పడగొట్టి.. పరిగెత్తి.. కాళ్లుపట్టి....!
బైక్ ఢీకొట్టడంతో కిందపడ్డ కానిస్టేబుల్ బైక్, వాహనంతో వెళ్లేందుకు యత్నిస్తున్న యువకుడు, వదిలేయమని వేడుకుంటున్న దృశ్యం
ఉదయం 10 గంటల సమయంలో ఆదాలత్ వైపు నుంచి నక్కగుట్ట వైపు ఓవర్ స్పీడ్‌గా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు జెడ్పీ ఎదుట డివైడర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ కోర్టు కానిస్టేబుల్‌ను బలంగా ఢీకోట్టాడు. దీంతో కానిస్టేబుల్ కింద పడ్డాడు. బైక్ కొంత ధ్వంసం అయింది. కాళ్లుచేతులకు దెబ్బలు తగిలాయి. ఇది గమనించిన యువకుడు బండితో అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు.
కానిస్టేబుల్ తేరుకుని యువకుని సెల్ ఫోన్, బైక్ కీస్ లాక్కోవడంతో కొంత దూరం పరిగెత్తి చేసేదిలేక మళ్లీ తిరిగొచ్చాడు. దీంతో అప్పటికే మంట మీదున్న కానిస్టేబుల్ యువకుడికి నాలుగు తగిలించాడు. తన వాహనం రిపేర్ చేయించమని, లేదంటే పోలీస్ స్టేషన్‌కు పదమని అన్నాడు. దీంతో యువకుడు చేసేదిలేక తప్పయింది వదిలేయమంటూ కాళ్లబేరానికి వచ్చాడు. తన వద్ద డబ్బులు కూడా లేవని ప్రాథేయపడ్డాడు. యువకుడి వేడుకోలు చూసి అంతా కానిస్టేబుల్‌కు సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. – హన్మకొండ అర్బన్