‘‘నేను కాంబినేషన్‌ని కాదు.. కథని బలంగా నమ్ముతాను. ‘క్రేజీ ఫెలో’ బలమైన కథ. ఫణికృష్ణ కొత్తవాడైనా సినిమాని చక్కగా తీశాడు. యూత్, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే క్లీన్ సినిమా ఇది’’ అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వహించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ కథని ముందు ఆదికి వినిపించాడు ఫణికృష్ణ. ఆ తర్వాత నేను విన్నాను, నచ్చింది. ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ క్రేజీగా, కొత్తగా ఉంటుంది. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు ఓటీటీకి అలవాటుపడ్డారు. అంతర్జాతీయ స్థాయి కంటెంట్ దొరుకుతుండటంతో వారి అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో పాటు వారిని ఆకట్టుకునే కంటెంట్ ఇవ్వడం దర్శక–నిర్మాతలకు ఒక సవాల్‌గా మారింది. ‘క్రేజీ ఫెలో’ మంచి కంటెంట్ ఉన్న వినోదాత్మక చిత్రం.. ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారనే నమ్మకం ఉంది. నిర్మాతలకు ప్రస్తుతం రెవెన్యూ ఆప్షన్స్ పెరిగినప్పటికీ మిగిలేది ఏమీ లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో పాటు సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడమే కారణం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీ కార్పొరేట్ స్టయిల్‌లో ఉంది.. నేను కూడా ఇలానే సినిమాలు చేయడానికే ఇష్టపడతాను. ప్రస్తుతం ఆయుష్ శర్మ హీరోగా హిందీ సినిమా నిర్మిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment