గోవుల పాల, అందాల పోటీలు ప్రారంభం
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాల, అందాల పోటీలు ద్వారకా తిరుమలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 130 జాతి గోవులు, ముర్రాజాతి గేదెలు, దున్నలు తరలివచ్చాయి. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను పురస్కరించుకుని గురువారం ఉదయం 8 గంటలకు పాలపోటీల రిజిస్ట్రేషన్లు జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి పోటీలో పాల్గొనే గోవుల పొదుగులను ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం, అలాగే 17వ తేదీ ఉదయం మూడుపూటలా పాల ఉత్పత్తి సేకరణ జరగనుంది. దీని ఆధారంగా విజేతను ఎంపికచేస్తారు. 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందాల పోటీలకు రిజిస్ట్రేషన్ జరగనుండగా, మధ్యాహ్నం 12 గంటలు తరువాత అందాల పోటీలు ప్రారంభమవుతాయి. ఈ రెండు పోటీల్లో గెలుపొందిన విజేతలకు 17 సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇ¯Œæచార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరగనుంది. గురువారం నాటి ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌తో పాటు రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆల్డా చైర్మన్ గాంధీ, ఎంపీపీ వి.ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి తదితరులు పాల్గొన్నారు.
బహుమతుల ఇలా..
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ రూ.5 లక్షలు, పశుసంవర్ధకశాఖ రూ. 2 లక్షలతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామన్నారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నారు. అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆకట్టుకున్న ముర్రాజాతి దున్న
పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ముర్రాజాతి దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణాజిల్లా గన్నవరం రైతు ముక్కామల కోటేశ్వరరావుకు చెందిన ఈ దున్న 8 అడుగుల పొడవు, 5.3 అడుగుల ఎత్తుతో చూపరులను ఆకట్టుకుంది.