విజయనగరానికి కార్పొరేషన్ హోదా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరానికి కార్పొరేషన్ హోదా రానుంది. జిల్లా కేంద్ర మున్సిపాల్టీల్ని కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంతో విజయనగరం మున్సిపాల్టీ స్థాయి పెరగనుంది. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కానుండడంతో పట్టణీకరణకు అవకాశం ఉంటుంది. అలాగే నిధులు భారీగా రానున్నాయి. పన్నులు పెరగనున్నాయి. కమిషనర్‌కు అధికారాలు కూడా పెరుగుతాయి. పోస్టులు ఎక్కువ కానున్నాయి. నిబంధనల మేరకైతే విజయనగరం మున్సిపాల్టీ ఎప్పుడో కార్పొరేషన్ కావల్సి ఉంది. అందుకు కావల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. రెండు లక్షల జనాభా, రూ.10 కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ లెక్కన చూస్తే విజయనగరం మున్సిపాల్టీలో ప్రస్తుతం 2.5 లక్షల జనాభా ఉండటమే కాకుండా, వార్షిక రూ.20కోట్ల ఆదాయం వస్తోంది. కాకపోతే విజయనగరాన్ని కార్పొరేషన్ చేసే దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఇంతకన్నా తక్కువ జనాభా ఉన్న ఏలూరు, ఒంగోలు, కడప, చిత్తూరు మున్సిపాల్టీలు ఎప్పుడో కార్పొరేషన్ హోదా సాధించాయి. వాటి సరసన ఇప్పుడు విజయనగరం చేరనుంది.
మార్పులు ఇవి....
మున్సిపాల్టీలతో పోల్చితే కార్పొరేషన్ అయిన తరువాత రాష్ట్రం నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరగనున్నాయి. అందుకు తగ్గట్టుగానే పన్నులు కూ డా పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ హోదా వస్తే పోస్టులు భారీగా పెరుగుతాయి. కమిషనర్ కు ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. ప్రస్తుతం రూ.2వేలు దాటిన ఏ పనికైనా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. అదే కార్పొరేషన్ అయితే రూ.5లక్షల వరకు కమిషనర్ నిర్ణయం తీసుకోవచ్చు. పనుల మంజూరు, టెండర్ల విషయంలో కమిషనర్‌కు విచక్షనాధికారం ఉంటుంది. అలా గే, స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. దీని ద్వారా రూ. 50 లక్షల వరకు కమిటీయే పనులు చేపట్టవచ్చు. చైర్మన్‌తో పనిలేకుండా కమిటీయే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇక, కార్పొరేషన్ హోదా వచ్చినట్టయి తే పట్టణంలోని ఆక్రమణలు, అనధికార కట్టడాల్ని తొలగిం చేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండవు. సెక్షన్ 636 ఆ అధికారాన్ని కార్పొరేషన్ కలిగించింది. అంటే, కార్పొరేషన్లో ఏ నిర్ణయమైనా త్వరితగతిన తీసుకునే అవకాశం ఉంటుంది.