సహారాకు సుప్రీం చివరి చాన్స్
- బెయిల్ నిధుల సమీకరణకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టీకరణ
- ఆస్తుల విక్రయానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ యత్నాల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం చివరి అవకాశం ఇచ్చింది. విదేశాల్లోని గ్రూప్ ఆస్తుల విక్రయం, తద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదిత పార్టీలతో చర్చలకు ఇప్పటికి రెండు సార్లు అవకాశమిచ్చిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో ఇక చివరి వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది.
నిజానికి గ్రూప్ ఆస్తుల అమ్మకానికి ‘కోర్టు రిసీవర్’ను నియమిస్తామని శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీం తొలుత హెచ్చరించింది. సహారా నుంచి కొత్తగా వకాల్తా పుచ్చుకున్న కపిల్ సిబల్ విన్నపం మేరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ఆస్తుల అమ్మకం విషయంలో గ్రూప్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రతిపాదిత డీల్ పురోగతి అంశాలను వారం లోపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి, అలాగే ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానానికి సలహాలను అందిస్తున్న న్యాయవాదికి తెలియజేయాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
డీల్ ప్రతిపాదన తుది రూపునకు 2-3 నెలలే తీసుకోవాలని కూడా సూచించింది. ప్రతిపాదిత డీల్‌పై చర్చలకు తీహార్ జైలు పరిధిలో రాయ్‌కు కొన్ని ప్రత్యేక సదుపాయాలను పొడిగించాలన్న విన్నపాన్ని ఆమోదించడానికి కోర్టు నిరాకరించింది. అయితే కేవలం చర్చలకు (మార్చి 23 వరకు) మాత్రం ఇంతకుముందు 2 గంటల సమయాన్ని మరో 3 గంటలు పొడిగించింది.