టైటిల్: శివం భజే
నటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు
నిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మంట్స్
నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం: అప్సర్
సంగీతం: వికాస్ బడిస
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
విడుదల తేది: ఆగస్ట్ 1, 2024
ప్రస్తుతం టాలీవుడ్‌లో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు డివోషనల్ టచ్ ఉన్న కథలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిన తాజా చిత్రమే ‘శివం భజే’. ‘హిడింబ’ తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంలో ‘శివం భజే’పై బజ్ క్రియేట్ అయింది. మరి డివోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
చందు(అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఓ కారు ఈఎమ్‌ఐ వసూలు చేస్తున్న క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. శైలజ ఓ కెమికల్ ల్యాబ్‌లో పని చేస్తుంది. ఓ రోజు శైలజను కలిసేందుకు వెళ్లిన చందు ఆమె ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవ కారణంగా అతను కంటి చూపు కోల్పోతాడు. దాంతో వైద్యులు అతనికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. కొత్త కళ్లు వచ్చిన తర్వాత చందు ప్రవర్తనలో మార్పు వస్తుంది. డే మొత్తం నిద్రబోతూ.. నైట్ టైమ్‌లో మెలకువగా ఉంటాడు. అంతేకాకుండా అతని మైండ్‌లో రెండు హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదులుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే..అతని కళ్లకు సంబంధించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? అసలు ఆ కళ్లు ఎవరివి? అతని కలలోకి వస్తున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చైనా-పాకిస్తాన్ కలిసి ‘ఆపరేషన్ లామా’పేరుతో భారత్‌పై చేస్తున్న కుట్ర ఏంటి? ‘ఆపరేషన్ లామా’కు సాధారణ వ్యక్తి చందుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కొన్ని కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ తెరపై చూస్తున్నప్పడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించినప్పుడే ఫలితం ఉంటుంది. అయితే ‘శివం భజే’ విషయంలో అది కొంతవరకు మాత్రమే ఫలించింది. వాస్తవానికి దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్‌ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషినల్..ఇలా ఐదారు జానార్లతో కలిపి ఈ కథ రాసుకున్నాడు. జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది.
ఇండియా పై పాకిస్తాన్..చైనా చేసే కుట్ర సీన్ తో సినిమా ప్రారంభం అవ్తుంది. ఆ తరువాత వరుస హత్యలు..పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక వైపు.. హీరో..హీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వైపు నడుస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. సెకండాఫ్ లో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. జీనోట్రాన్స్‌ప్లాంటేషన్ రివీల్ అవ్వడం..ఆ తర్వాత వెంటనే ‘డోగ్రా’ గురించి తెలియడం..దాని నేపథ్యం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ వరుస హత్యలపై పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్.. కాంతార లెవల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. కథ మాదిరే స్క్రీన్‌ప్లేని కూడా మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అవలీలగా నటించగలడు. తొలిసారి ఆయన ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిగా నటించాడు. రికవరీ ఏజెంట్ చందుగా ఆయన చక్కగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో అశ్విన్ నటవిశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి ఇందులో పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. ఏసీపీ మురళీగా అర్బాజ్ ఖాన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. వికాస్ బడిస నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- రేటింగ్: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment