పాదేశికాలకు రేపటి నుంచి నామినేషన్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నామినేషన్ల స్వీకరణకు జెడ్పీ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో 19.56 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలు, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జర గనున్నాయి.
జిల్లాలో ఓటర్లు 19,56,304 మంది ఉండగా వీరిలో మహిళలు 9,78,920 మంది, పురుషులు 9,77,384 మంది ఉన్నారు. 790 ఎంపీటీసీ స్థానాల్లో 384 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. 56 ఎంపీపీ స్థానాలకుగాను 27 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. 56 జెడ్పీటీసీ స్థానాల్లో 28 స్థానాలు మహిళలకు కేటాయించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీపరంగా జరుగుతుండడంతో గ్రామస్థాయిలో ఎన్నికల వేడి పుంజుకుంది. దీంతో నామినేషన్ల కోసం పార్టీ నాయకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 20వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేందుకుగాను అన్ని మండల కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు.
జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగాను, మరో ఏడుగురు జిల్లా స్థాయి అధికారులను అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకుగాను జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కౌంటర్లో పది మండలాల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు.
నామినేషన్ల పరిశీలన ఈనెల 21న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
ఈనెల 22న తిరస్కరించిన నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాలను ఆర్డీవోలకు దాఖలు చేసుకోవచ్చు. వాటిపై తుది నిర్ణయాన్ని 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారులు ప్రకటిస్తారు. 24వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలి. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 2587 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. కౌంటింగ్ 8వ తేదీ చేపట్టి పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తారు.