‘పసుపు’ స్మగ్లర్లకు పోలీసు కవచం
ఎఫ్ఐఆర్ నమోదై కళ్ల ఎదుటే తిరుగుతున్నా అరెస్టు చేయని వైనం
భాకరాపేట పీఎస్ పరిధిలో 13న 19మంది ‘ఎర్ర దొంగల’పై ఎఫ్ఐఆర్
వారిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శితో పాటు పలువురు నేతలు
3 కేసులుంటే పీడీ యాక్టు...
9 కేసులున్న బుల్లెట్ సురేష్‌కు మాత్రం మినహాయింపు!
ఒక్క ఎర్రచందనం కేసు కూడా నమోదుకాని వ్యక్తిపై పీడీ యాక్టు పెట్టారు. సాధారణంగా మూడు కేసులు ఉంటే పీడీ యూక్టు పెట్టాలి. 9 కేసులున్న బుల్లెట్ సురేష్‌పై మాత్రం పీడీ యాక్టు పెట్టరు. ఎందుకంటే ఈయన ‘పచ్చ’ చొక్కా వేసుకున్న నేత కాబట్టి. ఈయనే కాదు ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాలో నమోదైన వారిలో చాలామంది దొంగలు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు మాత్రం అరెస్టు చేయలేదు. వీరిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధు ఉన్నా పోలీసులు మాత్రం వారివైపు కన్నెత్తి చూడడం లేదు. ఎందుకంటే వీరికి సాక్షాత్తు ‘సర్కారు పెద్దల’ ఆశీస్సులు ఉండడమే.
సాక్షి, చిత్తూరు: సరిగ్గా నెలరోజుల కిందట ఎర్రచందనం స్మగ్లర్లపై తాడోపేడో తేల్చుకోవాలని ఇటు ప్రభుత్వం, అటు ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించుకున్నారుు. అనుకున్నదే తడవుగా ఆగమేఘాలపై దొంగల జాబితాను సిద్ధం చేశారు. చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక పరిధిలో 196 మంది దొంగలు ఉన్నట్లు లెక్క తేల్చారు.
మొదట్లో వీరి అరెస్టుపై కూడా దూకుడు ప్రదర్శించారు. వారం రోజుల్లో 8మందిని అరెస్టు చేశారు. దీంతో ‘ఎర్ర’ దొంగల వెన్నులో వణుకు పుట్టింది. పోలీసుల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే నెలరోజుల్లోనే సీన్ మారి పోయింది. దొంగల అరెస్టు ప్రక్రియ మందగించింది. దీనికి కారణమేంటని పోలీసులను ప్రశ్ని స్తే నెల రోజుల కిందటికి, ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదైన వారిని కూడా అరెస్టు చేయలేదు :
పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందనేందుకు మచ్చుకు ఉదాహరణగా భాకరాపేట పోలీసులపై వస్తున్న ఒత్తిళ్లేనని అర్థమవుతోంది. ఈ నెల 13న ఇక్కడ 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీ సులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై 147,148 ,353,341,307,ఆర్/డబ్ల్యూ149ఐపీసీ, 379ఐపీసీతో పాటు ఎర్రచందనం అక్రమ నివారణ చట్టం-1989 ప్రకారం పలు సెక్షన్లు పెట్టారు.
వీరిలో టీడీపీ జిల్లా ప్రచార కార్యద ర్శి వసంత్‌కుమార్‌తో పాటు మధు అనే మరో నేత ఉన్నారు. వీరి కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుల్లెట్ సురేష్‌పై 2011లో భాకరాపేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబరు 32-2011పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ 19మంది దొంగల జాబితాలో ఈయన పేరు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణమని తెలుస్తోంది.
పీడీ యాక్టు అమలులోనూ చేతివాటమే:
ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్ అనే పేరుతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇప్పటి వరకూ అతనిపై ఒక్క ఎర్రచందనం కేసు కూడా లేదు. అయినప్పటికీ ఆయనపై పీడీయాక్టు నమోదు చేశారు. అయితే చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్‌పై 9 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ ఇతని వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణం సీఎం చంద్రబాబు, అటవీ మంత్రి బొజ్జల ఆశీస్సులు ఉండటమే! అధికార బలంతో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ‘ఎర్రచందనం’ దొంగలు ఏ స్థాయిలో రెచ్చిపోతారో ఇట్టే తెలుస్తుంది.
బుల్లెట్ సురేష్ ‘ఎర్ర’ నేరానికి సాక్ష్యాలు ఇవిగో:
బుల్లెట్ సురేష్‌పై జిల్లాలోని పలు స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 9 కేసులు ఉంటే అందులో ఒకటి అక్రమ ఆయుధాల కేసు.