Crazy Fellow Movie
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు
‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్‌కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్. ∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ -
Crazy Fellow Review: ‘క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: క్రేజీ ఫెలో నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్, నర్నా శ్రీనివాస్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్ నిర్మాత: కే.కే. రాధామోహన్ దర్శకుడు: ఫణికృష్ణ సిరికి సంగీతం: ఆర్.ఆర్. ధృవన్ సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల ఎడిటర్: సత్య గిడుతూరి విడుదల తేది: అక్టోబర్ 14, 2022 యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటీవలె ‘తీస్మార్ ఖాన్’తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటకుల మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(అక్టోబర్ 14) విడుదలైన ఈ ‘క్రేజీ ఫెల్లో’ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభిరామ్ అలియాస్ నాని ఓ క్రేజీ ఫెలో. చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలు(అనీష్, వినోదిని వైద్యనాథన్) గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్, పబ్స్, పార్టీలు తప్ప అతనికి వేరే ఏ పని ఉండదు. పైగా ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అభి అతి వల్ల స్నేహితుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇక తమ్ముడిని ఇలానే వదిలేస్తే.. పనికిరాకుండా పోతాడని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు అన్నయ్య. అక్కడ మధుమతి(దిగంగనా సూర్యవంశీ)ని చూస్తాడు అభి. వీరిద్దరికి ఒకరంటే ఒకరు పడదు. గతంలో అభి వేసిన వెధవ వేషాలు తెలిసి మధుమతి అతనికి దూరంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా వీరిద్దరు ఓ డేటింగ్ యాప్ ద్వారా స్నేహితులు అవుతారు. అయితే ఆ యాప్‌లో వీరిద్దరు వేరు వేరు పేర్లు, ఫోటోలు అప్లోడ్ చేస్తారు. వారిద్దరు కాస్త క్లోజ్ అయ్యాక మధుమతికి చిన్ని అని ముద్దు పేరు పెడతాడు అభి. ఇలా చాటింగ్ ద్వారా క్లోజ్ అయ్యాక.. ఓ రోజు కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలో మరో అమ్మాయిని(మిర్నా మీనన్) చూసి చిన్ని అనుకొని ప్రపోజ్ చేస్తాడు. అనూహ్యంగా ఆమె పేరు కూడా చిన్ని కావడం.. అతను ప్రపోజ్ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో గొడవలు జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అభి ప్రేమించిన చిన్నిని కాకుండా ప్రపోజ్ చేసిన చిన్నితో పెళ్లికి రెడీ అవుతాడు. మరి తాను చాటింగ్ చేసిన చిన్నియే మధుమతి అని అభికి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఇన్నాళ్లు తాను గొడవపడిన అభిరామే తను ప్రేమించిన నాని అని తెలుసుకున్న మధుమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పుడు డేటింగ్ యాప్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. అలాంటి ట్రెండింగ్ పాయింట్‌ని పట్టుకొని కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. కథలో కొత్తదనం లేదు కాని కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. డేటింగ్ యాప్ ద్వారా అభి, మధుమతి పరిచయం కావడం.. చూడకుండానే ప్రేమలో పడడం, చివరికి ఒకరికి బదులు మరొకరిని కలవడం..స్టోరీ వినడానికి ఇలా రొటీన్‌గా ఉన్న.. దానికి కామెడీ మిక్స్ చేసి కథనాన్ని నడపడం ‘క్రేజీ ఫెలో’కి ప్లస్ అయింది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఆది, నర్రా శ్రీనివాస్ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌పై కూడా దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇద్దరి హీరోయిన్లతో చాలా చోట్ల భావోద్వేగాలను పండించోచ్చు. కానీ దర్శకుడు దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ప్రేమ విషయంలో కూడా అదే చేశాడు. ముఖ్యంగా రెండో హీరోయిన్ మిర్నా మీనన్, హీరోతో లవ్‌లో పడే సన్నివేశాలు మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్. ఏడాదిలో ఆరేడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ప్రతి సినిమాలోనూ ఆది ఒకే లుక్‌లో కనిపించడంతో కొత్తదనం లోపించినట్లు అనిపించేది. కానీ ‘క్రేజీ ఫెలో’తో ఆది తనపై ఉన్న విమర్శకు చెక్ పెట్టాడు. తెరపై కొత్త లుక్‌లో కనిపించి అలరించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలోనూ మెరుగయ్యాడు. ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకునే అభి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించడంతో పాటు యాక్షన్స్ సీన్స్, డ్యాన్స్ ఇరగదీశాడు. మధుమతి గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది కానీ ప్రతి సన్నివేశానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. చిన్ని పాత్రలకు మిర్నా మీనన్ న్యాయం చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ రమేశ్ పాత్రలో నర్రా శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఆది, నర్రా శ్రీనివాస్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. . హీరో వదినగా వినోదిని వైద్యనాథ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె డబ్బింగ్ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో బ్రదర్‌గా అనీష్ కురువిల్లా, స్నేహితులుగా సాయి, సాయితేజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు ఉన్నాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ సత్య గిడుతూరి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను
