Crazy Fellow Movie Review and Rating in Telugu - Sakshi
Sakshi News home page

Crazy Fellow Review: ‘క్రేజీ ఫెలో’ మూవీ రివ్యూ

Published Fri, Oct 14 2022 1:35 PM | Last Updated on Fri, Oct 14 2022 2:46 PM

Crazy Fellow Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: క్రేజీ ఫెలో
నటీనటులు: ఆది సాయికుమార్‌, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్‌, అనీష్‌ కురువిల్లా, వినోదిని వైద్యనాథన్‌, నర్నా శ్రీనివాస్‌, సప్తగిరి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌
నిర్మాత: కే.కే. రాధామోహన్‌
దర్శకుడు: ఫణికృష్ణ సిరికి
సంగీతం: ఆర్‌.ఆర్‌. ధృవన్‌
సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల
ఎడిటర్‌: సత్య గిడుతూరి
విడుదల తేది: అక్టోబర్‌ 14, 2022

యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇటీవలె ‘తీస్‌మార్‌ ఖాన్‌’తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయగా.. ఇప్పుడు ‘క్రేజీ ఫెలో’అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, పాటకుల మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారం(అక్టోబర్‌ 14) విడుదలైన ఈ ‘క్రేజీ ఫెల్లో’ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
అభిరామ్‌ అలియాస్‌ నాని ఓ క్రేజీ ఫెలో. చిన్నప్పుడు తల్లిదండ్రులు మరణించడంతో అన్నావదినలు(అనీష్‌, వినోదిని వైద్యనాథన్‌) గారాబంగా పెంచుతారు. ఫ్రెండ్స్‌, పబ్స్‌, పార్టీలు తప్ప అతనికి వేరే ఏ పని ఉండదు. పైగా ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. అభి అతి వల్ల స్నేహితుడి పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇక తమ్ముడిని ఇలానే వదిలేస్తే.. పనికిరాకుండా పోతాడని స్నేహితుడి కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు అన్నయ్య. అక్కడ మధుమతి(దిగంగనా సూర్యవంశీ)ని చూస్తాడు అభి. వీరిద‍్దరికి ఒకరంటే ఒకరు పడదు. గతంలో అభి వేసిన వెధవ వేషాలు తెలిసి మధుమతి అతనికి దూరంగా ఉంటుంది.  

అయితే అనూహ్యంగా వీరిద్దరు ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా స్నేహితులు అవుతారు. అయితే ఆ యాప్‌లో వీరిద్దరు వేరు వేరు పేర్లు, ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తారు. వారిద్దరు కాస్త క్లోజ్‌ అయ్యాక మధుమతికి చిన్ని అని ముద్దు పేరు పెడతాడు అభి. ఇలా చాటింగ్‌ ద్వారా క్లోజ్‌ అయ్యాక..  ఓ రోజు కలుద్దామని అనుకుంటారు. ఆ సమయంలో మరో అమ్మాయిని(మిర్నా మీనన్‌) చూసి చిన్ని అనుకొని ప్రపోజ్‌ చేస్తాడు. అనూహ్యంగా ఆమె పేరు కూడా చిన్ని కావడం.. అతను ప్రపోజ్‌ చేయడాన్ని ఆమె కుటుంబ సభ్యులు చూడడంతో గొడవలు జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల అభి ప్రేమించిన చిన్నిని కాకుండా ప్రపోజ్‌ చేసిన చిన్నితో పెళ్లికి రెడీ అవుతాడు. మరి తాను చాటింగ్‌ చేసిన చిన్నియే మధుమతి అని అభికి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఏం జరిగింది? ఇన్నాళ్లు తాను గొడవపడిన అభిరామే తను ప్రేమించిన నాని అని తెలుసుకున్న మధుమతి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరకు అభి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
ఇప్పుడు డేటింగ్‌ యాప్‌ ట్రెండ్‌ జోరుగా సాగుతుంది. అలాంటి ట్రెండింగ్‌ పాయింట్‌ని పట్టుకొని కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు ఫణికృష్ణ సిరికి. కథలో కొత్తదనం లేదు కాని కామెడీ మిక్స్‌ చేసి కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. డేటింగ్‌ యాప్‌ ద్వారా అభి, మధుమతి పరిచయం కావడం.. చూడకుండానే ప్రేమలో పడడం, చివరికి ఒకరికి బదులు మరొకరిని కలవడం..స్టోరీ వినడానికి ఇలా రొటీన్‌గా ఉన్న.. దానికి కామెడీ మిక్స్‌ చేసి కథనాన్ని నడపడం ‘క్రేజీ ఫెలో’కి ప్లస్‌ అయింది.  ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్‌ అయింది.

ముఖ్యంగా ఆది, నర్రా శ్రీనివాస్‌ మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. కామెడీతో పాటు ఎమోషన్స్‌పై కూడా దర్శకుడు కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. ఇద్దరి హీరోయిన్లతో చాలా చోట్ల భావోద్వేగాలను పండించోచ్చు. కానీ దర్శకుడు దానిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ప్రేమ విషయంలో కూడా అదే చేశాడు. ముఖ్యంగా రెండో హీరోయిన్‌ మిర్నా మీనన్‌, హీరోతో లవ్‌లో పడే సన్నివేశాలు మరింత బలంగా చూపిస్తే బాగుండేదేమో. క్లైమాక్స్‌ కూడా రొటీన్‌గా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే..
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌. ఏడాదిలో ఆరేడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ప్రతి సినిమాలోనూ ఆది ఒకే లుక్‌లో కనిపించడంతో కొత్తదనం లోపించినట్లు అనిపించేది. కానీ ‘క్రేజీ ఫెలో’తో ఆది తనపై ఉన్న విమర్శకు చెక్‌ పెట్టాడు. తెరపై కొత్త లుక్‌లో కనిపించి అలరించాడు. గత సినిమాలతో పోలిస్తే నటన విషయంలోనూ మెరుగయ్యాడు. ఏ విషయాన్ని పూర్తిగా వినకుండా కష్టాలను కొని తెచ్చుకునే అభి పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో నవ్వించడంతో పాటు యాక్షన్స్‌ సీన్స్‌, డ్యాన్స్‌ ఇరగదీశాడు.

మధుమతి గా దిగంగనా సూర్యవంశీ ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది కానీ ప్రతి సన్నివేశానికి  ఒకే ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినట్లు కనిపిస్తుంది. చిన్ని పాత్రలకు మిర్నా మీనన్‌ న్యాయం చేసింది. ఆఫీస్‌ అసిస్టెంట్‌ రమేశ్‌ పాత్రలో నర్రా శ్రీనివాస్ ఒదిగిపోయాడు. ఆది, నర్రా శ్రీనివాస్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ బాగా వర్కౌట్‌ అయింది. . హీరో వదినగా వినోదిని వైద్యనాథ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె డబ్బింగ్‌ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరో బ్రదర్‌గా అనీష్‌ కురువిల్లా, స్నేహితులుగా సాయి, సాయితేజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే..  ఆర్‌.ఆర్‌. ధృవన్‌ సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా పాటలు ఉన్నాయి.  సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ సత్య గిడుతూరి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాత విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement