couriers
-
స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం కోరుట్లలో ఉండే జీశాన్, తౌఫిక్, తన్వీర్లతో పరిచయమైంది. ‘దుబాయ్ నుంచి ఓ పార్శిల్ తీసుకురావాలి, విమానం, వీసా ఖర్చులన్నీ మేమే చూసుకుంటం. పార్శిల్ తీసుకొచ్చినందుకు రూ.40 వేలు ఇస్తం’ అన్నారు. డబ్బుల ఆశతో సర్ఫరాజ్ 2018 ఏప్రిల్ 13న దుబాయ్ వెళ్లి, 15న అక్కడ ఓ మనిషిని కలిశాడు. ఆయన ఇచ్చిన పార్శిల్ తీసుకుని నేపాల్ మీదుగా వస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ పార్శిల్లో అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం ఉండటంతో స్వాధీనం చేసుకుని సర్ఫరాజ్‌పై కేసు పెట్టా రు. ఆ పార్శిల్లో ఏముందో తెలియని సర్ఫరాజ్ మూడేళ్లుగా నేపాల్ జైల్లో మగ్గుతున్నాడు. సర్ఫరాజ్ అరెస్టు కాగానే జీశాన్, తౌఫిక్, తన్వీర్‌లు పరారయ్యారు. అన్యాయంగా ఇరుక్కుని జైల్లో మగ్గుతున్న తన భర్తను ఎలాగైనా విడిపించాలని సర్ఫరాజ్ భార్య అఫ్రిన్ బేగం మంత్రి కేటీఆర్‌ను వేడుకుంటోంది. ఒక్క సర్ఫరాజ్ మాత్రమేకాదు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఒకరు, కోరుట్లలో ఒకరు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరొకరు బంగారం స్మగ్లింగ్ ముఠా కారణంగా నేపాల్ జైల్లో మగ్గుతున్నారు. ఈ ముఠాలు వేల రూపాయలు ఎరగా వేస్తూ వీరిని ఉచ్చులోకి దించుతున్నాయి. కొందరు ఎయిర్‌పోర్టులో అధికారుల కళ్లుగప్పి బయట పడుతుండగా, మరికొందరు కస్టమ్స్‌కు చిక్కి జైలుపాలవుతున్నారు. కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్‌కు చెందిన కొందరు ముంబై, దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్ ఎయిర్‌పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు. కిలోకు రూ.5 లక్షలు తేడా.. మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇద్దరు మావో కొరియర్ల అరెస్టు
చర్ల(ఖమ్మం జిల్లా): మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ వైరు బండిళ్లను తరలిస్తున్న ఇద్దరు కొరియర్లను చర్ల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. చర్ల ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చర్లలో గాంధీ సెంటర్ సమీపంలోఅనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులకి తీసుకున్నారు. విచారణలో ఒకరిది చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్జిల్లా కారేపల్లికి చెందిన మడివి కోసా అని, మరొకరిది అదే జిల్లాలోని చండ్రంబోరు గ్రామానికి చెందిన మడకం కములు అలియాస్ మహేష్‌గా వెల్లడించారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు వైర్ బండిళ్లు లభ్యమైనట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు నేతలు హరిభూషన్, దామోదర్, ఆజాద్ ఆదేశాల మేరకు రూ.40 వేలతో మహబూబాబాద్‌లోని మోహన్ అనే ఎలక్ట్రికల్ షాపు యజమాని వద్ద నుంచి 3 వేల మీటర్ల పొడవు గల 8 వైరు బండిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. వీరిద్దరు పామేడు లోకల్ ఆర్గనేజేషన్ స్వా్కడ్ కమాండర్ కమలక్క నేతృత్వంలో పని చేస్తున్నట్లు వెల్లడించారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపారు. -
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
మందుపాతరలు, తుపాకులలో వాడే సామగ్రిని మావోయిస్టులకు చేరవేస్తున్న కొరియర్‌ను భద్రాచలం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయా న్ని భద్రాచలం ఏఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి శనివారం భద్రాచలం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 2న పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో కలిసి స్థానిక అంబేద్కర్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు మూటలతో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. అతని వద్దనున్న మూటలను పోలీసులు విప్పి చూశారు. అందులో- డ్రిల్ బిట్స్, రేంచీలు, టేపులు, సుత్తులు తదితర సామగ్రి కనిపిం చాయి. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు కారం వెంకటేశ్వర్లు. కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ శబరి దళం కార్యదర్శి నరేష్ గన్‌మెన్ కోటీ, నందాకు అప్పగించేందుకు ఈ సామగ్రి తీసుకెళ్తున్నట్టుగా అత డు చెప్పాడు. మందు పాతర లు, రాకెట్ లాంచర్లు, తుపాకుల తయారీకి ఈ సామగ్రి ఉపయోగిస్తారని ఏఎస్పీ చెప్పారు. ఈ సామగ్రి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.పోలీసుల పకడ్బందీ తనిఖీలతోనే కొరియర్‌ను, ఈ సామగ్రిని పట్టుకోగలిగినట్టు చెప్పారు. ఇతనిని పట్టుకున్న సీఐ శ్రీనివాసరెడ్డిని, పోలీసు సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.