ఎన్నికల ర్యాలీ ఎన్నాళ్లో నిలవదు
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా దేశీయ ఫండమెంటల్స్ ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలని, ఇప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుందని చెప్పలేమంటున్నారు యూటీఐ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ లలిత్ నంబియార్. అధిక విలువలో ఉన్నప్పటికీ రెండేళ్ల దృష్టిలో ఫార్మా, ఐటీ రంగాలనే ఇష్టపడతానంటున్న నంబియార్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
గతంలో 2004, 2009 ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్లు అప్పటి వరకు ఉన్న ట్రెండ్‌ను మార్చుకున్నాయి. ఈ సారి కూడా అది పునరావృతం అవుతుందని అంచనా వేస్తున్నారా?
ఎన్నికల ఫలితాల ఆథారంగా ట్రేడింగ్ అనేది పూర్తిగా స్పెక్యులేటివ్. దీనికి మేము దూరంగా ఉంటాం. గత ఫలితాల తర్వాత మార్కెట్ కదలికలను పరిశీలిస్తే.. ట్రెండ్ మార్పు అనేది స్వల్పకాలానికే పరిమితం అయ్యింది. ఆ తర్వాత మార్కెట్ ఫండమెంటల్స్‌కు అనుగుణంగానే సూచీలు నడిచాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై చాలామంది ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు. కానీ గతంలో ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలకు భిన్నంగా ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. ఆ ఫలితాలతో మార్కెట్లు ఆశ్చర్యకరంగా స్పందించినా దీర్ఘకాలంలో నిలబడలేకపోయాయి. ఇప్పుడు కూడా మేము ఎన్నికల ఫలితాలపై కాకుండా మార్కెట్ ఫండమెంటల్స్‌నే నమ్ముకుంటాం.
మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లేదా యూపీఏ తిరిగి అధికారం నిలబెట్టుకుంటే మార్కెట్లు ఏ విధంగా స్పందిస్తాయి? ఒకవేళ ఫలితాల్లో ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాకపోతే ఎలా కదులుతాయి?
ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉంటాయన్న స్పష్టమైన నమ్మకంతో ప్రస్తుతం మార్కెట్లు కదులుతున్నాయి. ఇది పటిష్టమైన, నిర్ణయాలు తీసుకునే సమర్థవంతమైన పార్టీ అధికారంలోకి వస్తోందన్న విషయాన్ని సూచిస్తోందని చెప్పొచ్చు. కానీ ఇది ఏవిధంగా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికకు ఉపయోగపడదు. అత్యధికశాతం మంది ఊహించిన విధంగా ఫలితాలు ఉంటే మార్కెట్లు పాజిటివ్‌గా లేకపోతే నెగటివ్‌గా స్పందిస్తాయి.
సూచీలు నూతన గరిష్ట స్థాయిల్లో కదులుతున్నా, వాస్తవికంగా దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే అనేక రంగాలు ఇంకా కనిష్ట స్థాయిల్లోనే కదులుతున్నాయి? వీటి పతనం అయిపోయిందని భావించవచ్చా లేక ఇంకా నష్టభయం ఉందంటారా?
ఇప్పటికీ దేశీయ స్థూల ఆర్థిక మూలాలు పూర్తిస్థాయిలో కనిష్ట స్థాయికి చేరలేదు. ఇప్పటికీ ఈ రంగాల్లో నష్టభయం ఉంది.
రానున్న సంవత్సరకాలంలో దేశీయ మార్కెట్లు ఎదుర్కొనే ప్రధాన రిస్క్‌లు ఏంటి? అవి దేశీయంగా, లేక బయట దేశాల నుంచా?
మొన్న ఉత్తర భారతదేశంలో కురిసిన అకాల వర్షాలు, పశ్చిమ భారతంలో కురిసిన వడగండ్లు శీతాకాలపు పంటలపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీనికితోడు ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు సరిగా ఉండకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. ఇవన్నీ అంతర్గతంగా ఉన్న భయాలు. ఇక బయటి దేశాల నుంచి అయితే... క్రిమియా - రష్యా ఉదంతం తర్వాత యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకరకమైన భయం ఆవహించి ఉంది. ఇంధనం అత్యధికంగా సరఫరా చేసే రష్యా ఈ ఉదంతంలో ఉండటమే కారణం.
