డెడ్‌బాడీ తరలింపు ఇక ఈజీ
డెడ్‌బాడీ తరలింపు ఇక ఈజీ
అందుబాటులోకి ‘ఫోరెన్సిక్ కార్ప్స్‌క్యారియర్’
ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టుమార్టం పరీక్షల కోసం
దేశంలో తొలిసారిగా నగర కమిషనరేట్‌లో ఏర్పాటు
ప్రారంభించిన సీపీ మహేందర్‌రెడ్డి
హిమాయత్‌నగర్: హత్య, ఆత్మహత్య, అనుమానాస్పద మృతి, రోడ్డు ప్రమాదం... ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు, గుర్తు తెలియని మృతదేహాలు లభించినప్పుడు డెడ్‌బాడీలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు సుముఖంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ పేరుతో రూపొందించిన వాహనాన్ని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశంలో మరే ఇతర కమిషనరేట్‌లోనూ ఇప్పటి వరకు ఈ తరహా వెహికిల్స్ అందుబాటులో లేవు.
ప్రాథమికంగా ఓ వాహనం ఏర్పాటు
నగర కమిషనరేట్ పరిధిలో మృతదేహాల తరలింపు కోసం సిద్ధం చేసిన ఒక ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ను సోమవారం ట్రాఫిక్ కమిషనరేట్ వద్ద అదనపు సీపీలు జితేంద్ర (ట్రాఫిక్), స్వాతిలక్రా (నేరాలు), వీవీ శ్రీనివాసరావు (శాంతిభద్రతలు), మురళీకృష్ణ (పరిపాలన)లతో కలిసి నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మృతదేహాల తరలింపు కోసం ఎస్హెచ్ఓలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వాహనం అందుబాటులోకి రావడంతో ఆ సమస్య తీరిందన్నారు. ఈ వాహనం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, డిమాండ్‌ను బట్టి వాహనాల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ వెహికల్లో డ్రైవర్‌తో పాటు శవాన్ని తరలించేందుకు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు.
కదిలించిన అనేక ఘటనలు...
చట్ట ప్రకారం మెడికో లీగల్ కేసులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదైన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. అలా చేయకుంటే అనేక చట్ట పరమైన ఇబ్బందులు రావడంతో పాటు కేసుల దర్యాప్తు సైతం సరైన దిశలో సాగదు. వీటన్నింటికీ మించి మృతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ తదితరాలు క్లైమ్ చేసుకోవాలంటే ఎఫ్ఐఆర్తో పాటు పోస్టుమార్టం పరీక్ష నివేదిక తప్పనిసరి. ఇలాంటి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు తరలించడానికి పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోపక్క గత కొన్ని రోజులుగా మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులు మోసుకెళ్లడం వంటివి మీడియాలో రావడం నగర పోలీసు విభాగాన్ని కదిలించాయి.