రిప్ట్ ఫౌండర్ నేహ నాగ్‌పాల్... బీఎన్‌ఐ సాయంతో ఇతర నగరాల్లోనూ విస్తరించారు.
భారత్ నుంచి రూ.3,043 కోట్లు..
బీఎన్‌ఐలో ప్రపంచవ్యాప్తంగా 2014లో 1.80 లక్షల మంది సభ్యుల మధ్య 66 లక్షల రెఫరల్స్ జరిగాయి. తద్వారా జరిగిన వ్యాపారం విలువ సుమారు రూ.53,320 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం 7,300 చాప్టర్లు, 1.90 లక్షల మంది సభ్యులున్నారు. 2015లో 77 లక్షల రెఫరల్స్ ద్వారా సుమారు రూ.60,450 కోట్ల వ్యాపారం నమోదైంది. ఇక భారత్‌లో 222 చాప్టర్లకుగాను 9,800కుపైగా సభ్యులున్నారు. 2015లో 5.67 లక్షల రెఫరల్స్ నమోదయ్యాయి. వీటి ద్వారా రూ.3,043 కోట్ల వ్యాపారం జరిగింది. 2014లో 159 చాప్టర్లు, 6,832 మంది మాత్రమే సభ్యులున్నారు.