వచ్చే సంవత్సర కాలంలో దేశీయ సూచీలు ఏ శ్రేణిలో కదులుతాయి? ఎటువంటి రాబడులను అంచనా వేస్తున్నారు?
రానున్న కాలంలో అనేక పరిణామాలు చేటుచేసుకోనున్న నేపథ్యంలో స్వల్పకాలానికి (ఒక సంవత్సరానికి) అంచనాలు వేయడం కష్టం. ఒకవేళ చెప్పాలని ఒత్తిడి చేస్తే రానున్న ఏడాది కాలంలో సూచీలు మరో 10 శాతం రాబడిని, అదే రెండేళ్లలో అయితే ఏడాదికి సగటున 15 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అది కూడా బయట దేశాల నుంచి అనుకోని ప్రతికూల సంఘటనలు జరగకుండా ఉంటే.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏ రంగాలను ఇష్టపడుతున్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు?
రెండేళ్ల కాలానికి ఐటీ, ఫార్మా రంగాలను ఇప్పటికీ ఇష్టపడుతున్నాం. అదే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో ఎంపిక చేసిన షేర్లను కొంటున్నాం. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం భారీగా అప్పులను కలిగి ఉండటంతో ఈ రంగానికి దూరంగా ఉంటున్నాం. ఒకవేళ ఎవరైనా అధిక రాబడిని ఆశిస్తూ బాగా రిస్క్ చేయగలిగితే ఈ రంగంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
బాగా పెరిగినప్పటికీ డాలర్ల రూపంలో చూస్తే ఎఫ్ఐఐలకి దేశీయ మార్కెట్లు నష్టాలనే అందించాయి. అయినా ఎఫ్ఐఐలు దేశీయ మార్కెట్లోకి భారీగా ఇన్వెస్ట్ చేస్తుంటే, లాభాలు అందుకుంటున్న దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం అమ్ముతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఎఫ్ఐఐలు అనగానే ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఒక్కరే కాదు. వివిధ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలతో మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ వంటి అనేక వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఇండియాకి వస్తున్న ఎఫ్ఐఐల నిధులతోటి మన మార్కెట్లపై అంతర్జాతీయ దృష్టి ఈ విధంగా ఉందని చెప్పలేం. కానీ ఇప్పుడు ఎఫ్ఐఐలు చైనా మార్కెట్ నుంచి వైదొలగి ఇండియా వంటి వర్ధమాన దేశాలకు పెట్టుబడులు మారుస్తుండటమే ఇటీవలి నిధుల ప్రవాహానికి కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో డీఐఐల అమ్మకాలకు బీమా కంపెనీలు కారణమని చెప్పొచ్చు. యులిప్స్ నుంచి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ వంటి వాటిల్లోకి మారుతుండటంతో బీమా కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
రానున్న ఏడాది కాలంలో బంగారం ధరలు ఏ విధంగా ఉం డొచ్చు? డాలరు -రూపాయి కదలికలపై మీ అంచనాలు ఏమిటి?
స్వల్పకాలానికి డాలరు విలువ రూ.58 వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. కానీ దీర్ఘకాలానికి చూస్తే రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉండటంతో ఆ మేరకు దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్నాం. అదే అంతర్జాతీయంగా చూస్తే అమెరికా నిధుల ప్రవాహాన్ని తగ్గిస్తున్నా, ఇదే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలు ముఖ్యంగా జపాన్, యూరప్‌లు వ్యవస్థలోకి నిధులు పంపిణీ చేస్తున్నా.. బంగారం ధరలు ఇంతకంటే మరింత కిందకు దిగజారే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రూపాయి విలువ విషయానికి వస్తే... వచ్చే 12 నెలల కాలానికి డాలరుతో రూపాయి మారకం రూ. 58కి మించి బలపడదని, అలాగే రూ.63.5 మించి క్షీణించదని భావిస్తున్నాం.