కార్పొరేషన్లో బెట్టింగులు
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రి నగరపాలక సంస్థ ఫలితాలపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పోటీచేసిన అభ్యర్థుల కన్నా పందెం రాయుళ్లు గెలుపు ఓటములపై తెగ టెన్షన్ పడిపోతున్నారు. అభ్యర్థులపై గరిష్టంగా ఐదు లక్షలు, మేయర్‌పై రూ. పది లక్షలకు పైగా బెట్టింగులు కడుతూ నగరంలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు పందెగాళ్లు.
ఆ ఇద్దరిపైనే దృష్టి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను జనంతోబాటు పందెం రాయుళ్లు పూర్తిగా పక్కకు పెట్టేశారు. పోటీ కేవలం టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మధ్యనే ఉంది. దీంతో ఈ రెండు పార్టీలపై భారీగా పందేలు సాగుతున్నాయి. ఇటీవల మీడియాలో, పత్రికల్లో వచ్చిన సర్వేలకు తమ విజ్ఞతను జోడించి పందాలు కడుతున్నారు. వీరిలో వ్యాపారులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారు. జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీలతో పోలిస్తే రాజమండ్రి కార్పొరేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు టీడీపీ గట్టి పోటీ ఇస్తున్నదని సర్వేలు చెబుతుండడంతో ఇరువ ర్గాలపై పందాలు జోరుగా సాగుతున్నాయి. ప్రచారం తొలిరోజుల్లో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు హడావుడి చేశారు. కానీ పోలింగ్ నాటికి వారిది అసత్య ప్రచారమని తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించాక టీడీపీ పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లు డివిజన్ల వారీగా అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని పందాలు కడుతున్నారు. డివిజన్లలో కార్పొరేటర్లపై రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకూ పందెం కడుతున్నారు. ఇక మేయర్ అభ్యర్థిపై రూ. 25,000 నుంచి రూ. పది లక్షల వరకూ బెట్టింగ్‌లు కడుతున్నారు.
రూ. కోట్లకు చేరుతున్న పందాలు
డివిజన్ల స్థాయిలో పార్టీ నేతలు ఎక్కువగా 25,000 నుంచి 50,000 మధ్యలో పందాలు కడుతున్నారు. 50 డివిజన్లలో ఈ పందాల విలువ రూ. కోట్లకు చేరిందని అంచనా. పందాలు కూడా రూ. లక్షకు లక్ష అన్న చందంగా సాగుతున్నాయి. కానీ ఒక వంతుకు రెండు వంతులు అన్న చందంగా పందాలు కాసేందుకు మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదని తన డివిజన్లో మేయర్ అభ్యర్థిపై పందెం కట్టిన ఓ నేత పేర్కొన్నారు.
కౌంటింగ్ కోసం ఎదురుచూపులు
ఈ నెల రెండున జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో తొమ్మిదో తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా తొమ్మిదిన కౌంటింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. కాగా తుది తీర్పును మాత్రం సోమవారం ఇవ్వనుంది. దీంతో పందెం రాయుళ్లు అభ్యర్థుల కన్నా ఆసక్తిగా తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. వాయిదా పడితే పందెం కిక్కు ఉండదని అంటున్నారు.