‘‘క్రేజీ ఫెలో’ని ఎంజాయ్ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు... ► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్‌లోనూ ఫణి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. కథలో సెకండాఫ్ మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్ లుక్ ట్రై చేశాను.. బరువు తగ్గాను. ► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్ ఆ క్లయిమాక్స్ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్మెంట్ బాగుంటుంది. ► ప్రస్తుతం ‘టాప్ గేర్’, ‘సీఎస్ఐ: సనాతన్’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్ చేశాను. నవంబరులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావొచ్చు. ‘అమరన్ ఇన్ సిటీ’ సినిమా షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. -
ఇప్పుడు అదే పెద్ద సవాల్
‘‘నేను కాంబినేషన్‌ని కాదు.. కథని బలంగా నమ్ముతాను. ‘క్రేజీ ఫెలో’ బలమైన కథ. ఫణికృష్ణ కొత్తవాడైనా సినిమాని చక్కగా తీశాడు. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే క్లీన్ సినిమా ఇది’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ కథని ముందు ఆదికి వినిపించాడు ఫణికృష్ణ. ఆ తర్వాత నేను విన్నాను, నచ్చింది. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ క్రేజీగా, కొత్తగా ఉంటుంది. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీకి అలవాటుపడ్డారు. అంతర్జాతీయ స్థాయి కంటెంట్ దొరుకుతుండటంతో వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో పాటు వారిని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక–నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ‘క్రేజీ ఫెలో’ మంచి కంటెంట్ ఉన్న వినోదాత్మక చిత్రం.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారనే నమ్మకం ఉంది. నిర్మాతలకు ప్రస్తుతం రెవెన్యూ ఆప్షన్స్ పెరిగినప్పటికీ మిగిలేది ఏమీ లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో పాటు సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడమే కారణం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ కార్పొరేట్ స్టయిల్లో ఉంది.. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం ఆయుష్ శర్మ హీరోగా హిందీ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
అది దర్శక నిర్మాతలకు ఒక సవాల్: కేకే.రాధామోహన్
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన మారింది. ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. వరల్డ్ సినిమా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ కంటెంట్ దొరకుతుంది. వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం ఇప్పుడు దర్శక నిర్మాతలకు సవాల్‌గా మారింది’అని నిర్మాత కేకే. రాధామోహన్ అన్నారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రమిది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా కేకే.రాధామోహన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ కారణంగా ఆగిన చిత్రాలు గత మూడు నెలలుగా వరుసగా విడుదలౌతున్నాయి. సెప్టెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ 14 మంచి డేట్ అనిపించింది. అందుకే ఆ రోజు విడుదల చేస్తున్నాం. క్రేజీ ఫెలో మంచి వినోదం ఉన్న చిత్రం. ప్రేక్షకులు థియేటర్ కి వస్తారనే నమ్మకం ఉంది. ► క్రేజీ ఫెలో కథ చాలా బాగుంటుంది. నేను కథనే బలంగా నమ్ముతాను. బలమైన కథ ఇది. నూతన దర్శకుడు ఫణి కృష్ణ చెప్పినట్లే చక్కగా తీశారు. ఆదికి సరిపడే కథ ఇది. ఆది లుక్ డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. కథలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది. చాలా క్లీన్ సినిమా. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసి ఒక రెండున్నర గంటలు పాటు హాయిగా ఎంజాయ్ చేసే సినిమా క్రేజీ ఫెలో. ► ప్రస్తుతం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సవాల్‌గా మారింది. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్ కి వెళ్ళాలా ? ఓటీటీలో చూడాలా ? అని నిర్ణయించుకుంటున్నారు. ప్పుడు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ► ఇప్పుడు ఇండస్ట్రీలో రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. శాటిలైట్, ఓటీటీ.. ఇలా రెవెన్యూ ఆప్షన్స్ పెరిగాయి. అయితే ఇందులో నిర్మాతకు మిగిలేది ఏమీ లేదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక రోజు షూటింగ్‌కి రూ. 3 లక్షలు ఖర్చు అయితే ఇప్పుడు 8 లక్షలు అవుతుంది. మార్కెట్ ని అర్ధం చేసుకుంటూ కథకు తగిన వనరులు సమకూర్చుకుని నిర్మాణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది. ► ప్రస్తుతం ఆయుష్ శర్మ తో ఒక హిందీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేశాం. త్వరలోనే వివరాలు తెలియజేస్తాం.