‘రక్షణ’లో ఎఫ్డీఐలు తెలివైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్నది చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వావలంబన సాధించడంతోపాటు దేశీయ తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్రమోడీ సంకల్పానికి ఈ నిర్ణయం సాయమందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో సంస్థ రజతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి.
ఏడాదిపాటు జరిగిన ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంపై ఎలాంటి అపోహలూ అవసరం లేదని పునరుద్ఘాటించారు. రానున్న పదేళ్లలో రక్షణ రంగ దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాని మోడీ ‘స్వచ్ఛ భారత్’ ఆకాంక్షను సాకారం చేసేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన బయోటాయిలెట్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.